- హాజరైన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
- తీర ప్రాంత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం
- శత్రుదేశాల జలాంతర్గాముల పాలిట ‘సైలెంట్ హంటర్’
ముంబై: భారత సముద్ర తీర ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. దాదాపు 80 శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ‘ఐఎన్‌ఎస్ మాహె’ నౌక భారత నావికా దళంలో చేరింది. సైలెంట్ హంటర్‌గా పిలిచే ఈ నౌక సముద్ర అంతర్భాగంలో శత్రుదేశాల జలాంతర్గాములను నిశ్శబ్దంగా వేటాడగలదు. తీర ప్రాంతంలో గస్తీతోపాటు సముద్రం లోపల సహాయక చర్యల్లోనూ పాల్గొంటుంది.
ఇది మొట్టమొదటి మాహె–క్లాస్ యాంటీ–సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో–వాటర్ క్రాఫ్ట్. కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ అధునాతన నౌకకు మలబార్ తీరంలోని మాహె నగరం పేరుపెట్టారు.
సోమవారం ముంబై తీరంలోని నావల్ డాక్‌యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఐఎన్‌ఎస్ మాహెను నావికాదళానికి లాంఛనంగా అప్పగించారు. నావల్ షిప్‌ను నౌకా దళంలో ప్రవేశపెట్టే కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం. నౌక డిజైన్, నిర్మాణంలో పాలుపంచుకున్న సిబ్బందిని ఉపేంద్ర ద్వివేది సత్కరించారు. ఐఎన్‌ఎస్ మాహె నౌక ఇకపై వెస్ట్రన్ సీ బోర్డు ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించనుంది.
→ ఐఎన్‌ఎస్ మాహెలో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పొందుపర్చారు. సముద్రం ఉపరితలంపై, లోపల ముప్పును అత్యంత కచ్చితత్వంతో గుర్తించి, అంతం చేయగలదు.
→ ఇందులో టార్పెడోలు, యాంటీ–సబ్‌మెరైన్ రాకెట్లు ఉన్నాయి. సముద్రం లోపల శత్రుదేశాల జలాంతర్గాములను తుత్తునియలు చేస్తుంది.
→ యుద్ధనౌకల డిజైన్, నిర్మాణంలో మన ఆత్మనిర్భరతకు ఐఎన్‌ఎస్ మాహె ఒక ప్రతీక అని భారత నావికాదళం అభివరి్ణంచింది. నౌక పైభాగంలె ‘ఉరుమి’ అనే ఖడ్గాన్ని అమర్చారు. ఇది కేరళ ప్రాచీన యుద్ధక్రీడ అయిన కలరిపయట్టులో ఉపయోగించే ఆయుధం.
→ నౌక మస్కట్(చిహ్నం) చిరుతపులి. నౌక నుంచి చాలా తక్కువ శబ్దం వెలువడుతుంది. అందుకే శత్రువులు సులువుగా గుర్తించలేరు.
→ పొడవు 78 మీటర్లు. గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. సముద్రంలో సహాయక చర్యల్లో క్రియాశీలకంగా పనిచేస్తుంది.


