breaking news
budgeting
-
ఆడుతూ.. పాడుతూ.. డబ్బు పాఠాలు
పిల్లలకు ఆర్థిక అక్షరాస్యత నేర్పించడం చాలా ముఖ్యం. ఈ వేసవి సేలవుల్లో తల్లిదండ్రులు విభిన్న వయసు కలిగిన పిల్లలు, యువతకు వైవిధ్యంగా, ఆకర్షణీయంగా డబ్బుకు సంబంధించిన అంశాలను తెలియజేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో మనీ మేనేజ్మెంట్ విషయాలపై బలమైన పునాది నిర్మిస్తే పొదుపు, దీర్ఘకాలంలో సమకూరే ప్రయోజనాలపై స్పష్టత ఏర్పడుతుంది. వయసు వారీగా పిల్లలకు ఎలా డబ్బు అంశాలు తెలియజేయాలో చూసేద్దాం.వయసు 3–5 ఏళ్లునాణేలు, కరెన్సీని గుర్తించడంపై అవగాహన కల్పించాలి. డబ్బు ద్వారా వస్తువులను కొనుగోలు చేయవచ్చని అర్థం చేయించేలా అవసరాలు, ఆ అవసరాల మధ్య తేడాను గుర్తించేలా చెప్పేందుకు ప్రయత్నించాలి. కథలు చెప్పడం, ఆడించడం లేదా నాటకం రూపంలో దుకాణంలో వస్తువులను కొనుగోలు చేయడం, డబ్బు ఇవ్వడం, తీసుకోవడం.. వంటి వాటిని తెలియజేయాలి.వయసు 6–13పొదుపు చేయడం, ఖర్చు చేయడం, ఈ రెండింటి మధ్య తేడాలు, ఖర్చు అధికమైతే కలిగే నష్టాలను చెప్పాలి. బేసిక్ బడ్జెటింగ్ సూత్రాలు చెప్పాలి. పిల్లలు ఏదైనా వస్తువు కొనాలంటే డబ్బు ఎలా వస్తుందో చెబుతూ.. ఇంట్లో చిన్నచిన్న పనులు చేయమని చెప్పాలి. అందుకు కొంత మొత్తంలో డబ్బు ఇవ్వండి. దాంతో రెండు ప్రయోజనాలుంటాయి. డబ్బు సంపాదించేందుకు ఎంత కష్టపడాలో తెలుస్తుంది. దాన్ని ఎలా ఖర్చు చేయాలో ఆలోచిస్తారు. అనవసర వస్తువులకు డబ్బు ఖర్చు చేసిన తర్వాత ఏదైనా అత్యవసర సమయాల్లో మనీ కావాలంటే మళ్లీ కష్టపడాల్సి వస్తుందనే భావనను తెలియజేయాలి. పొదుపుపై అవగాహన పెంచాలి. డబ్బును కిట్టీ బ్యాంకులో జమ చేయడం అలవాటు చేయాలి.టీనేజ్ (14+)క్రెడిట్, వడ్డీ, పెట్టుబడి, పన్నుల గురించి చర్చించాలి. బ్యాంక్ స్టేట్మెంట్ చదవడం లేదా యాప్‌లు, స్ప్రెడ్ షీట్లను ఉపయోగించి ఖర్చులను ట్రాక్ చేయడం ఎలాగో నేర్పించాలి.షాపింగ్ వెళ్తున్నారా..వేసవి సెలవులు ఇంకొన్ని రోజుల్లో ముగుస్తాయి. పుస్తకాలు, బట్టలు ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు పిల్లలు తల్లిదండ్రులతో షాపింగ్‌మాళ్లకు వెళ్తుంటారు. దుకాణాల వద్ద ధరలను గమనించాలి. డిస్కౌంట్లను చర్చించాలి. బ్రాండ్లలో ఉండే తేడాలు పరిశీలించాలి. లోకల్ షాపులోనూ అదే తరహా వస్తువులు లభిస్తాయి. కానీ రెండింటి మధ్య తేడాలేమిటో అడిగి తెలుసుకోవాలి. ఇతర దేశాల వస్తువులపై ఏమేరకు పన్నులు విధిస్తున్నారో తెలుసుకోవాలి. ఆ పన్నుల వల్ల కంపెనీలు, వినియోగదారులపై కలిగే ప్రభావాలను గమనించాలి.ఇదీ చదవండి: బెస్ట్ క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు ఇచ్చే క్రెడిట్ కార్డులుపిల్లలు బడ్జెట్ తయారు చేసుకోవాలి. బడ్జెట్ సమయంలో 50-30-20 నియమాన్ని పాటించాలి. అంటే నిత్యం అవసరాల కోసం చేసే తప్పనిసరి ఖర్చుకు మొత్త రాబడిలో 50 శాతం, కోరికల కోసం 30 శాతం, పొదుపునకు మరో 20 శాతం కేటాయించాలి. కుటుంబ బడ్జెట్ రాసేప్పుడు పిల్లలను కూడా అందులో భాగస్వామ్యం కావాలి. -
మాకు కావాలి.. జెండర్ బడ్జెటింగ్
ముంబైకి చెందిన శ్రీజ సైన్స్ గ్రాడ్యుయేట్. ‘బడ్జెట్’ లేదా ‘బడ్జెట్‌కు సంబంధించిన విశేషాలు’ ఆమెకు ఏమంత ఆసక్తిగా ఉండేవి కావు. ఆరోజు బడ్జెట్ రోజు. ఒకప్పుడు తనతోపాటు కలిసి చదువుకున్న రూప తనను అడిగింది... ‘ఇది జెండర్ బడ్జెటే అంటావా?’ అని. శ్రీజకు ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. నిజం చెప్పాలంటే ‘జెండర్ బడ్జెట్’ అనే మాట వినడం తనకు తొలిసారి. దీని గురించి ఫ్రెండ్‌ను అడిగి తెలుసుకుంది. ఆరోజు మొదలైన ఆసక్తి తనను పబ్లిక్బడ్జెట్ను విశ్లేషిస్తూ జెండర్ బడ్జెటింగ్‌పై ప్రత్యేకంగా నోట్స్ రాసుకునేలా చేసింది. ‘బడ్జెట్ అనేది ఆర్థికవేత్తలు, ఎకనామిక్స్ స్టూడెంట్స్ వ్యవహారం అన్నట్లుగా ఉండేది నా ధోరణి. ఇది తప్పని, బడ్జెట్ అనేది మన జీవితానికి ముడిపడి ఉన్న విషయమని తెలుసుకోవడంలో కాస్త ఆలస్యం అయింది. ఇప్పుడు మాత్రం బడ్జెట్ విషయాలపై చాలా ఆసక్తి చూపుతున్నాను’ అంటుంది శ్రీజ. ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు, ప్రవేశ పెట్టిన తరువాత మహిళా పారిశ్రామికవేత్తలు, ఉద్యమకారుల నుంచి తరచుగా వచ్చే మాట... జెండర్ బడ్జెటింగ్ లేదా జెండర్ సెన్సిటివ్ బడ్జెటింగ్. ఏమిటిది? స్థూలంగా చెప్పాలంటే బడ్జెట్‌ను జెండర్ దృక్పథం నుంచి పరిశీలించి, విశ్లేషించడం. దీనివల్ల ఏమవుతుంది? నిపుణుల మాటల్లో చెప్పాలంటే...అసమానతలు, పక్షపాతధోరణులు లేకుండా చేయగలిగే మందు ఇది. స్త్రీ, పురుష ఉద్యోగులలో జీతభత్యాల మధ్య వ్యత్యాసం నుంచి వనరుల పంపకం వరకు తేడా లేకుండా చేయడానికి మార్గనిర్దేశం చేస్తుంది. సంస్థాగత స్థాయిలో ప్రభుత్వసంస్థల విధానాలను పదునుగా విశ్లేషిస్తుంది. రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక, ఆర్థిక సంక్షేమం, భద్రత, విద్య... మొదలైన వాటిలో లింగవివక్షతకు తావు ఇవ్వని విధానం రూపుదిద్దుకునేలా తోడ్పడుతుంది. ‘లింగ వివక్ష’కు కారణమయ్యే రాజకీయ, ప్రాంతీయ, సాంస్కృతిక పరిమితులను ప్రశ్నిస్తుంది. మహిళలకు సంబంధించిన సోషల్ రీప్రొడక్షన్ రోల్స్ పబ్లిక్ బడ్జెట్లో గుర్తింపుకు నోచుకోవనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో ‘జెండర్ బడ్జెటింగ్’కు ప్రాధాన్యత పెరిగింది. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ప్రతికూలతల నేపథ్యంలో గతంతో పోల్చితే ‘జెండర్ బడ్జెటింగ్’ కు మరింత ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. ‘కోవిడ్ సృష్టించిన కల్లోలం ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌ను మొదలు పెట్టాలనుకునేవారికి శాపంలా మారింది. ఎంతో కష్టపడి కంపెనీలు నిర్వహిస్తున్నవారు నష్టాలతో పాలుపోలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి పన్ను మినహాయింపు ఇవ్వాలి. జెండర్ బడ్జెటింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి’ అంటారు ఫ్లోరెన్స్ క్యాపిటల్ సీయీవో పోషక్ అగర్వాల్. ‘ఎన్నికలలో రాజకీయ పార్టీలు మహిళలను ఆకట్టుకోవడానికి రకరకాల వాగ్దానాలు చేస్తుంటాయి. అయితే వారి ఎన్నికల మ్యానిఫెస్టోలో జెండర్ బడ్జెటింగ్ అనే మాట కనిపించదు. ఇప్పటికైనా ఈ ధోరణిలో మార్పు రావాలి’ అంటారు తిరువనంతపురం (కేరళ)కు చెందిన లీనా. కొన్ని యూనిట్లు రకరకాల కారణాల వల్ల నాన్–పెర్ఫార్మింగ్ అసెట్స్(ఎన్పీఏఎస్) జాబితాలోకి వెళ్లిపోతున్నాయి. ఒక్కసారి ‘ఎన్పీఏఎస్’ ముద్ర పడిన తరువాత మహిళా పారిశ్రామికవేత్తల పరిస్థితి మరింత దిగజారుతుంది. దాంతో ఆ పారిశ్రామిక వేత్తలు పోరాటస్ఫూర్తిని కోల్పోయి నిస్తేజంగా మారుతున్నారు. ఎన్పీఏఎస్ జాబితాలో చేరిన తరువాత మహిళా వ్యాపారవేత్తలకు రుణాలు ఇవ్వడం లేదు. ఈ ధోరణిలో మార్పు రావాలంటుంది లేడి ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ (ఎంఎస్ఎంఈ) లేదా చిన్న తరహా వ్యాపారాలలో ఎంతోమంది మహిళలు ఉన్నారు. వారు ‘కేంద్ర బడ్జెట్ 2022’పై ఆశలు పెట్టుకున్నారు. వారి విజ్ఞప్తులలో ప్రధానమైనది బ్యాంక్‌లోన్‌కు సంబంధించిన వడ్డీరేటు తగ్గించాలనేది. ‘స్పెషల్ కోవిడ్ ఇన్సెంటివ్’ ప్రకటించాలని బలంగా కోరుకుంటున్నారు. వేగంగా పుంజుకోవడానికి, దూసుకెళ్లడానికి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఈ విషయంలో బ్యాంకులు ఉదారంగా ఉండాలని కోరుకుంటున్నారు. టెక్నాలజీ అప్గ్రేడెషన్కు సంబంధించి ‘ఎంఎస్ఎంఈ’లకు బ్యాంకుల నుంచి తగిన సహకారం అందడం లేదు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు, ఒక విజయం మరో విజయానికి స్ఫూర్తి ఇస్తుంది. అయితే కోవిడ్ తుఫాను ఎన్నో దీపాలను ఆర్పేసింది. ఈ నేపథ్యంలో సానుభూతి కంటే చేయూత ముఖ్యం అంటున్నారు మహిళా పారిశ్రామికవేత్తలు. ‘విజయాల మాటేమిటోగానీ, ఉనికే కష్టంగా మారే పరిస్థితి వచ్చింది. అట్టడుగు వర్గాలు, గ్రామీణప్రాంతాలలో ఎంతోమంది మహిళా వ్యాపారులు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు. వారు నిలదొక్కువడానికి ప్రభుత్వం పూనుకోవాలి’ అంటుంది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. విద్యారంగంపై దృష్టిపెట్టినట్లే పారిశ్రామిక రంగంపై దృష్టిపెట్టాలని, అప్పుడే సక్సెస్ఫుల్ ఫిమేల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తారనేది అందరి నమ్మకం. పది మందికి ఉపాధి చూపుతూ, వందమందికి ఆదర్శంగా నిలుస్తున్న చిన్నతరహా మహిళా వ్యాపారులకు అండగా ఉండే ఆశావహపరిస్థితిని బడ్జెట్ నుంచి ఆశిస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. ‘ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ఎలా తయారవుతారు?’ అనే ప్రశ్నకు ‘ఉన్నత విద్యాసంస్థలలో చదువుకున్నవారు, ఉన్నత విద్యను అభ్యసించినవారు’ అనేది సరిౖయెన జవాబు కాదు. అది కాలానికి నిలిచే సమాధానం కూడా కాదు. అయితే, కాలానికి ఎదురీది కూడా నిలదొక్కునేవారే నిజమైన వ్యాపారులు అంటారు. దీనికి ప్రభుత్వ సహకారం కావాలి. ఆ సహకారం వెలుగు బడ్జెట్లో కనిపించాలి. ‘జెండర్ బడ్జెటింగ్’అనేది ఎంత ఆకర్షణీయమైన మాటో, ఆచరణ విషయానికి వచ్చేసరికి రకరకాల దేశాల్లో రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి. దీనిలో సంప్రదాయ ఆలోచనదే అగ్రభాగం. అయితే ప్రసుత్తం మూస ఆలోచనలకు చెల్లుచీటీ పాడే కాలం వస్తుంది. ‘నిజంగానే మహిళాలోకం నిండు హర్షం వహిస్తుందా?’ అనే ప్రశ్నకు నేటి బడ్జెట్ సమాధానం చెప్పనుంది. పన్ను మినహాయింపుల ద్వారా మహిళ వ్యాపారవేత్తలను ప్రోత్సహించి నిలదొక్కుకునేలా చేయాలి. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలి. – శ్రేయ సబర్వాల్, స్కైర్–ఫోర్క్ సీయీవో -
మళ్లీ కిసాన్ వికాస్ పత్రాలు
సురక్షితమైన రాబడులను కోరుకునే చిన్న ఇన్వెస్టర్ల కోసం ప్రభుత్వం మళ్లీ కిసాన్ వికాస్ పత్రాలను (కేవీపీ) పునరుద్ధరించాలని నిర్ణయించింది. తాజా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది దుర్వినియోగం అవుతోందనే ఉద్దేశంతో 2011 నవంబర్‌లో దీన్ని ప్రభుత్వం రద్దు చేసింది. పెట్టిన పెట్టుబడి దాదాపు ఎనిమిదేళ్ల ఏడు నెలల్లో రెట్టింపు చేసే కిసాన్ వికాస్ పత్రాలు అత్యంత ఆదరణ పొందాయి. పేరులో కిసాన్ అని ఉన్నప్పటికీ ఇది కేవలం రైతులకు మాత్రమే ఉద్దేశించినది కాదు. ఎవరైనా వీటిలో ఇన్వెస్ట్ చేసేలా గతంలో నిబంధనలు ఉండేవి. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. అత్యంత తక్కువగా రూ. 100లైనా పెట్టుబడి పెట్టొచ్చు. ప్రభుత్వ హామీ ఉండే ఈ సేవింగ్ బాండ్స్‌ను పోస్టాఫీసుల్లో తీసుకోవచ్చు. ఇందుకోసం ఉద్దేశించిన ఫారంతో పాటు ఫొటోగ్రాఫ్‌లు, డిపాజిట్ చేయదల్చుకున్న మొత్తాన్ని ఇస్తే పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికెట్‌ను అందజేస్తుంది. ఇందులో మీ పేరు, డిపాజిట్ మొత్తం, మెచ్యూరిటీ తేదీ, మెచ్యూరిటీ తీరాక చేతికి ఎంత వస్తుంది వంటి వివరాలు ఉంటాయి. సాధారణంగా జారీ చేసిన తేదీ నుంచి రెండున్నరేళ్ల తర్వాత కావాలనుకుంటే వీటిని నగదు కింద మార్చుకోవచ్చు. ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు కిసాన్ వికాస్ పత్రాలను.. హామీగా కూడా ఉంచుకుని వివిధ రకాల రుణాలు ఇస్తుంటాయి. అయితే, వీటిపై వచ్చే వడ్డీ ఆదాయం మీద పన్ను మాత్రం కట్టాల్సి ఉంటుంది. ఇదంతా రద్దు చేయడానికి ముందు కిసాన్ వికాస్ పత్రాల స్వరూపం. తాజా స్వరూపం ఎలా ఉంటుందనేది ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
45 నిమిషాల ఫార్ములా
అనవసరమైనవి కొనొద్దు.. డబ్బు ఆదా చేయాలి అనుకోవడం, పక్కవాళ్లకి సలహాలు ఇవ్వడం సులభమే అయినా అమలు చేయాల్సి వస్తే మాత్రం చాలా కష్టమే. అందుకే బడ్జెట్‌కి కట్టుబడి ఉండాలని ఎంత ప్రయత్నించినా చాలా సందర్భాల్లో లక్ష్మణ రేఖ దాటేస్తూ ఉంటాం. ఇలా జరగకుండా జాగ్రత్తపడేందుకు ఎవరికి వారు కొంగొత్త ఫార్ములాలు ప్రయత్నిస్తుంటారు. అలాంటిదే 45 నిమిషాల ఫార్ములా కూడా. మన ఇళ్లలో కుర్చీలు, సోఫాలు, టీవీలు ఇలాంటివన్నీ కూడా రోజులో చాలా ఎక్కువ సేపే వినియోగంలో ఉంటాయి. ఇవి కాకుండా నిత్యావసరాలు, ఏవో కొన్ని తప్పనిసరివి పక్కన పెడితే మా ఇంట్లోనూ ఉన్నాయని చెప్పుకోవడానికి అలంకారప్రాయంగా కొనే ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా కొన్ని ఉంటాయి. హంగూ, ఆర్భాటాల కోసం కావొచ్చు మరేదైనా ఉద్దేశంతో కావొచ్చు ఇలాంటివి కొనేటప్పుడు ఈ ఫార్ములా బాగా ఉపయోగపడుతుంది. మనం కొనే వాటిని రోజులో కనీసం ఒక 45 నిమిషాలపాటైనా ఉపయోగిస్తామా లేదా అన్నది చూసుకుంటే.. వృథా కొనుగోళ్లను మానుకోవచ్చు. ఆ మాత్రం సమయం ఉపయోగపడితే వాటిని కొన్నందుకు గిట్టుబాటు అయినట్లే. ఎందుకంటే రోజుకు 45 నిమిషాలంటే ఏడాదికి దాదాపు 11 రోజులవుతుంది. ఈ లెక్కన చూస్తే సదరు వస్తువు ఏడాదిలో కనీసం 2 వారాల పాటైనా ఉపయోగించని పక్షంలో దాన్ని కొనడం వృథానే. ఇందుకోసం 45 నిమిషాల ఫార్ములానే పెట్టుకోవాలని రూలేం లేదు. ఎవరికి వారు తమ సౌలభ్యాన్ని బట్టి మార్చుకోనూ వచ్చు.