అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఆవల స్పేస్‌వాక్
అద్భుత చిత్రాలను విడుదలచేసిన నాసా వ్యోమగామి డాన్
వాషింగ్టన్: భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) లోపల పనిచేయడమే ఎంతో సాహసంతో కూడిన పని. ఇక ఐఎస్‌ఎస్ ఆవల విధులు నిర్వర్తించడమంటే కత్తిమీద సామే. అలాంటి పనిని అలవోకగా చేసి భారతీయ మూలాలున్న మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ఐఎస్‌ఎస్‌కు ప్రాణాధారాలైన సువిశాల సౌర ఫలకలకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ఒడుపుగా వాటి సమీపంలో పనిచేస్తున్న సునీత ఫొటోలను తాజాగా అమెరికా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మిని్రస్టేషన్(నాసా) వ్యోమగామి డాన్ పెటిట్ విడుదలచేశారు. దీంతో వ్యోమగాములు ఎంతటి విపత్కర, అననుకూల పరిస్థితుల్లో అంతెత్తులో పనిచేస్తారనేది సాధారణ ప్రజానీకానికి సైతం మరోసారి అవగతమైంది.
ఈ ఏడాది జనవరిలో ఐఎస్‌ఎస్‌లో పనిచేసినప్పటి ఫొటోలను పెటిట్ తాజాగా తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘‘ అంతరిక్షంలో అణుమాత్రమైనా తప్పు జరక్కుండా ఎలా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందో ఈ ఫొటోలను చూస్తే తెలుస్తుంది’’ అని పెటిట్ రాసుకొచ్చారు. ఐఎస్‌ఎస్ ఇంధన అవసరాలు తీర్చే ఒక్కో సౌర ఫలకం 35 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పులో ఉంటుంది.
మొత్తంగా 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక్కో సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటుచేశారు. మొత్తం సౌరఫలకాల్లో 2,62,400 సోలార్ సెల్స్ ఉన్నాయి. నిరాటంకంగా సూర్యకిరణాల నుంచి వేడిమిని సంగ్రహిస్తూ ఇవి 120 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తాయి. ఐఎస్‌ఎస్‌లో కీలక మాడ్యూల్స్ అన్నింటి విద్యుత్ అవసరాలను ఈ సోలార్ ప్యానెళ్లే తీరుస్తున్నాయి. శాస్త్రీయ పరిశోధనలకు కావాల్సిన అదనపు విద్యుత్‌నూ ఇవే సరఫరా చేస్తాయి. ఇటీవల అదనపు సెల్స్‌ను అమర్చి మొత్తం సామర్థ్యాన్ని 30 శాతం పెంచారు. దీంతో మరో దశాబ్దకాలంపాటు శాస్త్రీయ శోధనకు కావాల్సిన శక్తి అవసరాలు తీరినట్లేనని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
అనుకోని స్పేస్‌వాక్
సునీత బృందం తిరిగిరావాల్సిన వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాళ్లు ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఆమె అదనపు బాధ్యతలను నెత్తినేసుకున్నారు. ఇతర వ్యోమగాముల శాస్త్రపరిశోధనలో పాలుపంచుకుంటూనే ఆవలి వైపు మరమ్మతుల బాధ్యతలనూ సునీత సక్రమంగా నిర్వర్తించారు. అందులో భాగంగా సునీత ఈ అనుకోని స్పేస్‌వాక్ చేయాల్సి వచ్చిందని వ్యోమగామి పెటిట్ వెల్లడించారు.
జనవరి 30వ తేదీన సునీత 9వ సారి స్పేస్‌వాక్ చేయగా అప్పుడు తాను తీసిన ఫొటోలనే పెటిట్ బహిర్గతంచేశారు. బోయింగ్ వారి ప్రతిష్టాత్మక స్టార్‌లింక్ వ్యోమనౌకను పరీక్షించే ప్రయోగంలో భాగంగా అందులో బుచ్ విల్మోర్‌తో కలిసి 2024 జూన్ ఐదో తేదీన సునీత ఐఎస్‌ఎస్‌కు పయనమయ్యారు. కేవలం 8 రోజుల్లో వీళ్లు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది. కానీ తర్వాత స్టార్‌లింక్‌లో థ్రస్ట్ వైఫల్యం, హీలియం లీకేజీలతో సునీత భూమి మీదకు తిరిగి ప్రయాణం అస్సలు సాధ్యపడలేదు. దీంతో ఏకంగా 9 నెలలపాటు అక్కడే ఉండిపోయారు. ఎట్టకేలకు 2025 మార్చి 18వ తేదీన సునీత విజయవంతంగా భూమి మీదకు తిరిగొచ్చారు.


