ఏఐ వినియోగంలో వెనుకబడ్డ భారత్‌  | Indian domestic market has seen robust activity in early-stage Artificial Intelligence | Sakshi
Sakshi News home page

ఏఐ వినియోగంలో వెనుకబడ్డ భారత్‌ 

Nov 20 2025 1:36 AM | Updated on Nov 20 2025 1:36 AM

Indian domestic market has seen robust activity in early-stage Artificial Intelligence

ఇంకా ప్రారంభ దశలోనే 45 శాతం కంపెనీలు 

అడ్వాన్స్‌డ్‌ దశలో ఉన్నవి 17 శాతం సంస్థలే 

హెచ్‌ఆర్‌ ప్లాట్‌ఫాం ‘డీల్‌’ నివేదిక

న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నప్పటికీ దాన్ని వినియోగించుకోవడంలో మాత్రం మన కంపెనీలు గణనీయంగా వెనుకబడ్డాయి. ఇప్పటికీ 45 శాతం సంస్థలు ఏఐ వినియోగానికి సంబంధించి ప్రారంభ దశలోనే ఉన్నాయి. చాలా మటుకు సంస్థలు ఏఐ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ, దీన్ని  పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో ఇతర గ్లోబల్‌ మార్కెట్లతో పోలిస్తే ఇంకా వెనుకబడే ఉన్నాయి. 

హెచ్‌ఆర్‌ ప్లాట్‌ఫాం ’డీల్‌’ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం 45 శాతం భారతీయ సంస్థలు ఏఐ వినియోగం విషయంలో ప్రారంభ దశలో ఉండగా, 38 శాతం కంపెనీలు మధ్య స్థాయిలో ఉన్నాయి. కేవలం 17 శాతమే అడ్వాన్స్‌డ్‌ దశలో ఉన్నాయి. తమ ప్రధాన వ్యాపార ప్రక్రియలు, ఆవిష్కరణల్లో ఏఐని ఉపయోగించుకుంటున్నాయి. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 22 మార్కెట్లకు చెందిన 5,500 వ్యాపార దిగ్గజాలతో సెపె్టంబర్‌లో డీల్‌ ఈ సర్వే నిర్వహించింది. రిపోర్టులో మరిన్ని విశేషాలు .. 

→ ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ 54 శాతం కంపెనీల్లో మాత్రమే అధికారికంగా కొత్త నైపుణ్యాల్లో శిక్షణను అమలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఇది 67 శాతంగా ఉంది. సాంకేతిక పురోగతి, సిబ్బంది సన్నద్ధత మధ్య పెరుగుతున్న అంతరాన్ని, శిక్షణపై తక్షణం మరింతగా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తోంది. 

→ మానవ వనరుల (హెచ్‌ఆర్‌) కార్యకలాపాలకు సంబంధించి ఉద్యోగుల నిర్వహణ (66 శాతం), ఉద్యోగుల నియామకాల్లో (57 శాతం) ఏఐని అత్యధికంగా ఉపయోగిస్తున్నారు.  

→ పని విధానాలను, వ్యాపారాల నిర్వహణ తీరుతెన్నులను ఏఐ సరికొత్తగా తీర్చిదిద్దుతోంది. ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాలు మారుతున్నాయి. అలాగే కంపెనీలు పరిగణనలోకి తీసుకునే నైపుణ్యాలు కూడా మారుతున్నాయి. ఉద్యోగులు, వ్యాపార సంస్థలు దీనికి వేగంగా అలవాటు పడాలి.  

→ ఏఐ వల్ల అంతర్జాతీయంగా 91 శాతం కంపెనీల్లో పలు ఉద్యోగాలకు సంబంధించిన విధుల స్వరూపం మారింది. ఏఐని అనుసంధానించేందుకు మూడో వంతు సంస్థలు (34 శాతం)గణనీయ స్థాయిలో పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాయి.  

→ వివిధ విభాగాలవ్యాప్తంగా ఉద్యోగ విధుల్లో పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు 43 శాతం కంపెనీలు వెల్లడించాయి.  

→ వచ్చే 1–3 ఏళ్ల వ్యవధిలో ఏఐ వల్ల ఎంట్రీ లెవెల్‌ నియామకాలు తగ్గుతాయని 70 శాతం దేశీ కంపెనీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్‌ సిబ్బందిని తీసుకోవడంలో అకడమిక్‌ డిగ్రీల కన్నా 66 శాతం కంపెనీలు సాంకేతిక సరి్టఫికేషన్లకు, 58 శాతం కంపెనీలు సమస్యల పరిష్కార సామర్థ్యాలకు, 52 శాతం సంస్థలు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.  

→ కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచే విషయంలో భారత సంస్థలు వెనుకబడి ఉన్నాయి. 54 శాతం సంస్థలు మాత్రమే రీస్కిలింగ్‌పై స్థిరంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న దేశాలన్నింటిలోకెల్లా ఇదే అత్యల్పం. ఈ విషయంలో కెనడా (77 శాతం), బ్రెజిల్‌ (76 శాతం), సింగపూర్‌ (74 శాతం) అగ్రస్థానంలో ఉన్నాయి.  

→ 45 శాతం కంపెనీలు ఇంకా ఎలాంటి రీస్కిలింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించలేదు. వచ్చే 12 నెలల్లో ప్రారంభించాలనే యోచనలో ఉన్నాయి. ఏఐ నైపుణ్యాలున్న వారిని రిక్రూట్‌ చేసుకోవడంలో 63 శాతం సంస్థలు సవాళ్లు ఎదుర్కొంటుకున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement