ఉప్పల్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ మ్యాచ్‌కు భారీ బందోబస్తు కల్పించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. 3000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. స్టేడియం బయటా లోపలా కలిపి 450 సీసీ కెమేరాలు ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్ కెమెరాలను అమర్చి పర్యవేక్షణ కోసం మినీ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు.
శుక్రవారం ఆయన ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మాట్లాడారు. మెస్సికి జెడ్ కేటగిరీ బందోబస్తు ఉంటుందని సీపీ వెల్లడించారు. ఆయన ప్రయాణానికి ఆటంకం ఏర్పడకుండా ప్రత్యేక గ్రీన్ చానల్ రూట్‌మ్యాప్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
స్టేడియం వద్ద టికెట్ విక్రయాల్లేవ్..
స్టేడియం ఆవరణలో, పరిసర ప్రాంతాల్లో టికెట్లను, పాస్‌లను విక్రయించడం లేదని సీపీ స్పష్టం చేశారు. టికెట్ లేనివారు స్టేడియం వద్దకు ఎట్టి పరిస్థితుల్లో రావద్దన్నారు. మ్యాచ్‌ను టీవీల్లో వీక్షించాలని సూచించారు.
3 గంటల ముందే అనుమతి...
టికెట్లు, పాస్‌లున్న వారిని స్టేడియంలోకి 3 గంటల ముందే అనుమతించనున్నట్లు సీపీ తెలిపారు. ఆట ప్రారంభమయ్యే సమయానికి వచ్చి ఆందోళన పడవద్దని సూచించారు.
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు మెట్రో రైల్, ఆర్టీసీ సేవలను వినియోగించు కోవాలన్నారు మహిళల భద్రతకు ప్రత్యేకంగా షీటీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరీ్ణత స్థలంలోనే వాహనాలను పార్కు చేయాలని సీపీ సూచించారు.
టికెట్ ఒకసారి స్కాన్ అయిందంటే..
మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విషయంలో నిర్వాహకులు అనంత్ మాట్లాడుతూ.. టికెట్ మొబైల్‌లో సాఫ్ట్ కాపీ రూపంలోనే ఇస్తారని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ప్రవేశం ఉంటుందన్నారు. ఒకసారి స్కాన్ అయితే మళ్లీ వినియోగించే అవకాశం ఉండదన్నారు. పాస్ హోల్డర్‌లు బార్ కోడ్ ఉన్న ఫిజికల్ పాసులు మాత్రమే చెల్లుబాటవుతాయన్నారు, జిరాక్స్, స్క్రీన్ షాట్‌లను అనుమతించబోమన్నారు.


