ప్రజల్లో అనుకుంటున్నట్టు మన దేశంలో ఆహార వృధా అంత ఎక్కువేం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ వ్యాఖ్యానించారు. పాలకు సంబంధించి వృధా కేవలం 0.5 శాతమే ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న ఆహార వృధాలోనూ చాలా వరకు అరికట్టొచ్చని చెబుతూ.. ఇలా చేస్తే అది గోదాముల్లో పెట్టుబడులకు సైతం ప్రోత్సాహకరంగా మారుతుందన్నారు.
దేశ వ్యవసాయ రంగం వచ్చే పదేళ్ల పాటు 4 శాతం వృద్ధి రేటును సులభంగానే సాధిస్తుందని రమేష్ చంద్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోదాముల వసతులను పెంచుకోవాల్సి ఉందన్నారు. పీహెచ్‌డీ సీసీఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ ఏటా 2.5 శాతం చొప్పున పెరుగుతున్నట్టు చెప్పారు. కనుక 4 శాతం వృద్ధి సాధ్యమేనన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో (క్యూ1) వ్యవసాయ రంగంలో వృద్ధి 3.7 శాతంగా ఉండడం గమనార్హం.
‘‘కానీ, వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ ఈ స్థాయిలో పెరగడం లేదు. కనుక ఈ ఉత్పత్తులను పరిశ్రమలు వినియోగించాలి. లేదంటే ఎగుమతి చేయాలి. ఎగుమతి మార్కెట్‌ను గుర్తించడం మెరుగైన ఆప్షన్ అవుతుంది’’అని రమేష్ చంద్ పేర్కొన్నారు.
బియ్యం, గోధుమలకు కావాల్సిన నిల్వ వసతుల్లో (గోదాములు) ఎలాంటి వ్యత్యాసం లేదంటూ.. అదే మొక్కజొన్న విషయంలో మాత్రం భిన్నంగా ఉంటుందన్నారు. నిర్ణీత పరిమాణానికి మించి నిల్వ చేయకూడదన్న చట్టం ఉంటే.. అలాంటి నియంత్రణలు గోదాముల నిర్మాణంపై పెట్టుబడులను ప్రభావితం చేస్తాయన్నారు.


