భారతదేశ సాంకేతిక పర్యావరణ వ్యవస్థలో ఉచితంగా ఏఐ (కృత్రిమ మేధస్సు) సేవలు అందుబాటులో ఉండటం అనేది రెండు వైపులా పదునున్న కత్తితో సమానమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఇది వినియోగదారులకు, సాంకేతిక అభివృద్ధికి గొప్ప అవకాశాలను అందిస్తుంది. మరోవైపు, దేశీయ జనరేటివ్ AI ఆవిష్కరణ, స్థానిక డెవలపర్‌ల దీర్ఘకాలిక పోటీతత్వానికి ఇది తీవ్రమైన సవాళ్లను సృష్టిస్తుంది.
ఉచిత AI సర్వీసులు
ఖర్చు లేకుండా ఏఐ సాధనాలను ఉపయోగించే అవకాశం లభించడం వల్ల సామాన్య ప్రజలకు కూడా అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. చిన్న వ్యాపారాలు, విద్యార్థులు, కంటెంట్ సృష్టికర్తలు తమ పనులను మెరుగుపరచుకోవడానికి, సృజనాత్మకతను పెంచుకోవడానికి దీనిని ఉపయోగించుకుంటున్నారు. ఉచిత ప్లాట్‌ఫామ్‌లు విద్యార్థులకు, ఔత్సాహిక డెవలపర్‌లకు ఏఐ మోడల్‌లతో ప్రయోగాలు చేయడానికి, నేర్చుకోవడానికి, కొత్త పరిష్కారాలను ఆవిష్కరించడానికి ఒక పరీక్షా వేదికలా పనిచేస్తున్నాయి.
ఉదాహరణకు, ఉచిత జనరేటివ్ ఏఐ టూల్స్ ద్వారా నివేదికలు రాయడం, ఈమెయిల్‌లకు సమాధానాలు ఇవ్వడం లేదా కోడింగ్‌లో సహాయం పొందడం వంటివి పనిలో వేగం, సామర్థ్యాన్ని పెంచుతాయి.
లాభాలు ఉన్నప్పటికీ..
ఉచిత సేవలను ఉపయోగించేటప్పుడు వినియోగదారులు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన డేటాను ఆయా కంపెనీలకు తెలియకుండానే ఏఐకి ఇస్తున్నారు. ఈ డేటాను ఏఐ మోడల్ శిక్షణకు లేదా ఇతర వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు. ఉచిత సంస్కరణలు తరచుగా పరిమిత ఫీచర్‌లు, తక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి. క్లిష్టమైన పనులకు లేదా మెరుగైన ఫలితాల కోసం వినియోగదారులు తరచుగా పెయిడ్ (చెల్లింపు) సేవలకు మారవలసి వస్తుంది. ఉచితంగా లభించే కొన్ని AI మోడళ్లు ట్రెయినింగ్ డేటాలోని అంశాలను కూడా యూజర్లకు అందించే అవకాశం ఉంది. దీని వల్ల వినియోగదారులు తప్పుడు ఫలితాలను పొందవచ్చు.
కంపెనీలపై ప్రభావం
భారతదేశంలో కొత్తగా జనరేటివ్ ఏఐ మోడళ్లను లేదా ఉత్పత్తులను సృష్టిస్తున్న స్థానిక స్టార్టప్‌లు, డెవలపర్‌లకు ఇది సవాలుగా మారవచ్చు. గ్లోబల్ టెక్ దిగ్గజాలు (ఉదాహరణకు మైక్రోసాఫ్ట్, గూగుల్) తమ ఏఐ సేవలను ఉచితంగా లేదా చాలా తక్కువ ధరకు అందించినప్పుడు స్థానిక స్టార్టప్‌లు తమ సర్వీసులకు ధర నిర్ణయించలేవు. అధిక పెట్టుబడి, వనరులు, మెరుగైన మోడళ్లను కలిగి ఉన్న అంతర్జాతీయ సంస్థలతో పోటీపడటం అసాధ్యం. కొత్త కంపెనీ ఉత్పత్తుల ద్వారా లాభాలు సంపాదించడం కష్టమని పెట్టుబడిదారులు గ్రహించినప్పుడు స్థానిక ఏఐ స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడం తగ్గిపోతుంది. లాభదాయకత లేకపోవడం వల్ల స్థానిక కంపెనీలు ఆర్ అండ్ డీపై తగినంత పెట్టుబడి పెట్టలేక దేశీయ ఆవిష్కరణకు, ప్రపంచ స్థాయి AI మోడళ్లను నిర్మించడానికి ఆటంకం ఏర్పడుతుంది.
ఏఐ సేవలు వాడేటప్పుడు యూజర్లు అనుసరించాల్సినవి..
ఉచిత AI సాధనాలు తరచుగా వినియోగదారుల డేటాను శిక్షణ కోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాయి. కాబట్టి బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, సున్నితమైన వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సమాచారం వంటి అత్యంత గోప్యమైన డేటాను ఎప్పుడూ AI సిస్టమ్‌లలో నమోదు చేయకూడదు.
ఏఐ సేవలను ఉపయోగించే ముందు ఆ టూల్స్ డేటా వినియోగ విధానాలు తెలుసుకోవాలి. వారు మీ డేటాను ఎలా నిల్వ చేస్తారు, ఎక్కడ ఉపయోగిస్తారు, ఎవరితో పంచుకుంటారు అనే దానిపై అవగాహన కలిగి ఉండాలి.
కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు లేదా ముఖ్యమైన పత్రాల్లో ఈ సమాచారాన్ని ఉపయోగించే ముందు ఏఐ డేటాను విశ్వసనీయ మూలాల ద్వారా ధ్రువీకరించాలి.
ఇదీ చదవండి: ‘అడ్డంకులు తొలిగాయి.. లెజెండ్స్ పుట్టారు’


