హైహయుల కథ | Haihaya dynasty of Kartavirya Arjuna Special Story | Sakshi
Sakshi News home page

హైహయుల కథ

Dec 7 2025 6:38 AM | Updated on Dec 7 2025 6:38 AM

Haihaya dynasty of Kartavirya Arjuna Special Story

హైహయ వంశంలో కార్తవీర్యార్జునుడు అనే మహారాజు ఉండేవాడు. నర్మదా తీరంలోని మహిష్మతీ నగరాన్ని రాజధానిగా చేసుకుని, రాజ్యాన్ని పాలించేవాడు. కార్తవీర్యార్జునుడి వద్ద భృగువంశ విప్రులు పురోహితులుగా ఉండేవారు. వారి ఆధ్వర్యంలో కార్తవీర్యార్జునుడు అనేక యజ్ఞయాగాదులు చేశాడు. అతడు చేసిన దానాలతో, అతడి నుంచి అందుకున్న సంభావనలతో భృగువంశీయులందరూ సంపన్నులయ్యారు. 

కార్తవీర్యార్జునుడు స్వర్గస్థుడయ్యాక హైహయులు నిర్ధనులయ్యారు. ఒకసారి వారికి పెద్దమొత్తంలో ధనం అవసరమైంది. హైహయులు సుక్షత్రియులే అయినా, అహం చంపుకొని భృగువంశ పురోహితులను ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించారు. లుబ్ధులైన భార్గవులు లేదు పొమ్మంటూ హైహయులకు మొండిచేయి చూపారు. హైహయులు తమ సంపదను బలవంతంగా దోచుకుంటారేమోనని భయపడిన భార్గవులు తమ వద్దనున్న అపార ధనరాశులను భూమిలో పాతిపెట్టి, తట్టా బుట్టా సర్దుకుని, భార్యా బిడ్డలతో పాటు మహిష్మతీ నగరాన్ని విడిచిపెట్టి, అడవుల్లోకి పారిపోయారు.

హైహయులకు ఎక్కడా ధనం దొరకలేదు. మనసు చంపుకొని భార్గవులనే మరోసారి అడుగుదామని వారి ఆశ్రమాలకు వచ్చారు. అన్నీ ఖాళీగా ఉన్నాయి. వారందరూ పారిపోయారని తెలిసింది. ధనరాశులను పాతిపెట్టి ఉంటారని అనుమానించిన హైహయులు ఇళ్లన్నీ తవ్వారు. అంతులేని ధనరాశులు దొరికాయి. ఈ సంగతి తెలిసిన భార్గవులలో కొందరు లబోదిబోమంటూ తిరిగి తమ ఆశ్రమాలకు వచ్చారు. క్షమించమంటూ హైహయుల కాళ్ల మీద పడ్డారు. తాము సవినయంగా అడిగితే ధనం లేదని చెప్పి, పాతిపెట్టి పారిపోయిన భార్గవులపై హైహయులు మండిపడ్డారు. వారిపై ధనుర్బాణాలను ఎక్కుపెట్టారు. దొరికిన వారిని దొరికినట్లుగా మట్టుబెట్టారు. అడవులలో తలదాచుకున్న భార్గవులను వెదికి వెదికి మరీ సంహరించడం ప్రారంభించారు. ఈ బీభత్సానికి భార్గవుల పత్నులు రోదనలు ప్రారంభించారు. 

హైహయుల మారణకాండ వల్ల చెలరేగిన కలకలానికి, రోదనలకు చుట్టుపక్కల ఆశ్రమాల్లోని మునీశ్వరులు ఏదో దారుణం జరుగుతోందని తలచి పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. వారు అక్కడికి చేరుకునే సరికి హైహయులు భార్గవులను ఊచకోత కోస్తూ కనిపించారు. మునిగణమంతా హైహయులకు అడ్డువెళ్లి, వారించారు. విప్రులను వధించడం పాపకృత్యమని, ఈ హింసాకాండను ఇక్కడితో విరమించుకోమని హెచ్చరించారు. మునిగణం వారించడంతో హైహయులు కొంత శాంతించారు. ఆగ్రహావేశాల నుంచి తేరుకుని, పెదవి విప్పారు.

‘మునీశ్వరులారా! మీరు మమ్మల్ని నిందిస్తున్నారే గాని, వీరు మా పట్ల చేసిన పాపకృత్యం మీకు తెలియదు. వీరు మా పూర్వీకుల వద్ద పౌరోహిత్యం చేసేవారు. మా పూర్వీకుల నుంచి భూరి దానాలు, సంభావనలు స్వీకరించి ధనాఢ్యులయ్యారు. వీరు విప్రులు కాదు, నయవంచకులు, పరమ లోభులు. మాకు అత్యవసరం ఏర్పడి ధనాన్ని సర్దుబాటు చేయమని సవినయంగా అర్థిస్తే, కనికరమైనా లేకుండా, లేదు పొమ్మన్నారు. పైగా మేమెక్కడ బలవంతం చేస్తామోనని అనుమానించి, ధనరాశులను భూమిలో పాతిపెట్టి, అడవులకు చేరుకున్నారు. 

కృతజ్ఞత కలిగిన మనుషులు చేయదగిన పనేనా ఇది? వీరిని చంపుతున్నామంటే, చంపమా మరి? వీరికి ఈ ధనరాశులన్నీ మా పూర్వీకుడైన కార్తవీర్యార్జునుడు లోక క్షేమం కోసం యజ్ఞ యాగాదులు చేయమని, తాము సుఖంగా బతకమని, యాచకులకు దానం చేయమని వీరికి అపార ధనరాశులను ఇచ్చాడు. వీళ్లు ఈ మూడింటిలో ఏ ఒక్క పనీ చేయలేదు. పైగా లోభంతో ధనరాశులను భూమిలో పాతిపెట్టారు. పరమ లోభులైన ఈ నీచులను విప్రులు అనవచ్చునా? యజమానుల క్షేమం కోరుకోని వీరు లోకక్షేమాన్ని కాంక్షిస్తారనుకోగలమా? ధనానికి మూడే గతులు. దానం, భోగం, నాశం. దానం చేయక, తాను అనుభవించక ధనం కూడబెట్టిన లోభులు వంచకులు, దండనార్హులు. అందుకే మేము ఈ వంచకులను దండించాం. ఇందులో మా తప్పులేదని మా అభిప్రాయం. దీని గురించి మీరు మాపై కినుక వహించకండి’ అన్నారు.

హైహయుల సమాధానానికి మునీశ్వరులెవరూ మారు పలకలేకపోయారు. అయితే, మునిగణం రాకతో హైహయులు ఆగ్రహం నుంచి బయటపడ్డారు. రోదిస్తున్న భార్గవుల పత్నులను ప్రాణాలతో విడిచిపెట్టారు. అప్పటికే భయకంపితులై ఉన్న ఆ స్త్రీలు, ప్రాణాలు దక్కడమే చాలనుకుని, అక్కడి నుంచి బయలుదేరి హిమవంతం చేరుకున్నారు.

హిమాలయాలకు చేరుకున్న భార్గవుల పత్నులు కొన్నాళ్లకు భయాందోళనల నుంచి తేరుకున్నారు. వారంతా నదీతీరంలో మట్టితో గౌరీదేవి బొమ్మను చేసి, దీక్షగా అర్చించారు. వారి భక్తికి ప్రసన్నురాలైన దేవి కలలో కనిపించింది. ‘మీలో ఒకరికి ఊరు అంశతో కొడుకు పుడతాడు. అతడే మీ దుఃఖాలను తొలగించగలడు’ అని పలికింది. 

కొన్నాళ్లకు భార్గవపత్నులలో ఒకరికి తొడలో గర్భం ఏర్పడింది. ఒకనాడు వారు ఉంటున్నవైపు హైహయులు వచ్చారు. వారిని చూసి భార్గవపత్నులు భయకంపితులై పరుగులు తీశారు. హైహయులు వారిని వెంబడించారు. పరుగు తీయలేని ఊరుగర్భిణిని ఖడ్గధారులైన హైహయులు చుట్టుముట్టారు. 
ఊరుగర్భంలో ఉన్న బాలకుడు తన తల్లి దీనావస్థకు చలించిపోయి, గర్భాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు. మార్తాండకాంతితో మెరిసిపోతున్న ఆ బాలుడిని చూడటంతోనే హైహయులకు కళ్లు పోయాయి. ఇది పాతివ్రత్య మహిమ అని గ్రహించిన హైహయులు రోదిస్తూ ఆ తల్లి కాళ్ల మీద పడ్డారు. ‘తల్లీ! కనికరించు’ అని ప్రాధేయపడ్డారు. 

‘క్షత్రియవీరులైన మీరు నావంటి సామాన్య స్త్రీని ప్రాధేయపడటం తగదు. నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. తన తాత తండ్రులను చంపినందుకు నా కుమారుడికే మీ మీద కోపంగా ఉంది. ఇతడు జగదీశ్వరి ప్రసాదంగా నాకు జన్మించాడు. అతడే  మిమ్మల్ని క్షమించగలడు’ అని చెప్పింది. హైహయులు వెంటనే ఆ బాలుడి పాదాల మీద పడ్డారు. బాలభార్గవుడు ప్రసన్నుడై, వారికి దృష్టి ప్రసాదించాడు. ధర్మబద్ధంగా పాలన సాగించండి అని హితవు చెప్పి, వారిని పంపాడు.

సాంఖ్యాయన


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement