అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై మనీలాండరింగ్ ఆరోపణల దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగవంతం చేసింది. సుమారు రూ.3,084 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తున్నట్లు తాజాగా తెలిపింది. అక్టోబర్ 31న జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.
జప్తు చేసిన ఆస్తుల వివరాలు
మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో ముంబైలోని పాలి హిల్‌లో ఉన్న అనిల్ అంబానీ కుటుంబ నివాసం, ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్ ఆస్తులు ఉన్నాయి. మొత్తం ఎనిమిది నగరాల్లోని ఆస్తులు జప్తు అయ్యాయి. సుమారు రూ. 3,084 కోట్లు విలువ చేసే ఆ ఆస్తులు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పుణె, థానే, హైదరాబాద్, చెన్నై, తూర్పు గోదావరి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో నివాస భవనాలు, కార్యాలయ ప్రాంగణాలు, భూములున్నాయి.
అసలు కేసు ఏంటి?
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ యెస్ బ్యాంక్ నుంచి సమీకరించిన నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర మార్గాలకు మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL) సేకరించిన నిధుల మళ్లింపుపై దర్యాప్తు జరుగుతోంది. 2017 నుంచి 2019 మధ్య కాలంలో యెస్ బ్యాంక్ RHFLకు రూ.2,965 కోట్లు, RCFLకు రూ.2,045 కోట్లు ఇచ్చింది. అయితే వీటిని తిరిగి చెల్లించడంలో అనిల్ అంబానీ, తన ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థలు విఫలమయ్యాయి.
ఈడీ దర్యాప్తులో అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ గ్రూప్ లింక్డ్ సంస్థలకు పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు, రుణాల మంజూరు జరిగినట్లు తేలింది. ఈ వ్యవహారాన్ని ఈడీ ఉద్దేశపూర్వక, స్థిరమైన నియంత్రణ వైఫల్యాలుగా అభివర్ణించింది. కొన్ని కంపెనీలు దరఖాస్తు చేసిన అదే రోజున రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపింది. కొన్ని సందర్భాల్లో దరఖాస్తులు సమర్పించడానికి ముందే రుణాలు అడ్వాన్స్ చేసినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: ఆల్ఫాబెట్, అమెజాన్‌ల పంట పండించిన స్టార్టప్


