breaking news
Harman
-
ఓపెన్ ఎక్స్పీరియన్స్ సెంటర్లు ప్రారంభించిన డోర్ తయారీ సంస్థ
జర్మన్ ఆధారిత హర్మన్ సంస్థ అనుబంధ కంపెనీ అయిన శక్తి హర్మన్ తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, దిల్లీలో రెండు ‘ఓపెన్ ఎక్స్పీరియన్స్ సెంటర్’ను ప్రారంభించింది. బుధవారం బేగంపేటలో జరిగిన కార్యక్రమంలో హర్మన్ గ్రూప్ యాజమాన్య భాగస్వామి మార్టిన్ జే.హర్మన్ పాల్గొని మాట్లాడారు. స్టీల్ డోర్, వుడెన్ డోర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందన్నారు. సంస్థ ప్రస్తుతం హైదరాబాద్ ప్లాంట్‌లో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ఇండియావ్యాప్తంగా మార్కెట్‌ను పెంచనున్నట్లు తెలిపారు. సంస్థ ప్రారంభించిన ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ కేంద్రాల ద్వారా వినియోగదారులు నేరుగా ఉత్పత్తులను చూసి వాటి ఉపయోగాలపై అవగాహన పొందే వీలుంటుందన్నారు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో కలిపి ఏటా 1.1లక్షల డోర్లు అమ్ముడవుతున్నాయన్నారు. శక్తి హర్మన్ సంస్థ ఎండీ శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ కంపెనీ విస్తరణలో భాగంగా వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలోపు జైపుర్‌లోని మహేంద్రాసిటీలో రెండో ప్లాంట్ అందుబాటులోకి వస్తుందన్నారు. హైదరాబాద్‌లోని ప్లాంట్ ద్వారా ఏటా 2లక్షల డోర్లు, 10వేల ఇండస్ట్రీయల్ డోర్లు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. జైపుర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఏటా మరో 1.3లక్షల డోర్లు ఉత్పత్తి పెరుగుతుందన్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే దాదాపు 450 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం రూ.175కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. కమర్షియల్, ఇండస్ట్రీయల్, రెసిడెన్షియల్ విభాగాల్లో అధునాతన టెక్నాలజీతో డోర్లు తయారుచేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, దిల్లీలో ప్రారంభించిన ఓపెన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ల ద్వారా కస్టమర్లు నేరుగా సంబంధిత ప్రోడక్ట్‌ను చూసి దాని ఉపయోగాలు తెలుసుకుని నిర్ణయం తీసుకునే వీలుంటుందన్నారు. కేటలాగ్ చూసి డోర్లను కొనుగోలు చేయడం కంటే అనుభవపూర్వంగా వాటి గురించి తెలుసుకుని, చూసి కొనాలో వద్దో నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని వివరించారు. దేశవ్యాప్తంగా రియాల్టీ రంగం విస్తరిస్తుంది. దానికి అనువుగా డోర్ల అవసరం ఉంటుందన్నారు. హైదరాబాద్ మెట్రోతోపాటు చాలా ప్రభుత్వ, ప్రైవేట్‌రంగాల్లో తమ సంస్థకు చెందిన డోర్లను వాడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగం, రెసిడెన్షియల్ విభాగాల్లో 2.5కోట్ల డోర్లు అవసరం ఉందన్నారు. అయినప్పటికీ డోర్ల తయారీలో అసంఘటిత రంగానికి ఇప్పటికీ 50 శాతం కంటే ఎక్కువ వాటా ఉందన్నారు. గతేడాది కంపెనీ రూ.270కోట్ల రెవెన్యూ సంపాదించినట్లు చెప్పారు. ఇండస్ట్రీయల్, కమర్షియల్ డోర్లు తయరుచేసే శక్తి హర్మన్ సంస్థ ప్రతిష్టాత్మక జర్మన్ ఆధారిత హర్మన్ బ్రాండ్ అనుబంధ కంపెనీ. హర్మన్ సంస్థ డోర్ సెగ్మెంట్లో 1935 నుంచి ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. ఇప్పటికే గ్లోబల్‌గా తమ సంస్థకు చెందిన దాదాపు 2కోట్ల డోర్లు వినియోగిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దాదాపు 6000 మంది సంస్థలో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆసియా, ఉత్తర అమెరికా, యూరప్‌తో కలిపి మొత్తం 40 ఫ్యాక్టరీల్లో తమ ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. అయితే 1994 నుంచి శక్తి హర్మన్‌గా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంస్థ..2012 నుంచి ఇండియావ్యాప్తంగా తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసేలా చర్యలు తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.8వేల కోట్ల టర్నోవర్ ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
శాంసంగ్ భారీ డీల్
కనెక్టెడ్ కార్ల ఉత్పత్తిలో వేగవంతంగా పెరుగుతున్న ఆటోమోటివ్ టెక్నాలజీకి చేరువ కావడానికి దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఓ అమెరికన్ కంపెనీని సొంతం చేసుకోబోతుంది. అమెరికన్ ఆటో పార్ట్‌ల తయారీదారి హర్మాన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ 8 బిలియన్ డాలర్లుగా(సుమారు రూ.54,107 కోట్లు) ఉండనున్నట్టు పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న శాంసంగ్, ప్రస్తుతం కనెక్టెడ్ కార్ల రంగంలోనూ తనదైన శైలిలో దూసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఈ డీల్ మొత్తం నగదు రూపంలోనే ఉండనుందని, శాంసంగ్ బోర్డు సభ్యులు దీన్ని ఆమోదించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలియజేసింది. శుక్రవారం ముగింపు ధరకు 27.8 శాతం ప్రీమియంగా ఈ డీల్ ఉంది. ఒక్కో షేరుకు 112 డాలర్ల నగదును హర్మాన్‌కు శాంసంగ్ చెల్లించనుంది. అమెరికాలో లిస్టు అయిన హర్మాన్, కనెక్టెడ్ కారు టెక్నాలజీలో లీడర్‌గా ఉంది. ఈ డీల్ శాంసంగ్ విలువలోనే అతిపెద్దదని, గ్లోబల్ మార్కెట్లోని ఆన్లైన్ కనెక్టెడ్ ఆటో టెక్నాలజీలో తనదైన ఉనికిని చాటుకోవడానికి ఇది ఎంతో సహకరిస్తుందని సంస్థ పేర్కొంది. తాము ఆటోమోటివ్ ఫ్లాట్ ఫామ్‌లో వృద్ధి చెందడానికి శాంసంగ్‌కు హర్మాన్ ఓ బలమైన పునాదిని వెంటనే ఏర్పరుస్తుందని పేర్కొంది. అత్యాధునిక ఆడియో సిస్టమ్స్, ఇతర ఇంటర్నెట్ తరహా వినోద ఫీచర్లను జనరల్ మోటార్స్, ఫియట్ క్రిస్లర్ వంటి గ్లోబల్ కారు కంపెనీలకు హర్మాన్ ఉత్పత్తిచేస్తోంది.