
ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో తాజాగా హర్మన్‌కు చెందిన డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ సొల్యూషన్స్(డీటీఎస్) బిజినెస్ యూనిట్ కొనుగోలుకి తెరతీసింది. శామ్‌సంగ్‌కు చెందిన ఈ సంస్థలో 100 శాతం వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు నగదు రూపేణా 37.5 కోట్ల డాలర్లు(సుమారు రూ. 3,270 కోట్లు) వెచ్చించనుంది.
ఒప్పందంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 5,600మంది డీటీఎస్ ఉద్యోగులు విప్రోకు బదిలీకానున్నారు. 2025 డిసెంబర్31కల్లా లావాదేవీ పూర్తికావచ్చని అంచనా వేస్తున్నారు. హర్మన్ కనెక్టెడ్ సర్వీసెస్ ఇంక్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి హర్మన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ ఇంక్‌తో తప్పనిసరి ఒప్పందంపై సంతకాలు చేసినట్లు విప్రో పేర్కొంది.
తద్వారా హర్మన్ అనుబంధ సంస్థలుసహా.. సంబంధిత ఆస్తులను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. కొనుగోలు తదుపరి విప్రో ఇంజినీరింగ్ గ్లోబల్ బిజినెస్ లైన్‌లో డీటీఎస్ విలీనంకానున్నట్లు వెల్లడించింది. కనెక్టికట్(యూఎస్) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డీటీఎస్ అంతర్జాతీయంగా ఈఆర్‌అండ్‌డీ, ఐటీ సర్వీసులను అందిస్తోంది. ఎంబెడ్డెడ్ సాఫ్ట్‌వేర్, డిజిటల్ ఇంజినీరింగ్, డిజైన్ థింకింగ్, క్లౌడ్, ఇన్‌ఫ్రా సర్వీసులలో ప్రధానంగా కార్యకలాపాలు విస్తరించింది.