ఏఐతో హైరింగ్ స్పీడ్ అప్
స్టార్టప్‌ల కొత్త బాట
సేల్స్, కస్టమర్ సరీ్వస్ తదితర విభాగాల్లో రిక్రూట్‌మెంట్
40 శాతం వరకు సమయం ఆదా
రోజువారీ ఉద్యోగ విధుల్లో భాగంగా కస్టమర్లతో మాట్లాడాల్సిన ఫ్రంట్‌లైన్ ఉద్యోగులను తీసుకునేందుకు అంకుర సంస్థలు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. ప్రాథమికంగా దరఖాస్తులను మదింపు చేయడంలాంటి పనుల కోసం ప్రాంతీయ భాషల్లోని కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ టూల్స్ వినియోగంతో నియామకాలకు పట్టే సమయం దాదాపు 40% వరకు ఆదా అవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
షెఫ్‌లు, స్టోర్ ఆపరేటర్లలాంటి ఉద్యోగాలకు చాలా మంది దరఖాస్తుదారులు, ఇంగ్లిష్ కన్నా, ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడటమే సౌకర్యవంతంగా భావిస్తున్నారనే విషయం గ్రహించిన క్లౌడ్ కిచెన్ ఆపరేటరు క్యూర్‌ఫుడ్స్ ఈ ఏడాది నుంచి నియామకాల ప్రక్రియ కోసం నేటివ్ ల్యాంగ్వేజ్ ఏఐ సాధనాలను ఉపయోగించడం ప్రారంభించింది.
ప్రస్తుతం తొలి దశ స్క్రీనింగ్‌ను ఆటోమేటెడ్ వాయిస్‌బాట్స్‌తో నిర్వహిస్తోంది. దీని వల్ల రిక్రూట్‌మెంట్ విభాగం సిబ్బందిపై ఒత్తిడి, అలాగే నియామకాలకు పట్టే సమయం తగ్గుతోందని కంపెనీ పేర్కొంది. తెలుగు, తమిళం, హిందీ తదితర ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చే, ద్వితీయ..తృతీయ శ్రేణి పట్టణాల్లో నివసించే ప్రతిభావంతులైన దరఖాస్తుదార్లనూ పరిగణనలోకి తీసుకునేందుకు వీలవుతోందని తెలిపింది. వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతోందని పేర్కొంది.
వాహన్ ఏఐ తదితర థర్డ్ పార్టీ ప్లాట్‌ఫాంలు
కొన్ని ఈ–కామర్స్, టెక్ స్టార్టప్‌లలో సిబ్బంది సంఖ్య 70 శాతం పైగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. చాలా అంకుర సంస్థలు తమ మానవ వనరుల విభాగంలో సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రాంతీయ భాషల్లో హైరింగ్ సొల్యూషన్స్ అందించే థర్డ్ పార్టీ ప్లాట్‌ఫాంల సర్వీసులను వినియోగించుకుంటున్నాయి. దీంతో వాహన్ ఏఐ, బోల్నా ఏఐ, సంవాదిని లాంటి కంపెనీల సేవలకు డిమాండ్ పెరుగుతోంది.
స్టార్టప్‌లు చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతులను కూడా తీసుకునేందుకు ఈ తరహా హైరింగ్ విధానం ఉపయోగపడుతోందని ఇన్‌స్టాహైర్ వర్గాలు వివరించాయి. దేశీయంగా ఏఐ ప్రొఫెషనల్స్ 23.5 లక్షల మంది పైగా ఉన్నప్పటికీ వివిధ కార్యకలాపాల నిర్వహణకు తగినంత మంది దొరకడం లేదు. డిమాండ్, సరఫరాకి మధ్య 51% పైగా వ్యత్యాసం ఉంటోంది. దీనితో ఎక్కువగా సంక్లిష్టత ఉండని, పెద్ద స్థాయిలో నిర్వహించాల్సిన ప్రాథమిక స్క్రీనింగ్, రొటీన్‌గా వచ్చే ప్రశ్నలకు సమాధానాలివ్వడం, ఇంటర్వ్యూలను ఫిక్స్ చేయడంలాంటి పనుల కోసం అంకురాలు ఏఐ టూల్స్‌ని ఎంచుకుంటున్నాయి.
ప్రాంతీయ భాషల్లోని వాయిస్ బాట్స్ ఏకకాలంలో పెద్ద సంఖ్యలో కాల్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్నాలాంటి జాబ్స్ మార్కెట్‌ప్లేస్ అంకుర సంస్థ అంతర్గతంగా రూపొందించిన ఏఐ కాలింగ్ ఏజెంటును వినియోగిస్తోంది. తొలి దశ స్క్రీనింగ్‌కి దీన్ని ఉపయోగిస్తోంది. రిక్రూటర్లు నిర్దిష్టంగా ప్రశ్నలను తయారు చేసి సిస్టమ్‌లో ఫీడ్ చేస్తారు. ఆ తర్వాత సదరు సిస్టమే, దరఖాస్తుదార్లకు కాల్ చేసి, వారి సమాధానాలను విశ్లేíÙంచుకుని, షార్ట్‌లిస్ట్ చేస్తుంది. దీని వల్ల మాన్యువల్‌గా స్క్రీనింగ్‌కి పట్టే సమయం సగానికి పైగా తగ్గింది. ఈ టూల్‌ని అప్నా తమ క్లయింట్ కంపెనీలకూ ఆఫర్ చేస్తోంది.
మెరుగ్గా అంచనా వేసేందుకు వీలు ..
అలాగే దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) రుణ సేవలందించే ఫ్లెక్సిలోన్స్ కూడా ఇదే తరహాలో నియామకాలకు ఏఐ టూల్స్‌ని ఉపయోగిస్తోంది. దీనితో ఫ్రంట్‌లైన్ సిబ్బంది నియామకాల ప్రక్రియకు పట్టే సమయం 30–40 శాతం మేర తగ్గిందని కంపెనీ వివరించింది. అభ్యర్ధులు తమకు సౌకర్యవంతంగా ఉండే భాషలో మాట్లాడటం వల్ల వారి సామర్థ్యాలను మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు వీలవుతోందని తెలిపింది. ఇలాంటి సిస్టమ్స్ ఇచ్చే విశ్లేషణల వల్ల పక్షపాత ధోరణి తగ్గి, అభ్యర్ధుల షార్ట్‌లిస్టింగ్ ప్రక్రియ వేగవంతమవుతుందని ఫ్లెక్సిలోన్స్ వివరించింది. ముఖ్యంగా రాతపరమైన ఇంగ్లిష్ నైపుణ్యాల కన్నా స్థానిక భాషల్లో మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా అవసరమయ్యే సేల్స్, కలెక్షన్ మొదలైన ఉద్యోగాలకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొంది.
సాక్షి, బిజినెస్‌డెస్క్


