ఇస్లామాబాద్: తుర్కియేలోని ఇస్తాంబుల్ వేదికగా పాకిస్తాన్–అఫ్గానిస్తాన్‌ల మధ్య జరుగుతున్న చర్చలు ఎలాంటి అంగీకారం కుదరకుండానే ముగిశాయి. సీమాంతర ఉగ్రవాదం కట్టడి తదితర అంశాలపై గురువారం నుంచి కొనసాగుతున్న ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని ఓ అధికారి వెల్లడించారు. అఫ్గాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) మిలిటెంట్లు తమ పౌరులు, సైన్యంపై దాడులకు పాల్పడుతు న్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. టీటీపీ కార్యకలా పాలను నియంత్రిస్తామంటూ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని అఫ్గాన్ తాలిబన్లను డిమాండ్ చేస్తోంది.
చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగియడంపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ..‘ఈ చర్చలను నిలిపివేశాం. నాలుగో రౌండ్ చర్చల్లోనూ ఎలాంటి ప్రగతి కన్పించలేదు. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది’అని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు మధ్యవర్తిత్వం వహించిన తుర్కియే, ఖతార్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


