నా కెరీర్లో అదొక్కటే వెలితి: సునీత
నాసాలో చేరిందే అందుకని వెల్లడి
సహచరులు సాధిస్తారని వ్యాఖ్యలు
కోజికోడ్: నాలుగు అంతరిక్ష యాత్రలు! అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏకంగా 608 రోజులు! 62 గంటలకు పైగా స్పేస్ వాక్‌లు!!! ఇన్ని ఘనతలు సాధించినా, చంద్రునిపై కాలు పెట్టలేకపోయానన్న వెలితి తనకెప్పటికీ ఉంటుందని ఇటీవలే రిటైరైన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (60) చెప్పారు. ‘‘చంద్రునిపైకి వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు! అసలు నేను నాసాలో చేరిందే చంద్రునిపై కాలు పెట్టే లక్ష్యంతో’’ అని వెల్లడించారు.
‘‘కనుక మూన్ మిషన్‌లో భాగం కాలేకపోయాననే వెలితి ఉంటుంది. కాకపోతే, నా తోటి వ్యోమగాములు త్వరలోనే మరోసారి ఆ ఘనత సాధించబోతున్నారు. అది తలచుకుంటేనే ఎంతో ఉత్కంఠగా ఉంది’’ అని చెప్పారు. కోజికోడ్‌లో జరుగుతున్న కేరళ సాహితీ సదస్సులో సునీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాసాలో తన 27 ఏళ్ల కెరీర్ గురించిన ఆసక్తికర విషయాలెన్నింటినో పంచుకున్నారు. ‘‘అంతరిక్ష యాత్రల బిజీలో భూమిపై ఉన్న ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను ఇప్పటిదాకా చూడలేకపోయా. వాటిలో కేరళ ఒకటి. ఇకపై వాటన్నింటినీ ఒక్కొక్కటిగా పర్యటిస్తా.
ఆ అనుభూతులకు దూరం...
అంతరిక్షంలో ఉన్న సమయంలో చిన్న చిన్న అనుభూతులకు దూ రమైన వెలితి మాత్రం బాగా బాధించేదని సునీత గుర్తు చేసు కున్నారు. ‘‘నా కుటుంబీకులతో వీడియో కాల్స్ ద్వారా టచ్‌లో ఉండేదాన్ని. భూమిపై ఎక్కడేం జరుగుతున్నదీ లేటెస్ట్ న్యూస్‌తో సహా ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉండేది. కానీ తొలి చినుకుల స్పర్శ, ముఖానికి పిల్లతెమ్మెరల మృదువైన తాకిడి, బీచ్‌లో కాళ్లకింద మెత్తగా జారిపోయే ఇసుక వంటివి అంతరిక్షంలో కలలోని అనుభూతులే. వీటన్నింటికీ మించి నా బుజ్జి పెంపుడు కుక్కలకు దూరంగా గడపాల్సి వచ్చేది.
తల్లి వంటి భూమికి, ఆ వాతావరణానికి, అక్కడి అనుభూతులకు, చెట్లు, చేపలు తదితరాలకు దూరంగా ఉండటం బాధించేది’’ అని చెప్పుకొచ్చారు. తొలి అంతరిక్ష యాత్ర సందర్భంగా నాన్న తనకు ఫోన్ చేసి, భారత్‌వ్యాప్తంగా అందరూ తాను క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారని చెబితే నమ్మలేకపోయానని కూడా సునీత గుర్తు చేసుకున్నారు. ‘‘నేను నమ్మను పొమ్మన్నా. కానీ అది నిజమేనని తిరిగొచ్చాక పత్రికల్లో వార్తలు, వ్యాసాలు చూస్తే తెలిసింది. ఎక్కడో హిమాలయాల్లో ప్రాథమిక స్కూల్లో పని చేసే నా స్నేహితురాలు ఫోన్ చేసి, ‘మా స్కూల్లో నీ ఫొటో ఉంది తెలుసా!’ అని చెప్పినప్పుడు చెప్పలేని అనుభూతి కలిగింది. భారత్ నన్ను నిజంగా సొంత కూతురిలా అక్కున చేర్చుకుంది’’ అంటూ హర్షం వెలిబుచ్చారు.
భయమే అన్పించలేదు
అంతరిక్ష యాత్రల్లో ఏనాడూ భయం తన దరిదాపుల్లోకి కూడా రాలేదని సునీత గుర్తు చేసుకున్నారు. సునీత, బచ్ విల్మోర్‌లతో బయల్దేరిన బోయింగ్ తొలి అంతరిక్ష నౌక స్టార్‌లైనర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమయ్యే క్రమంలో సాంకేతిక వైఫల్యాలను ఎదుర్కొనడం, 8 రోజుల యాత్ర కాస్తా 286 రోజుల పాటు సాగడం తెలిసిందే. ‘‘అప్పుడు కూడా అస్సలు భయం అనిపించలేదు. నాసా సైంటిస్టులపై పూర్తి నమ్మక ముంచా. నా సహచరుడు విల్మోర్, నేను కూడా మా పరస్పర సామర్థ్యాలను పూర్తిగా నమ్మాం. మా దృష్టినంతా సమస్యను ఎలా పరిష్కరించాలా అన్నదానిపైనే కేంద్రీకరించాం’’ అని ఆమె వివరించారు. కేరళ సాహితీ సదస్సులో సాహిత్యం నుంచి సినిమాల దాకా పలు రంగాలకు చెందిన హేమాహేమీలు పాల్గొంటున్నారు.


