సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్ని కుదిపేసిన ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఫాల్కన్ కంపెనీ ఎండీ అమర్ దీప్‌ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ దేశం నుండి ముంబైకి చేరుకున్న ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి, సమాచారం అందించడంతో తెలంగాణ పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.
అమర్ దీప్‌పై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసిన తెలంగాణ పోలీసులు.. ఆయనను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ముంబైకి పంపారు. చివరికి ఆయనను అదుపులోకి తీసుకోవడంతో కేసులో కీలక మలుపు తిరిగింది. ఫాల్కన్ కంపెనీ డిజిటల్ డిపాజిట్ల పేరుతో ప్రజల నుండి భారీగా డబ్బులు వసూలు చేసింది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామని, ఎంఎన్‌సీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి అమర్ దీప్ ప్రజలను నమ్మబలికాడు. యాప్ ఆధారిత డిజిటల్ డిపాజిట్ల పేరుతో 850 కోట్ల రూపాయలు కొట్టేసినట్లు విచారణలో బయటపడింది.
అమర్ దీప్ ప్రజలను ఆకర్షించడానికి పలు వ్యూహాలు ఉపయోగించాడు. యాప్ ద్వారా డబ్బులు పెట్టుబడులుగా తీసుకోవడం, షేర్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికడం, పెద్ద కంపెనీల్లో పెట్టుబడులు పెడతామని చెప్పి డబ్బులు వసూలు చేయడం వంటి పద్ధతులతో ఆయన ప్రజలను బురిడీ కొట్టించాడు. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే అమర్ దీప్ తన భార్యతో కలిసి చార్టెడ్ ఫ్లైట్‌లో దుబాయ్‌కు పారిపోయాడు. అప్పటి నుండి ఆయనపై పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. చివరికి ముంబైలో ఆయనను పట్టుకోవడంతో కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.
ఈ కేసులో ఫాల్కన్ కంపెనీ సీఈఓతో పాటు అమర్ దీప్ సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు అమర్ దీప్ అరెస్టు చేశారు. అమర్‌దీప్‌ను అరెస్టు చేసిన పోలీసులు కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలికితీసే అవకాశం ఉంది.


