ఆ స్ఫూర్తి ఆకాశమంత | Indian Astronaut sunita williams success story On Nasa | Sakshi
Sakshi News home page

ఆ స్ఫూర్తి ఆకాశమంత

Jan 24 2026 5:44 AM | Updated on Jan 24 2026 5:44 AM

Indian Astronaut sunita williams success story On Nasa

నేడు జాతీయ బాలికా దినోత్సవం

‘జస్ట్‌ రిటైర్డ్‌ స్టార్‌’ అంటున్నారు సునీతా విలియమ్స్‌ అభిమానులు. అరవై సంవత్సరాల సునీత జీవితంలో విలువైన అంతరిక్ష అనుభవాలు ఎన్నో... ఎన్నెన్నో! అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) ప్రారంభ రోజుల నుంచి వివిధ మిషన్‌ల వరకు... అంతరిక్ష ప్రయాణంలో కీలకమైన ముందడుగులను, మానవులకు అంతరిక్షం ఎలా అందుబాటులోకి వచ్చిందో చూసిన అపురూప కాలానికి సునీత విలియమ్స్‌ కేంద్రబిందువుగా నిలిచారు. 

నేడు జాతీయ బాలికా దినోత్సవం. కోట్లాదిమంది బాలికలకు స్ఫూర్తినిచ్చే అపూర్వ శక్తి సునీత విలియమ్స్‌ జీవితానికి ఉంది. శాస్త్రసాంకేతిక విషయాలే కాదు మధుర గాయకుడు మహ్మద్‌ రఫీ పాట నుంచి మలబారు అందాల వరకు మాట్లాడే సునీత విలియమ్స్‌ అంతరంగం ఆమె మాటల్లోనే...

బాగా కష్టపడాలనే తపన ఉన్న, సృజనాత్మకత, తెలివితేటలు మూర్తీభవించిన వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం రావడం నాకు లభించిన అదృష్టం అని నా భర్త చెబుతుంటారు. అది నిజం. నేను పదవీ విరమణ చేసినప్పటికీ చాలా బిజీగా ఉండడం వల్ల ఆ భావన కలగడం లేదు. నా బాధ్యతలను తదుపరి తరానికి అప్పగించాల్సిన సమయం వచ్చింది.

→ అరరే... మిస్సవుతున్నానే!
నాకూ ఫోమో (ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ ఔట్‌) ఉంది! ఆర్టెమిజ్‌ ప్రోగ్రామ్‌ కింద చేపడుతున్న రాబోయే మూన్‌ మిషన్‌ నాకు ‘ఫోమో’లాంటిది. చంద్రుడి మీదికి వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు? అసలు నేను ‘నాసా’లో చేరాలనుకోవడానికి ప్రధాన కారణం అదే. అందువల్ల నాకు ఖచ్చితంగా ‘ఫోమో’ ఉంటుంది. మూన్‌ మిషన్‌లో భాగమైన నా స్నేహితులు అదృష్టవంతులు. వారి ప్రయాణాన్ని చూడడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.

→ అంతరిక్షం టు లోక సంచారం
ప్రతి ఒక్కరికి తమకు నచ్చిన ప్రదేశం ఒకటి ఉంటుంది. నా విషయానికి వస్తే నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం అంతరిక్షం. మరి ఆ తరువాత? అంతరిక్షం తరువాత భూమిపై ఉన్న అందమైన, అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకున్నాను. నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. భారతదేశమంతటా పర్యటించాలనుకుంటున్నాను. ఆ ప్రదేశాలలో కేరళ ఒకటి.

→ టాప్‌ గన్‌...ఇన్‌స్పిరేషన్‌
ఇన్‌స్పిరేషన్‌ ఎక్కడి నుంచైనా రావచ్చు... అది హాలీవుడ్‌ అయినా కావచ్చు! అవును... హాలీవుడ్‌ సినిమా ‘టాప్‌ గన్‌’ ప్రభావం నాపై ఉండడం వల్లే తొలిసారిగా జెట్‌లు నడపాలనుకున్నాను. అయితే నేను హెలికాప్టర్‌ పైలట్‌గా మారాను. ఇరవై ఏళ్ల వయస్సులో టెస్ట్‌ పైలట్‌కు హాజరైన తరువాత, అక్కడ వ్యోమగాములను కలిసిన తర్వాతే వారికి ఉన్న అర్హతలలో కొన్ని నాకు ఉన్నాయనిపించింది. ‘ఇది నేను ఎంచుకోవాల్సి దారి’ అని అప్పుడే బలంగా అనిపించింది.

→ వినాయకుడి ఆశీర్వాదం
నా భారతీయ వారసత్వ సంపదపై నాకు చాలా గౌరవం ఉంది. దానిలో కొంత భాగాన్ని వివిధ రూపాల్లో అంతరిక్షంలోకి తీసుకువెళ్లినందుకు సంతోషంగా ఉంది. గణేష్‌ ఎప్పుడూ మా ఇంట్లోనే ఉంటాడు. నేను నివసించిన ప్రతిచోటా గణేష్‌ ఉన్నాడు. అందుకే నాతోపాటు అంతరిక్షంలోకి రావాల్సిందే అనుకున్నాను. ఇక భారతీయ ఆహారం విషయానికి వస్తే... ఎంత తిన్నా తనివి తీరదు. భారతీయ ఆహారం తినబోయే ముందు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఉత్సాహంతోనే అంతరిక్షంలో నా వెంట కొన్ని సమోసాలు ఉండేలా చూసుకోవాల్సి వచ్చింది!

→ నమ్మలేదు... కాని అది నిజం!
నా మొదటి అంతరిక్ష యాత్ర సందర్భంగా...
‘భారత్‌లోని ప్రజలు నువ్వు సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థించారు’ అని నాన్న చెప్పినప్పుడు నేను మొదట నమ్మలేదు. ‘అలా జరిగే అవకాశం లేదు’ అని కూడా అన్నాను. అయితే దినపత్రికలలో వచ్చిన కథనాలు చదివినప్పుడు నాన్న చెప్పింది అక్షరాలా నిజమని తెలుసుకున్నాను. నా స్నేహితురాలు ఒకరు హిమాలయాల్లోని ఒక స్కూల్‌లో ఉండేది. ఆమె నాతో...
‘నీ ఫోటో స్కూల్‌లో ఉంది’ అని చెప్పింది. భారతదేశం నన్ను తన కుమార్తెగా స్వీకరించడం నాకు హృద్యంగా, సంతోషంగా అనిపించింది.

→ ఎలాంటి పుస్తకాలు ఇష్టమంటే...
నా జీవితంలో శునకాలకు అధిక ప్రాధాన్యత ఉంది. 2017లో గోర్బి (శనకం పేరు) నాకు దూరమైనప్పుడు చాలా బాధపడ్డాను. నేను అంతరిక్షంలో ఉన్నప్పుడు, ఒక కార్గో నౌకలో నాకు ప్రియమైన శునకాల త్రీడీ–ప్రింటెడ్‌ మీనియేచర్‌లను పంపించారు. వాటిని చూసినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది.
పుస్తకాలు చదవడం ఇష్టం. అయితే చిన్నప్పుడు సైన్స్‌ ఫిక్షన్‌ పుస్తకాల కంటే జంతువులు, మిస్టీరియస్‌ కథల పుస్తకాలు ఎక్కువగా చదివే అలవాటు ఉండేది. ఇప్పుడు మాత్రం చరిత్ర, కాల్పనిక చరిత్ర పుస్తకాలు అంటే ఇష్టం. స్లోవేనియన్‌ సంస్కృతిని పరిచయం చేసే నవల ఒకటి ప్రస్తుతం చదువుతున్నాను.
 
బార్‌ బార్‌ దిన్‌ యే ఆయే!
’ తన 59 పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ మ్యూజిక్‌ కంపెనీ ‘సారెగామా’ నుంచి ప్రత్యేక బహుమతిని అందుకున్నారు సునీతా విలియమ్స్‌. లెజెండరీ గాయకుడు మహ్మద్‌ రఫీ ప్రసిద్ధ పాట ‘బార్‌ బార్‌ దిన్‌ యే ఆయే’ (ఈరోజు మళ్లీ మళ్లీ రావాలి)తో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి సంగీతకారులు, గాయకులతో ప్రముఖ బృందాన్ని ఏర్పాటు చేసింది. ‘రండి... అతి పెద్ద ఐకాన్‌లతో కలిసి పాడుదాం. అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్‌కు మనం అందరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం’ అనే కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్‌ పెట్టింది సారెగామా.

’ ఆస్ట్రోనాట్‌గా సుపరిచితురాలైన సునీతా విలియమ్స్‌ అథ్లెట్‌ కూడా..రన్నింగ్, స్విమ్మింగ్, ట్రయాథాన్స్, విండ్‌సర్ఫింగ్, స్నో బోర్డింగ్, బౌ హంటింగ్, రాక్‌ క్లైంబింగ్‌ అంటే ఇష్టం. స్పేస్‌లో మారథాన్‌ చేసిన తొలి వ్యక్తిగా రికార్డ్‌ సృష్టించారు. ఇక సంగీతం విషయానికి వస్తే గిటార్‌ వాయించడంలో సునీత విలియమ్స్‌కు ప్రావీణ్యం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement