7 వేల టన్నుల సామర్థ్యంతో అరిహంత్ సిరీస్‌లో చివరి న్యూక్లియర్ సబ్ మెరైన్
విశాఖ షిప్ బిల్డింగ్ సెంటర్‌లో తుది దశకు నిర్మాణ పనులు
ఎస్ – 4 స్టార్ పేరుతో 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం
3500 కిమీ పరిధిలో లక్ష్యాన్ని ఛేదించే 8 కే – 4 మిసైల్స్‌ని తీసుకెళ్లేలా తయారీ
సీ ట్రయల్స్ కోసం సముద్ర జలాల్లోకి ప్రవేశం
సాక్షి, విశాఖపట్నం : దేశ రక్షణ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, హిందూ మహాసముద్ర జలాల్లో ఆధిపత్యం చెలాయించే దిశగా భారత నౌకాదళం సరికొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే వరుస క్షిపణి ప్రయోగాలతో దూసుకెళ్తోన్న నౌకాదళం తాజాగా మరో అడుగు ముందుకేసింది. శత్రు దేశాల గుండెల్లో గుబులు రేపేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నాలుగో ‘బాహుబలి’ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి (ఎస్ – 4 స్టార్) సిద్ధమవుతోంది.
విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో నిర్మితమవుతున్న 7 వేల టన్నుల బరువున్న ఈ జంబో సబ్‌మెరైన్ రెండు రోజుల క్రితం సీ ట్రయల్స్ కోసం సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. 40 ఏళ్ల క్రితం ప్రారంభమైన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెసల్స్ (ఏటీవీ) ప్రాజెక్టులో ఈ సబ్‌మెరైన్ ఒక కీలక మైలురాయిగా మారనుంది.
2027 జనవరిలో నౌకాదళ అమ్ముల పొదిలోకి..
» అరిహంత్ క్లాస్ బాలిస్టిక్ మిసైల్ సబ్‌మెరైన్ శ్రేణిలో ఇదే చివరిది. అందుకే గత మూడు జలాంతర్గాముల కంటే భిన్నంగా భారీగా తయారు చేస్తున్నారు.
» భారత నౌకాదళంలో ప్రస్తుతం షిప్ సబ్‌మెర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్(ఎస్‌ఎస్‌బీఎన్)లు నాలుగున్నాయి. ఇందులో ఇప్పటికే రెండు సబ్‌మెరైన్‌లు నౌకాదళంలో సేవలందిస్తున్నాయి.
» మూడో సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ అరిథామన్ సీ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. 2026 చివర్లో సేవలందించేందుకు సిద్ధమవుతోంది.
» ఈ సబ్‌మెరైన్ల నిర్మాణం కోసం 1984లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెస్సెల్ (ఏటీవీ) ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు.
» గతంలో నిర్మించిన 3 సబ్‌మెరైన్లలో 60 నుంచి 75 శాతం స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించగా, ఈ ఎస్–4 స్టార్ జలాంతర్గామిని 80 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు.
» తొలివిడత సీ ట్రయల్స్ పరీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయని... మరో మూడు విడతల్లో పూర్తి చేసిన తర్వాత 2027 జనవరిలో విధుల్లో చేరనుందని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.
అరిహంత్ క్లాస్‌లో అదరగొట్టే సబ్‌మెరైన్
» మొదటి ఎస్‌ఎస్‌బీఎన్ అయిన అరిహంత్ క్లాస్ సబ్‌మెరైన్ నిర్మాణం 1998లో మొదలైంది.
» అదే సంవత్సరం పోఖ్రాన్‌లో అణ్వాయుధాలను భారత్ పరీక్షించింది.
» అరిహంత్ 2016 నుంచి సేవల్లో చురుగ్గా ఉంది.
» రెండో సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను 2024 ఆగస్టు 29న జాతికి అంకితం చేశారు.
» అరిథామన్ 2026లో నౌకాదళంలో చేరనుంది.
» వీటన్నింటికంటే భిన్నంగా శత్రు దేశాలకు భయం పుట్టించేలా భారీగా ఎస్–4 స్టార్ సబ్‌మెరైన్ తయారు చేశారు.
» మొదటి మూడు సబ్‌మెరైన్లు 110 మీటర్ల పొడవు, 6 వేల టన్నుల బరువుతో తయారు చేశారు. ఇవి 16 కే,
15 ఎస్‌ఎల్‌బీఎంలని లేదా కే–4 బాలిస్టిక్ మిసైల్స్‌ని నాలుగింటిని మాత్రమే తీసుకెళ్లగలవు. కొత్తగా తయారు చేసిన ఎస్–4 స్టార్ సబ్‌మెరైన్ మాత్రం 120 మీటర్ల పొడవు, 7 వేల టన్నుల బరువుతో నిర్మితమైంది. ఇది ఏకంగా 8 కే–4 బాలిస్టిక్ మిసైల్స్‌ని తీసుకెళ్లే సామర్థ్యంతో డిజైన్‌ని విస్తరించారు.
ఎస్ – 5 క్లాస్‌కు తొలి మెట్టుగా
» అరిహంత్ క్లాస్ తర్వాత భారీ సబ్‌మెరైన్లు నిర్మించేందుకు భారత నౌకాదళం ప్రణాళికలు రూపొందించింది.
» ఎస్–5 ప్రాజెక్టుగా 5 జలాంతర్గాములు తయారు చేయనున్నారు.
» దీనికి ఎస్ – 4 స్టార్ సబ్‌మెరైన్ నిర్మాణం తొలి మెట్టుగా భావిస్తున్నారు.
» ఎందుకంటే రాబోయే జలాంతర్గాముల్ని రెట్టింపు బరువుతో అంటే ఏకంగా 13,500 టన్నుల భారీ సామర్థ్యంతో నిర్మించాలని భావిస్తున్నారు.
» 2030 నాటికి ఎస్ – 5 ప్రాజెక్టులో తొలి సబ్‌మెరైన్ సేవలు అందించనుందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి.
» మొత్తానికి విశాఖ తీరం వేదికగా జరుగుతున్న ఈ పరిణామాలు, హిందూ మహాసముద్రంలో చైనా వంటి దేశాల కదలికలకు చెక్ పెట్టే దిశగా భారత్ వేస్తున్న బలమైన అడుగులుగా రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


