స్వయం ఉపాధికి చేయూతనివ్వని సహకార ఆర్థిక సంస్థలు
ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అచేతన స్థితిలోకి
యువతకు ఉపాధి శిక్షణ కూడా అందించలేక నీరసించిన వైనం
సంక్షేమ శాఖల పరిధిలో ప్రస్తుతం 30 కార్పొరేషన్లు.. చైర్మన్లు మాత్రం కొన్నింటికే
సాక్షి, హైదరాబాద్: సహకార ఆర్థిక సంస్థలు.. సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతున్న ప్రత్యేక విభాగాలివి. ఈ కార్పొరేషన్ల ప్రధాన లక్ష్యం స్వయం ఉపాధిని ప్రోత్సహించడం.. రాయితీ అందిస్తూ స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు సహకరించడం... నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి యువతకు ఉపాధి మార్గాలను చూపించడం. కానీ ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన ఈ కార్పొరేషన్లు ఇప్పుడు అచేతన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాయితీపై రుణాల సంగతి అటుంచితే యువతకు కనీసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సైతం నిర్వహించలేకపోతున్నాయి.
కాగితాల్లోనే వార్షిక ప్రణాళికలు..
రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలతోపాటు వికలాంగులు, మహిళల కోసం 30 సహకార ఆర్థిక సంస్థలు ఉన్నాయి. గతంలో 17 కార్పొరేషన్లు ఉండగా ప్రజాప్రభుత్వం కొత్తగా 13 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 30కి చేరింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు ఏటా భారీ ఎత్తున వార్షిక ప్రణాళికలు రూపొందిస్తుండగా వాటిని ప్రభుత్వం ఆమోదిస్తోంది. కానీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయట్లేదు. దీంతో నిర్దేశించిన కార్యక్రమాలన్నీ అటకెక్కుతున్నాయి. 2024–25 వార్షిక సంవత్సరం చివర్లో రాజీవ్ యువ వికాసాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టి రూ. 6 వేల కోట్ల మేర నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
అన్ని కార్పొరేషన్ల పరిధిలో ఈ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానించగా ఏకంగా 16 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. 2025–26 వార్షిక బడ్జెట్‌లో నిధులు విడుదల చేస్తామని మొదట్లో చెప్పుకొచ్చిన సర్కారు... రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు మంజూరు పత్రాల జాడ లేకపోగా కనీసం ఈ పథకంపై ఎలాంటి సమీక్ష నిర్వహించకపోవడం గమనార్హం.
మరోవైపు రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా ఈ కార్పొరేషన్లు మారుతున్నాయనే విమర్శలున్నాయి. పదవుల పందేరంలో భాగంగా ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడం... వారికి నెలవారీ జీతభత్యాల కింద భారీగా నిధులు ఇవ్వడం వరకే కార్పొరేషన్లు పరిమితమవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో చైర్మన్‌కు జీతభత్యాల కింద ఏటా సగటున రూ. 50 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
ఐదు కార్పొరేషన్లకే కార్యాలయాలు..
⇒ బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 1974లో బీసీ కార్పొరేషన్ ఏర్పాటైంది. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో బీసీ కార్పొరేషన్‌తోపాటు ఎంబీసీ, రజక, నాయీ బ్రాహ్మణ, కల్లుగీత, వడ్డెర, సగర (ఉప్పర), వాలీ్మకి/బోయ, భట్రాజ, విశ్వబ్రాహ్మణ, కృష్ణబలిజ/పూసల, కుమ్మరి/శాలివాహన, మేదర, ముదిరాజ్, గంగపుత్ర, మున్నూరు కాపు, లింగాయత్, యాదవ, మేర, పద్మశాలి, పెరిక కార్పొరేషన్లతోపాటు ఈబీసీ సంక్షేమ బోర్డు కొనసాగుతున్నాయి. ఇందులో కేవలం ఐదింటికి మాత్రమే చైర్మన్లున్నారు. పెద్ద సంఖ్యలో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఐదింటికి మినహా మిగిలిన వాటికి కార్యాలయాలు సైతం లేవు. వాటిని బీసీ కార్పొరేషన్ కార్యాలయం నుంచే నిర్వహిస్తున్నారు.
⇒ ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయింది. ఈ కార్పొరేషన్‌ను మాల, మాదిగలకు వేర్వేరుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు ముందడుగు పడలేదు.
⇒ ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలోని ట్రైకార్‌ను మూడు కార్పొరేషన్లుగా ప్రభుత్వం మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివాసీల కోసం కుమురం భీం ఆదివాసీ కార్పొరేషన్, లంబాడాల కోసం సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల వర్గానికి ఏకలవ్య కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసింది. వాటిలో ట్రైకార్ చైర్మన్ కొనసాగుతున్నప్పటికీ విభజించిన కార్పొరేషన్లకు నీడ కూడా లేదు. ఉద్యోగుల కేటాయింపు, కార్యాలయాల ఏర్పాటు ఊసే లేదు.
⇒ మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో ఒక కార్పొరేషన్ ఉండగా అందులో ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీలకు వేర్వేరుగా కార్యకలాపాలు సాగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ముందడుగు పడలేదు.
⇒ వికలాంగుల సంక్షేమ శాఖ పరిధిలో తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ఉండగా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ కొనసాగుతోంది. వాటికి చైర్మన్లు ఉన్నారు.


