మహబూబ్‌నగర్: ప్రస్తుతం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభకు సన్నద్ధమవుతోంది. ఈ సభకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు మంగళవారం ప్రాజెక్టుల బాట పట్టారు. సంక్రాంతి తర్వాత కేసీఆర్ సభ ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం మహబూబ్‌నగర్‌నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తొలుత వచ్చేనెల మూడో తేదీన జడ్చర్ల నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటీ ప్రారంభోత్సవానికి రానున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే అంతకన్నా ముందుగానే మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నగరంలో సుమారు రూ.1,200 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి శుద్ధీకరణ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈనెల 10న ఓటర్ల తుది జాబితా ప్రకటించనుండగా.. ఆ తర్వాత పురపాలికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు నుంచే ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్‌ఎస్ ఎన్నికల శంఖారావం మోగించనున్నట్లు తెలుస్తోంది.


