ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల సమక్షంలో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా జట్టుపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో భారత్ మొదటిసారి ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో టెక్ పరిశ్రమ దిగ్గజాలు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సోషల్ మీడియా వేదికగా ఇండియా జట్టును అభినందించారు.
భారతదేశం ప్రతిష్టాత్మక క్రికెట్ విజయాలను గుర్తుచేస్తూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ ఫైనల్‌ను ఉత్కంఠభరితమైన మ్యాచ్‌గా అభివర్ణించారు. ‘భారత క్రికెట్ మహిళల జట్టుకు అభినందనలు. ఈ విజయంతో 1983, 2011నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఈ విజయం మొత్తం తరానికి స్ఫూర్తినిస్తుందని అనుకుంటున్నాను. దక్షిణాఫ్రికా టీమ్‌కు కూడా ఇదో గొప్ప టోర్నమెంట్’ అని తన ఎక్స్ ఖాతాలో టీమ్ ఇండియాను అభినందించారు.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఈ విజయంపై స్పందిస్తూ..‘ఉమెన్ ఇన్ బ్లూ = ప్రపంచ ఛాంపియన్లు! మహిళల క్రికెట్‌కు నిజంగా చారిత్రక రోజు. కొత్త అధ్యాయాలు లిఖించారు. అడ్డంకులు తొలిగాయి. లెజెండ్స్ పుట్టుకొచ్చారు. ఈ ఫార్మాట్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికాకు ప్రశంసలు’ అని రాసుకొచ్చారు.
ఇదీ చదవండి: అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌పై ఈడీ చర్య


