భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాలపై సైబర్ దాడులు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఇది దేశ విమానయాన మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళనలను పెంచుతూ, డిజిటల్ భద్రతా లోపాలను మరోసారి హైలైట్ చేసింది.
ఏడు విమానాశ్రయాల్లో జీపీఎస్ స్పూఫింగ్
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు రాజ్యసభలో ఇచ్చిన వివరణ ప్రకారం.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అమృత్‌సర్, హైదరాబాద్ వంటి ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో జీపీఎస్(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) స్పూఫింగ్ జరిగినట్లు చెప్పారు. దాంతో జీఎన్‌ఎస్‌ఎస్ (గ్లోబల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్) ప్రభావితం అయినట్లు తెలిపారు. ఈ దాడుల కారణంగా నావిగేషన్ వ్యవస్థల్లో సాంకేతిక అవరోధాలు తలెత్తినప్పటికీ, విమాన కార్యకలాపాల్లో ఎలాంటి అంతరాయం జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్పార్‌సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈమేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
జీపీఎస్ స్పూఫింగ్ అంటే ఏమిటి?
తప్పుడు సిగ్నల్స్‌ను ప్రసారం చేసి విమానాల నావిగేషన్ వ్యవస్థలను ప్రభావితం చేసే ఒక సైబర్ దాడి. ఇది వాస్తవ స్థానం, ఎత్తు వంటి ముఖ్య సమాచారాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది భద్రతా ప్రమాదాలకు దారితీయవచ్చు. 2023 నవంబర్‌లో డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) జీఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థ ప్రభావితం చెందడంపై అడ్వైజరీ జారీ చేసినప్పటికీ, ఈ తరహా ఘటనలు 2025లో కూడా కొనసాగినట్లు తెలుస్తుంది. అయితే దాడుల మూలాలను గుర్తించేందుకు ప్రభుత్వం వైర్‌లెస్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ (WMO) సహాయంతో పరిశోధన ప్రారంభించింది. ప్రభావిత విమానాశ్రయాలు ప్రస్తుతం హై అలర్ట్‌లో ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలు నిరంతర భద్రతా ప్రోటోకాల్స్ పాటిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా మంత్రి నాయుడు మాట్లాడుతూ..‘ఈ దాడుల వల్ల విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదు. అయినా ఆకస్మిక చర్యలు, మెరుగైన సైబర్ ప్రతిచర్యలు అమలు చేస్తున్నాం’ అని తెలిపారు.
ఇదీ చదవండి: వద్దు పొమ్మన్నారు.. ఇప్పుడు తానే కింగ్ మేకర్


