ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 10,500 కోట్లు ఉండొచ్చు
దేశీ విమానయాన పరిశ్రమపై అంచనాలు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ విమానయాన పరిశ్రమ నష్టాలు నికరంగా రూ. 9,500 కోట్ల–రూ. 10,500 కోట్ల మేర ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన సుమారు రూ. 5,500 కోట్లతో పోలిస్తే ఇవి రెట్టింపు స్థాయిలో ఉండొచ్చని ఒక నివేదికలో తెలిపింది.
ప్రధానంగా ప్యాసింజర్ల వృద్ధి నెమ్మదించడం, విమానాల డెలివరీలతో ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడంలాంటి అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తాయని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ప్యాసింజర్ల ట్రాఫిక్ వృద్ధి 4–6 శాతం మేర ఉంటుందని తెలిపింది. అయితే, ఆర్థికంగా పరిశ్రమపై ఒత్తిడి నెలకొంటుందని నివేదిక పేర్కొంది. కానీ, 2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా నమోదైన రూ. 21,600 కోట్లు, రూ. 17,900 కోట్లతో పోలిస్తే తాజా ఆర్థిక సంవత్సరంలో నష్టాలు తక్కువ స్థాయిలో ఉంటాయని తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ ట్రాఫిక్ 7.6 శాతం వృద్ధి చెంది, 16.53 కోట్లకు చేరింది. అక్టోబర్‌లో దేశీయంగా విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 1.43 కోట్లుగా నమోదైంది. వార్షికంగా 4.5 శాతం, నెలలవారీగా సెపె్టంబర్‌తో పోలిస్తే 12.9 శాతం పెరిగింది. కానీ సీమాంతర ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా అవాంతరాలు, 2025 జూన్‌లో విమాన దుర్ఘటన తర్వాత ప్రయాణాలు చేయడంపై సందేహాలు నెలకొనడంలాంటి అంశాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వృద్ధి ఒక మోస్తరుగానే ఉండొచ్చని నివేదిక వివరించింది. ఇక సరఫరా వ్యవస్థపరమైన అవరోధాలు, ఇంజిన్ వైఫల్యాల వల్ల విమానాలు ఎగరలేని పరిస్థితులు మొదలైన అంశాలు పరిశ్రమకు ప్రతికూలంగా ఉంటున్నాయని పేర్కొంది. 2025 మార్చి 31 నాటికి వివిధ కంపెనీలకు చెందిన 133 విమానాలు పక్కన పెట్టాల్సి వచి్చందని, మొత్తం పరిశ్రమ ఫ్లీట్‌లో ఇది 15–17 శాతమని నివేదిక వివరించింది. నిర్వహణపరమైన సవాళ్ల వల్ల ఎయిర్‌లైన్స్ వ్యయాలు
పెరిగిపోయాయని పేర్కొంది.


