ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఇండిగోపై భారీ జరిమానా పడింది. జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి ఇండిగో విమానయాన సంస్థపై రూ.13 లక్షలకు పైగా పెనాల్టీ విధిస్తూ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులతో ఏకీభవించని ఇండిగో, చట్టపరమైన మార్గాల్లో దీనిని సవాలు చేయనున్నట్లు ప్రకటించింది.
పంజాబ్ రాష్ట్ర పన్నులు, ఎక్సైజ్ శాఖకు చెందిన అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇండిగో సంస్థపై రూ.13,28,255 జరిమానాను విధించింది. ఈ ఉత్తర్వులు తప్పుగా భావిన్తున్నట్లు ఇండిగో తెలిపింది. దేశంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అతిపెద్ద ఎయిర్‌లైన్ అయిన తమకు ఈ అంశంలో న్యాయపరంగా బలమైన ఆధారాలు ఉన్నాయని, ఈ మేరకు బయటి నుంచి పన్ను నిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
“ఈ నేపథ్యంలో తగిన అధికారి ముందు ఈ ఉత్తర్వును సవాలు చేస్తాం” అని ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ జరిమానా తమ ఆర్థిక స్థితి, కార్యకలాపాలు లేదా వ్యాపారంపై పెద్దగా ప్రభావం చూపదని కూడా కంపెనీ స్పష్టం చేసింది.
ఇటీవల కార్యాచరణ, వాతావరణ సంబంధిత సవాళ్ల కారణంగా వందలాది విమానాలు రద్దు కావడం లేదా ఆలస్యమవడం వంటి అంతరాయాల తర్వాత ఇండిగోకు ఈ జీఎస్టీ నోటీసు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా రాబోయే సెలవుల సీజన్‌లో పెరిగే ప్రయాణ డిమాండ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు విమానయాన సంస్థ పేర్కొంది.


