breaking news
cooperative bank loans
-
‘సహకారం’ ఏదీ..?
సాక్షి, హైదరాబాద్: సహకార ఆర్థిక సంస్థలు.. సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతున్న ప్రత్యేక విభాగాలివి. ఈ కార్పొరేషన్ల ప్రధాన లక్ష్యం స్వయం ఉపాధిని ప్రోత్సహించడం.. రాయితీ అందిస్తూ స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు సహకరించడం... నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి యువతకు ఉపాధి మార్గాలను చూపించడం. కానీ ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన ఈ కార్పొరేషన్లు ఇప్పుడు అచేతన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాయితీపై రుణాల సంగతి అటుంచితే యువతకు కనీసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సైతం నిర్వహించలేకపోతున్నాయి. కాగితాల్లోనే వార్షిక ప్రణాళికలు.. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలతోపాటు వికలాంగులు, మహిళల కోసం 30 సహకార ఆర్థిక సంస్థలు ఉన్నాయి. గతంలో 17 కార్పొరేషన్లు ఉండగా ప్రజాప్రభుత్వం కొత్తగా 13 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 30కి చేరింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు ఏటా భారీ ఎత్తున వార్షిక ప్రణాళికలు రూపొందిస్తుండగా వాటిని ప్రభుత్వం ఆమోదిస్తోంది. కానీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయట్లేదు. దీంతో నిర్దేశించిన కార్యక్రమాలన్నీ అటకెక్కుతున్నాయి. 2024–25 వార్షిక సంవత్సరం చివర్లో రాజీవ్ యువ వికాసాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టి రూ. 6 వేల కోట్ల మేర నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని కార్పొరేషన్ల పరిధిలో ఈ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానించగా ఏకంగా 16 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. 2025–26 వార్షిక బడ్జెట్లో నిధులు విడుదల చేస్తామని మొదట్లో చెప్పుకొచ్చిన సర్కారు... రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు మంజూరు పత్రాల జాడ లేకపోగా కనీసం ఈ పథకంపై ఎలాంటి సమీక్ష నిర్వహించకపోవడం గమనార్హం. మరోవైపు రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా ఈ కార్పొరేషన్లు మారుతున్నాయనే విమర్శలున్నాయి. పదవుల పందేరంలో భాగంగా ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడం... వారికి నెలవారీ జీతభత్యాల కింద భారీగా నిధులు ఇవ్వడం వరకే కార్పొరేషన్లు పరిమితమవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో చైర్మన్‌కు జీతభత్యాల కింద ఏటా సగటున రూ. 50 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఐదు కార్పొరేషన్లకే కార్యాలయాలు.. ⇒ బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 1974లో బీసీ కార్పొరేషన్ ఏర్పాటైంది. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో బీసీ కార్పొరేషన్‌తోపాటు ఎంబీసీ, రజక, నాయీ బ్రాహ్మణ, కల్లుగీత, వడ్డెర, సగర (ఉప్పర), వాలీ్మకి/బోయ, భట్రాజ, విశ్వబ్రాహ్మణ, కృష్ణబలిజ/పూసల, కుమ్మరి/శాలివాహన, మేదర, ముదిరాజ్, గంగపుత్ర, మున్నూరు కాపు, లింగాయత్, యాదవ, మేర, పద్మశాలి, పెరిక కార్పొరేషన్లతోపాటు ఈబీసీ సంక్షేమ బోర్డు కొనసాగుతున్నాయి. ఇందులో కేవలం ఐదింటికి మాత్రమే చైర్మన్లున్నారు. పెద్ద సంఖ్యలో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఐదింటికి మినహా మిగిలిన వాటికి కార్యాలయాలు సైతం లేవు. వాటిని బీసీ కార్పొరేషన్ కార్యాలయం నుంచే నిర్వహిస్తున్నారు. ⇒ ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయింది. ఈ కార్పొరేషన్‌ను మాల, మాదిగలకు వేర్వేరుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు ముందడుగు పడలేదు. ⇒ ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలోని ట్రైకార్‌ను మూడు కార్పొరేషన్లుగా ప్రభుత్వం మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివాసీల కోసం కుమురం భీం ఆదివాసీ కార్పొరేషన్, లంబాడాల కోసం సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల వర్గానికి ఏకలవ్య కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వాటిలో ట్రైకార్ చైర్మన్ కొనసాగుతున్నప్పటికీ విభజించిన కార్పొరేషన్లకు నీడ కూడా లేదు. ఉద్యోగుల కేటాయింపు, కార్యాలయాల ఏర్పాటు ఊసే లేదు. ⇒ మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో ఒక కార్పొరేషన్ ఉండగా అందులో ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీలకు వేర్వేరుగా కార్యకలాపాలు సాగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ముందడుగు పడలేదు. ⇒ వికలాంగుల సంక్షేమ శాఖ పరిధిలో తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ఉండగా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ కొనసాగుతోంది. వాటికి చైర్మన్లు ఉన్నారు. -
అంతర్జాతీయ సహకార మహాసభ.. ఒకే రంగానికి రెండు చట్టాలెందుకు?
పరస్పరం సహకరించుకోవటం మానవ సహజ లక్షణం. ఈ లక్షణాన్ని ఒక పద్ధతి ప్రకారం కొనసాగించడానికి సహకార సంఘాలు (కోఆపరేటివ్ సొసైటీలు) దోహదం చేస్తాయి. ప్రపంచ సహకార వ్యవస్థకు 130 ఏళ్ల చరిత్ర, సుసంపన్న వారసత్వం ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 12% మంది ఏదో ఒక సహకార సంఘంలో సభ్యులే. మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, వందేళ్లకు పైబడి చక్కగా ఆర్థిక సేవలందిస్తున్న ఘనమైన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పిఎసిఎస్‌లు), సహకార అర్బన్ బ్యాంకులు అనేకం కనిపిస్తాయి. ఈ నెల 14 నుంచి సహకార వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మరో రెండు ముఖ్య విశేషాలు... ఈ నెల 25 నుంచి 30 వరకు న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా అంతర్జాతీయ సహకార మహాసభ జరగబోతోంది.అంతర్జాతీయ మహాసభ మన దేశంలో జరగటం ఇదే మొదటిసారి. సుమారు రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఐక్యరాజ్యసమితి 2025వ సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ సహకార సంవత్సరం’గా ప్రకటించింది. ఈ పండుగకు కూడా ఈ నెల 25న ఉత్సాహపూరిత వాతావరణంలో న్యూఢిల్లీలో తెర లేవనుంది. సహకార విలువలకు తిలోదకాలు, అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం.. వంటి అవశ్యం వదిలించుకోవాల్సిన జాఢ్యాలు మన సహకార వ్యవస్థను పట్టి పీడిస్తున్నప్పటికీ.. మొక్కవోని సహకార స్ఫూర్తి మన సమాజంలో అనుక్షణం వర్థిల్లుతూనే ఉంటుంది. సహకారం కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది! ఈ నేపథ్యంలో తలపండిన సహకారవేత్తల అభిప్రాయాలు తెలుసుకుందాం. సహకార సంఘం అంటే?సభ్యుల ప్రయోజనాలను నెరవేర్చటమే లక్ష్యంగా పనిచేసే ప్రజాస్వామిక సంస్థ సహకార సంఘం. యాజమాన్యం, నియంత్రణ, నిర్వహణ అన్నీ సభ్యులదే. సభ్యుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అవసరాలు, ఆకాంక్షలను నెరవేర్చటమే సహకార సంఘాల ధ్యేయం. సహకారం రాష్ట్ర సబ్జెక్ట్.. కేంద్రం చట్టాలు ఎలా చేస్తుంది?ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య, ఒక దేశంలో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించటానికి సహకార వ్యవస్థ ఉపయోగపడుతుంది. చాలా దేశాల్లో సహకార వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఉంది. నెదర్లాండ్స్‌లో సహకార సంఘాలకు స్వేచ్ఛ ఎక్కువ. అధికారుల జోక్యం ఉండదు. ఫ్రాన్స్‌లో 2008లో ఆర్థిక మాంద్యం దెబ్బకు వాణిజ్య బ్యాంకులు నిలవలేక సహకార బ్యాంకుల్లో విలీనమయ్యాయి. అమెరికాలోనూ కమ్యూనిటీ బ్యాంకులు బలంగా ఉన్నాయి. జర్మనీలో రైతులకు ఎక్కువ రుణాలిస్తున్నది సహకార బ్యాంకులే. న్యూజిలాండ్‌లో డెయిరీ కోఆపరేటివ్లదే రాజ్యం. లాటిన్ అమెరికాలో ఇటీవల కోఆపరేటర్లు బలపడుతూ కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు.జవాబుదారీతనం ఏదీ?మన దేశంలో సహకార విస్తరణకు అవకాశాలెక్కువ. మన సంస్కృతిలోనే సహకార స్ఫూర్తి ఉంది. గ్రామీణులు, గిరిజనుల్లో ఇది మరీ ఎక్కువ. అయితే, అధికారులకు అధిక పెత్తనం ఇవ్వటం, జవాబుదారీతనం లేకుండా చేయటం వల్ల మన దేశంలో సహకార వ్యవస్థ దెబ్బతింటున్నది. ఆర్బీఐ నిబంధనలు, సహకార చట్టాల మధ్య వైరుధ్యం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను కుంగదీస్తోంది. సహకార విలువలను తుంగలో తొక్కేలా కొన్ని నిబంధనలు ఉంటున్నాయి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, మల్టీస్టేట్ కోఆపరేటివ్‌ల విషయంలో రాష్ట్ర సహకార చట్టాలు నిర్దేశించే నిబంధనలకు భిన్నమైన నిబంధనలను బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నిర్దేశిస్తోంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు షేర్ క్యాపిటల్ తిరిగి ఇవ్వొద్దని, డైరెక్టర్ల పదవీ కాలం నాలుగేళ్లేనని (సహకార చట్టాల ప్రకారం 5 ఏళ్లు).. ఇలా అనేక విషయాల్లో వైరుధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న 45 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో 20 బ్యాంకులు వందేళ్ల క్రితం నుంచి ఉన్నవే. ఇవి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక తోడ్పాటునూ పొందటం లేదు. పిఎసిఎస్‌లలో బ్యాంకింగ్ సేవలా?సహకారం పూర్తిగా రాష్ట్ర సబ్జెక్ట్. రాష్ట్రాలతో చర్చించకుండానే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టాలు చేస్తోంది. ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలతో ఇంకో 25 పనులు చేయించాలని కేంద్ర సహకార శాఖ నిర్దేశించింది. ఇందులో బ్యాంకింగ్ సేవలు కూడా ఉన్నాయి. నిధులు దుర్వినియోగం జరగకుండా పర్యవేక్షించేదెవరూ అంటే సమాధానం లేదు. ఇది సరికాదు. అమలు చేయాల్సింది రాష్ట్రాలైనప్పుడు సహకార రిజిస్ట్రార్, ముఖ్య కార్యదర్శితో కనీసం చర్చించకుండానే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటే ఎలా? సహకార సంస్థల్లో అక్రమాలకు బాధ్యులను జవాబుదారీ చేయటం లేదు. ఎంత అవినీతి జరిగినా రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్టులు, ఆస్తుల రికవరీ వంటి చర్యలు తీసుకోవటం లేదు. సహకార శాఖకు ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ జవాబుదారీతనం లేకుండా΄ోయింది. – మానం ఆంజనేయులు పూర్వ అధ్యక్షులు, విశాఖ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, పూర్వ ఉపాధ్యక్షులు, నాఫ్కాబ్ కేంద్రం తెచ్చిన కొత్తచట్టాలతో చేటుభారతీయ ఆర్థిక రంగంలో సహకార వ్యవస్థ వాటా 43% వుంది. రైతులు, గ్రామీణ చేతివృత్తిదారులు, బలహీన వర్గాలు ఈ సహకార వ్యవస్థలో భాగస్వాములు. గత 75 సంవత్సరాలుగా 29 కోట్ల మంది సభ్యులు తమ ఖర్చులు తగ్గించుకొని రూ.40,689 కోట్ల మూలధనంతో సుమారు 9 లక్షల సహకార సంఘాలను స్థాపించుకున్నారు. రూ. లక్షల కోట్ల సహకార ఆర్థిక సౌధాన్ని నిర్మించారు. దీన్ని అక్రమంగా పెట్టుబడిదారుల పరం చేయటానికి పార్లమెంటులో రెండు చట్టాలు చేశారు. వీటిని అమలుచేస్తే జిల్లా స్థాయి సహకార బ్యాంకుల నుంచి ఇఫ్కో, క్రిభ్కో, నాఫెడ్ వంటి పెద్ద సంస్థలన్నీ కారుచౌకగా పెట్టుబడిదారుల పరం అవుతాయి. సహకార సిద్ధాంతాలకు, సహకార సూత్రాలకు ఇది విరుద్ధం. మొత్తంగా భారత రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని రాజ్యాంగ సవరణ చేయకుండానే ఈ చట్టాలు మార్చేస్తున్నాయి. ప్రజలు చైతన్యవంతులై వీటిని అడ్డుకోవాలి. సహకార ధర్మపీఠం తరఫున దేశవ్యాప్త ప్రచారోద్యం చేపట్టాం. – సంభారపు భూమయ్య , సీనియర్ సహకారవేత్త, సహకార ధర్మపీఠం, హైదరాబాద్సహకార సంస్థల బలోపేతానికి దోహదంఅంతర్జాతీయ సహకార మహాసభ న్యూఢిల్లీలో ఈ నెలాఖరులో జరుపుకోవటం సంతోషదాయకం. దేశంలో సహకార సంస్థలన్నీ బలోపేతం కావటానికి, ప్రభుత్వం మరింత దృష్టి కేంద్రీకరించడానికి అంతర్జాతీయ మహాసభ ఉపయోగపడుతుంది. సహకార సంఘాలు చాలా వరకు వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా వరకే పరిమితం అవుతున్నాయి. ప్రాసెసింగ్, విలువ జోడింపు, ఉత్పత్తులను నేరుగా ప్రజలకు విక్రయించటం, ఉత్పత్తుల బ్రాండింగ్ చేసుకోవాలి. ఆన్లైన్, సొంత అవుట్ లెట్ల ద్వారా విక్రయించాలి. రైతుల ప్రయోజనమే పరమావధిగా ముల్కనూర్ సొసైటీ 60 ఏళ్లుగా ఇటువంటి అనేక సేవలు అందిస్తోంది. గోదాములు నిర్మించటం, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సహకార సంఘాలకు ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలిచ్చి ప్రోత్సహించాలి. శిక్షణపై దృష్టి కేంద్రీకరించాలి. సహకార సంఘాల సభ్యులు, సిబ్బంది, బోర్డు సభ్యులకు సహకార విలువలు, వాణిజ్య, నిర్వహణ నైపుణ్యాల పెంపుదల శిక్షణకు కృషి చెయ్యాలి.– అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, అధ్యక్షులు, ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సంఘం, తెలంగాణఒకే రంగానికి రెండు చట్టాలెందుకు?సహకార రంగం ఆర్థిక పురోగతి బాగానే వుంది. కానీ, నడక సరిగ్గా లేదు. సహకార మూల సూత్రాలకు సహకార వ్యవస్థ దూరమైంది. సహకార విద్య, సహకార విలువలకు సంబంధించిన కనీస జ్ఞానం కొరవడిన యంత్రాంగం ఆధ్వర్యంలో తెలుగునాట సహకార వ్యవస్థ నడుస్తోంది. సహకార హక్కులు, బాధ్యతలు తెలియని దుస్థితి. 12 నెలలు శిక్షణ పొందినవారే సహకార సంస్థల్లో సిబ్బందిగా వుండాలన్నది నియమం. చదవండి: ఫ్యామిలీ ఫార్మింగ్.. విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణఇప్పుడున్న సహకార సిబ్బందిలో 90 శాతం సరైన శిక్షణ లేనివారే. ఉద్యోగం చేస్తూ మూడు నెలలు, ఆరు నెలల డిప్లొమా అంటూ సర్టిఫికెట్లు పొందిన వారే ఎక్కువ కనిపిస్తున్నారు. వీరిని నడిపించే ఉన్నతోద్యోగుల పరిస్థితి కూడా ఇంతే! ఏ ఇతర రంగాల్లోనూ లేనివిధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 1964, 1995 సహకార చట్టాలు అమల్లో ఉన్నాయి. ఒకే రంగానికి రెండు చట్టాలేమిటి? 1904, 1912,1932, 1964 సహకార చట్టాలకు రూల్స్ ఉన్నాయి. కానీ, 1995 చట్టం అమల్లోకి వచ్చి 29 ఏళ్లయినా ఇప్పటికీ రూల్స్ లేవు. రిజిష్ట్రార్ బాధ్యతలపై కూడా స్పష్టమైన నిబంధనల్లేవు.– దాసరి కేశవులు, సీనియర్ సహకారవేత్త, చైర్మన్, సహకార భూమి జర్నల్ కోఆపరేటివ్ సొసైటీ, విజయవాడ -
'బొత్స భారీగా అక్రమాలకు పాల్పడ్డారు'
హైదరాబాద్ : మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని గజపతి నగరం టీడీపీ ఎమ్మెల్యే కే అప్పలనాయుడు ఆరోపించారు. శనివారం ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సహకార రుణాల్లో అక్రమాల అంశంపై చర్చించారు. ఈ సందర్బంగా కే.అప్పలనాయుడు మాట్లాడుతూ... బొత్స ఆయన అనుచరులు బనామీ పేర్లతో పెద్ద ఎత్తున రుణాలు పొందారని విమర్శించారు. జిల్లాలోని 94 సహాకార సంఘాలలో మంజూరైన రుణాలపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఒక్క రావివలస సహాకార బ్యాంక్ నుంచే రూ. 9 కోట్ల బినామి రుణాలు పొందారని చెప్పారు. అందుకు ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సమాధానమిస్తూ... కొన్ని సొసైటీల్లో చాలా అవకతవకలు జరిగిన మాట వాస్తవమేనని తెలిపారు. గత పదేళ్ల కాలంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. రుణాల్లో అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే ఎంతటి వారిపైన అయిన కఠిన చర్యలు తప్పవని బొజ్జల గోపాల కృష్ణారెడ్డి హెచ్చరించారు.


