గత కొద్ది రోజులుగా విమానాల రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు ఇండిగో శుభవార్త తెలిపింది. ఆదివారం సాయంత్రం కల్లా 1,500 విమానాలు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. తమ నెట్ వర్క్ కనెక్టివిటీలో దాదాపు 95శాతం మేర నెట్ వర్క్ రీబూట్ చేశామని పేర్కొంది.
ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరుపైనే చర్చంతా. సిబ్బంది కొరతతో విమానాయాన సంస్థ సేవలు అర్థాంతరంగా నిలిపివేయడంతో ఇండియా వ్యాప్తంగా ప్రయాణికుల రాకపోకలు దెబ్బతిన్నాయి. సాధారణ ప్రయాణికులతో పాటు ఎంతో మంది ప్రొఫెషనల్స్ తమ గమ్య స్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్ పోర్టులలో నిరీక్షిస్తూ అవస్థలు పడ్డారు. దీంతో కేంద్రం ప్రభుత్వం ఇండిగో పద్దతిపై సీరియస్ అయ్యింది. ఇంత పెద్దసంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదని ఫైరయ్యింది.
ఈ నేపథ్యంలో ఇండిగో తమ కార్యకలాపాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. తమ విమానాయాన నెట్‌వర్క్ ను దాదాపు పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. ఆదివారం సాయంత్రం వరకూ 1500 విమానాలు నడుపనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇండిగో 138 రూట్లలో సేవలందిస్తుండగా 135 గమ్యస్థానాలకు సేవలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. దీంతో దాదాపు 95 శాతం మేర రూట్లు రీకనెక్ట్ అయినట్లు పేర్కొంది. సాధారణంగా ఇండిగో నడిపే ఫ్లైట్ల సంఖ్య 700కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాటి సంఖ్య 1500కు పెంచినట్లు తెలిపింది.
ఇండిగోపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని, ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ప్రకటించింది. ఈ కష్టకాలంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇండిగో సిబ్బంది కొరతతో విమానాలను అర్థాంతరంగా నిలిపివేయడంతో దేశవ్యాప్తంగా ప్రయాణాలు స్తంభించి పోయాయి. ప్రయాణికులు రోజుల తరబడి ఎయిర్ పోర్టులలో నిరీక్షించారు. దీంతో ఈ దేశీయ విమానయాన సంస్థపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ప్రస్తుతం ఇండిగో ప్రకటనతో విమానాల కోసం ఎదురుచూస్తున్న చాలామంది ప్రయాణికులకు ఉపశమనం లభించినట్లయింది.


