ఐఐఎస్‌సీ బెంగళూరుదే అగ్రస్థానం | Times Higher Education World University Rankings released | Sakshi
Sakshi News home page

ఐఐఎస్‌సీ బెంగళూరుదే అగ్రస్థానం

Oct 13 2025 5:29 AM | Updated on Oct 13 2025 5:40 AM

Times Higher Education World University Rankings released

టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ వర్సిటీ ర్యాంకింగ్స్‌ విడుదల

దేశంలో మరోసారి అగ్రస్థానాన్ని నిలుపుకున్న ఐఐఎస్‌సీ–బెంగళూరు

అమెరికా తర్వాత అత్యధిక ర్యాంకులు సాధించిన భారత విద్యాసంస్థలు

ప్రపంచ టాప్‌ వర్సిటీగా వరుసగా పదో ఏడాది యూకే సంస్థ ఆక్స్‌ఫర్డ్‌ రికార్డు

గతంతో పోలిస్తే అత్యుత్తమ ర్యాంకులు కోల్పోయిన యూఎస్‌ సంస్థలు

యూకే విశ్వవిద్యాలయాలకు మిశ్రమ ఫలితాలే

సాక్షి, అమరావతి: టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ వర్సిటీ ర్యాంకింగ్స్‌–2026లో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) దేశంలోనే అగ్రశ్రేణి యూనివర్సిటీగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 201–250 ర్యాంక్‌ బ్యాండ్‌లో వరుసగా మూడో ఏడాది కొనసాగుతోంది. తాజా జాబితాలో ప్రపంచంలో అత్యధికంగా విశ్వవిద్యాలయాలు ర్యాంకులు పొందిన దేశాల్లో అమెరికా తర్వాత భారత్‌ రెండో స్థానానికి చేరుకోవడంవిశేషం.

ఇక చెన్నైకి చెందిన సవిత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ టెక్నికల్‌ సైన్సెస్‌ 401–500 బ్యాండ్‌ నుంచి 351–400 ర్యాంకులకు ఎగబాకి దేశంలో రెండో స్థానం దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం జేఎన్‌టీయూ, హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలు 1001–1200 బ్యాండ్‌లో, ఐఎఫ్‌హెచ్‌ఈ–హైదరాబాద్, ఉస్మానియా వర్సిటీలు 1201–1500 బ్యాండ్‌లో, ఆచార్య నాగార్జున యూ­నివ­ర్సిటీ, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలు 1501 ప్లస్‌ బ్యాండ్‌ ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. వీటితో పాటు మరో నాలుగు ప్రైవేటు సంస్థలు కూడా ఉన్నాయి. 

దేశీయ సంస్థలు స్థానాలు ఇలా.. 
జామియా మిలియా ఇస్లామియా (ఢిల్లీ), షాలిని వర్సిటీ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌ (బజోల్, హిమాచల్‌ప్రదేశ్‌) 401–500 కేటగిరీలోను, బనారస్‌ హిందూ  వర్సిటీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇండోర్, కేఐఐటీ వర్సిటీ (భువనేశ్వర్‌), లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ (ఫగ్వారా, పంజాబ్‌), మహాత్మాగాంధీ వర్సిటీ (కొట్టాయం, కేరళ), యూపీఈఎస్‌ (డెహ్రాడూన్‌) 501–600 కేటగిరీలో ర్యాంక్‌లు పొందాయి. 601–800 బ్యాండ్‌లో 15కుపైగా భారతీయ సంస్థలు నిలిచాయి. 

వాటిల్లో అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయం, అమిటీ విశ్వవిద్యాలయం (నోయిడా), భారతీయార్‌ విశ్వవిద్యాలయం (కోయంబత్తూర్‌), సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ పంజాబ్‌ (భటిండా), చిత్కరా విశ్వవిద్యాలయం (చండీగఢ్‌ ), గ్రాఫిక్‌ ఎరా విశ్వవిద్యాలయం (డెహ్రాడూన్‌), ఐఐటీ పాట్నా, ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్, మాలవ్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (జైపూర్‌), మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్, ఎన్‌ఐటీ రూర్కెలా, పంజాబ్‌ విశ్వవిద్యాలయం (చండీగఢ్‌), శారదా విశ్వవిద్యాలయం (గ్రేటర్‌ నోయిడా), సింబయాసిస్‌ ఇంటర్నేషనల్‌ విశ్వవిద్యాలయం (పూణే ), థాపర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ (పాటియాలా), ఢిల్లీ విశ్వవిద్యాలయం, విట్‌ విశ్వవిద్యాలయం (వెల్లూరు) ఉన్నాయి.

టాప్‌–10లో ఏడు అమెరికా సంస్థలు
టాప్‌–10లో అమెరికా విశ్వవిద్యాలయాలు ఆధిపత్యం చెలాయిస్తూ 10లో ఏడు స్థానాలను సొంతం చేసుకున్నాయి. అంతేస్థాయిలో క్షీణతను కూడా ఎదుర్కొంటున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. అ­మెరికాకు చెందిన ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం, యూకేకు చెందిన కేంబ్రిడ్జి వర్సిటీతో ఉమ్మడిగా మూడవ స్థానంలో కొనసాగుతోంది. 

అమెరికాలో గత సంవత్సరంతో పోలిస్తే టాప్‌–20లో ఆరు వర్సిటీలు తగ్గిపోయాయి. టాప్‌ 100లో 38 నుంచి 35కి పడిపోయాయి. టాప్‌ 500లో మొత్తం అమెరికా సంస్థల సంఖ్య 102 కాగా.. ఇది రికార్డు స్థాయిలో అత్యల్పమని నిపుణులు పేర్కొంటున్నారు. ఏకంగా 25 అమెరికా విశ్వవిద్యాలయాలు వాటి అత్యల్ప స్థానాలకు పడిపోయాయి. 

వాటిలో చికాగో విశ్వవిద్యాలయం (15వ స్థానం), కొలంబియా విశ్వవిద్యాలయం (20వ స్థానం), డ్యూక్‌ విశ్వవిద్యాలయం (28వ స్థానం) ఉన్నాయి. యూకేలో ఆక్స్‌ఫర్డ్‌ మొదటి స్థానంలో ఉండగా, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం మూడవ స్థానాన్ని పంచుకుంది. ఇంపీరియల్‌ కాలేజీ లండన్‌ 8వ స్థానంలో ఉంది. యూకే సంస్థలు మిశ్రమ ఫలితాలను చూపించాయి.

పదో ఏడాదీ ఆక్స్‌ఫర్డ్‌ టాప్‌లోనే.. 
యూకేకు చెందిన టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ వర్సిటీ ర్యాంకింగ్స్‌ 2026లో 115 దేశాలు నుంచి 2,191 సంస్థలు నిలిచాయి. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ వరుసగా 10వ ఏడాది కూడా ప్రపంచంలోనే అగ్రశ్రేణి వర్సిటీగా నిలిచింది. ఆక్స్‌ఫర్డ్‌లోని పరిశోధన వాతావరణం కారణంగా ప్రపంచ అగ్రశ్రేణి వర్సిటీగా ఎదురులేకుండా కొనసాగుతోంది. 

చైనా టాప్‌–200లో 13 విశ్వవిద్యాలయాలను కొనసాగిస్తూ.. మూడో ఏడాది స్థిరంగా ఉంది. అక్కడ సింఘువా విశ్వవిద్యాలయం వరుసగా మూడవ సంవత్సరం 12వ స్థానంలో నిలవగా, పెకింగ్‌ విశ్వవిద్యాలయం ఒక స్థానం ఎగబాకి 13వ స్థానానికి చేరుకుంది. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ మెరుగుదల లేకుండా 17వ స్థానంలో నిలిచింది. 2012 తర్వాత ఈ సంస్థలు తమ ర్యాంక్‌లను మెరుగుపరుచుకోకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement