న్యూఢిల్లీ: మొబైల్ రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర నష్టం తగ్గి రూ. 5,524 కోట్లకు పరిమితమైంది.
భారీ రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న కంపెనీ గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 7,176 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం టర్నోవర్ రూ. 10,932 కోట్ల నుంచి స్వల్ప(2 శాతం) వృద్ధితో రూ. 11,195 కోట్లకు చేరింది.
ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) 9 శాతం మెరుగుపడి రూ. 180ను తాకింది. గత క్యూ2లో రూ. 166 ఏఆర్‌పీయూ సాధించింది. కస్టమర్లు అప్‌గ్రేడ్ కావడం, టారిఫ్‌ల పెంపు ఇందుకు దోహదపడ్డాయి. 2025 సెప్టెంబర్‌కల్లా కంపెనీ రుణ భారం రూ. 2,02,951 కోట్లకు చేరింది.


