సాక్షి మెదక్: అల్లదుర్గం మండలంలో జరిగిన ఓ ఘటన అక్కడ స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మండలంలోని ఒక గ్రామ శివారులో ఒక రాబందు కాళ్లకు జీపీఎస్ ట్రాకర్‌తో సంచరించసాగింది. ఇది గమనించిన ప్రజలు తమ గ్రామానికి ఏదైనా కీడు జరుగుతుందేమోనని భయపడ్డారు. అనంతరం అటవీ శాఖ అధికారులు వచ్చి వివరణ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బహిరన్ దిబ్బ గ్రామ శివారులో శనివారం సాయంత్రం జీపీఎస్ ట్రాకర్ సిస్టంతో ఉన్న ఒక రాబందు సంచరించింది. రాబందు కాళ్లకు నెంబర్లతో కూడిన స్టిక్కర్స్ ఉండడంతో తమ గ్రామానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని అక్కడి ప్రజలు ఆందోళన చెందారు. దీంతో వెంటనే వారు అటవీశాఖ అధికారులను సంప్రదించగా వారు వచ్చి ఆ పక్షిని పరిశీలించారు.
ఆ రాబందుకు మహారాష్ట్రకు చెందిందని రాబందుల జాడ తెలిసేలా వాటిని ట్రేస్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం జీపీఎస్ ట్రాక్‌ను కాళ్లకు కట్టి వదిలేసిందని తెలిపారు. రాబందులు సంచరించే వివరాలు తెలవడంతో పాటు వాటికి ఎవరైనా హాని తలపెట్టినా ఆ సమాచారం వెంటనే అక్కడి అధికారులకు చేరుతుందని పేర్కొన్నారు.

కనుక రాబందులు అంతరించిపోతున్న జాతికి చెందినవని వాటికి ఎవరైనా హాని తలపెడితే కఠిన చర్యలుంటాయని ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రజలకు సూచించారు.


