గురువులకు కఠిన పరీక్ష! | Outrage over the conduct of teacher qualification test for in service teachers | Sakshi
Sakshi News home page

గురువులకు కఠిన పరీక్ష!

Oct 25 2025 5:23 AM | Updated on Oct 25 2025 8:50 AM

Outrage over the conduct of teacher qualification test for in service teachers

ఇన్‌ సర్వీసు వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణపై ఆగ్రహం

రివ్యూ పిటిషన్‌ వేయకుండా నోటిఫికేషన్‌ ఇవ్వడంపై గరంగరం 

రాష్ట్రంలోని దాదాపు 1.30 లక్షల మంది ఉపాధ్యాయులపై ప్రభావం

సాక్షి, అమరావతి: సర్వీస్‌లో ఉన్నవారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహణపై ఉపాధ్యాయుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తమకు టెట్‌ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్నవారికీ టెట్‌ తప్పనిసరి అని, పదోన్నతులకు ఈ పరీక్ష విధిగా ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పునిచ్చింది. సర్వీస్‌లో ఉన్నవారు సైతం రెండేళ్ల కాలంలో టెట్‌ పాస్‌ కావాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 2011 నుంచి టెట్‌ అమల్లోకి వచ్చింది. అయితే, దీనికి ముందే సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు, అన్ని మేనేజ్‌మెంట్‌ స్కూళ్లలోని వారికి కూడా తమ తీర్పు వర్తిస్తుందని సుప్రీం పేర్కొంది. 

ఉద్యోగ విరమణకు ఐదేళ్ల కంటే తక్కువ సర్వీసు ఉన్నవారికి మినహాయింపు ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ‘సుప్రీం’ తీరుపై తమ వైఖరి ప్రకటించాయి. రివ్యూ పిటిషన్లు సైతం దాఖలు చేశాయి. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున, కేంద్రం దీనిపై చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. ఏపీలో మాత్రం ఇదేమీ లేకుండా నేరుగా టెట్‌–2025 (అక్టోబర్‌) నిర్వహణకు షెడ్యూల్‌ ఇవ్వడం, ఇన్‌ సర్వీస్‌ టీచర్లు సైతం రాయాలని ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర గందరగోళానికి దారి తీస్తోంది.  

రాష్ట్రంలోని అన్ని మేనేజ్‌మెంట్‌ పాఠశాలల్లో సుమారు 2.87 లక్షల మంది, ప్రభుత్వ పాఠశాలల్లో 1.87 లక్షలమంది ఉపాధ్యాయులున్నారు. 2008 వరకు జరిగిన డీఎస్సీలకు టెట్‌ లేదు. దీనికిముందు విధుల్లో చేరిన లక్షమంది పైగా ఉపాధ్యాయులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వచ్చే రెండేళ్లలో టెట్‌ పూర్తి చేయాలి. అయితే, ఐదేళ్లలో ఉద్యోగ విరమణ చేసే ప్రభుత్వ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చినా వీరికి పదోన్నతులకు అర్హత ఉండదు. 

ఇలా 1986, 1989 డీఎస్సీల ద్వారా ఉద్యోగాల్లో చేరి ఐదేళ్లలో రిటైర్‌ కానున్నవారు 32 వేల మంది వరకు ఉండగా, మిగిలిన 1.30 లక్షల మంది తప్పనిసరిగా టెట్‌ రాయాల్సిందే. సుప్రీం తీర్పుపై రివ్యూకు వెళ్లాలని గత రెండు నెలల్లో అనేకసార్లు ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తులు చేశాయి. కానీ, అవేమీ పట్టించుకోకుండా టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్ష రాయాలని చెప్పడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  

రివ్యూ పిటిషన్‌ వేయాలి: ఏపీటీఎఫ్‌ అమరావతి 
టెట్‌ గురించి సుప్రీంకోర్టు తీర్పుపై ఇన్‌ సర్వీస్‌ టీచర్ల తరఫున ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేయాలని ఏపీటీఎఫ్‌ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. 2011కు ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్‌ నుంచి ఉపశమనం కలిగించేలా ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేయాలన్నారు. ఏ చర్యలు లేకుండా ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు కూడా టెట్‌ వర్తింపజేస్తూ మార్గదర్శకాలను విడుదల చేయడాన్ని ఖండించారు.  

ఎయిడెడ్‌ టీచర్లకు టెట్‌ అవసరమా?: టీచర్స్‌ గిల్డ్‌  
రాష్ట్రంలో ఎయిడెడ్‌ స్కూళ్లలో పనిచేస్తున్న 3 వేల మంది ఉపాధ్యాయులకు టెట్‌ నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చే అన్ని సదుపాయాలు ఎయిడెడ్‌ వారికీ కల్పించినప్పుడు మాత్రమే ఈ పరీక్ష రాస్తామని గిల్డ్‌ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.చిట్టిబాబు ఎల్‌కే చిన్నప్ప, ప్రతినిధి ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. 

దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా లేదు: వైఎస్సార్‌టీఏ  
‘సుప్రీం’ తీర్పు తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలోనూ టెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఎందుకంత తొందర అని వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ట్రెజరర్‌ వి.రెడ్డి శేఖర్‌ రెడ్డి ఆక్షేపించారు. సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్‌ నిర్వహణపై పునరాలోచించాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా నోటిఫికేషన్‌ విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు. తమను మానసికంగా ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ఆరోపించారు. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు.  
 


సర్వీసులో ఉన్నవారికి టెట్‌ ఏంటి?  
సర్వీస్‌లో ఉన్న సీనియర్‌ ఉపాధ్యాయులకు టెట్‌ తప్పనిసరి చేయడంలో అర్థం లేదని ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం విమర్శించింది. ఉపాధ్యాయులు ఉద్యోగంలోకి రావడానికి అవసరమైన విద్యార్హతలు, వృత్తి విద్యార్హతలతో పాటు పోటీ పరీక్షల్లో విజయం సాధించారని, వారందరి బోధనా సామర్థ్యాన్ని ప్రభుత్వం అప్పుడే పరీక్షించి, అంగీకరించిందని పేర్కొంది. ఆర్టీఈ–2009 చట్టం కంటే ముందున్నవారికి చట్టాన్ని వర్తింపజేయడంలో అర్థం లేదని సంఘం పేర్కొంది.  

కేంద్రం ఆలోచన తెలియకుండా పరీక్షా?: పీఎస్‌టీయూ 
సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెట్‌ నిర్వహణకు సిద్ధమవడం సరికాదని, దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏంటో సమీక్షించకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇచ్చిన వెంటనే అమలు చేయడం ఏంటని ఏపీ ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు లెక్కల జమాల్‌ రెడ్డి ప్రశ్నించారు. చాలా రాష్ట్రాలు తీర్పుపై రివ్యూ పిటిషన్లు వేస్తుంటే కూటమి ప్రభుత్వం టెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం శోచనీయమన్నారు. ఇప్పుడు ఇచి్చన టెట్‌ నోటిఫికేషన్‌లో ఇన్‌ సర్వీస్‌ వారిని మినహాయించాలని డిమాండ్‌ చేశారు.   

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు మినహాయించాలి 
ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ నిర్వహించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు, ఉపాధ్యాయ సంఘాలు రివ్యూ పిటిషన్లు వేసినా, ఏపీ ప్రభుత్వం, విద్యాశాఖ మాత్రం స్పందించలేదని మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు అన్నారు. వెంటనే సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం జోక్యం చేసుకుని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి పార్లమెంటులో చట్టం చేసి మినహాయింపు తేవాలన్నారు.. ఇవేమీ చేయకుండా టెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం, ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు కూడా పరీక్ష రాయాలని చెప్పడం సరికాదని విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement