చెన్నై: తమిళనాడులో చోటుచేసుకున్న టెండర్ల కుంభకోణంలో పలు ఆసక్తికర వైనాలు వెలుగు చూస్తున్నాయి. తమిళనాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నీటి సరఫరా శాఖ (ఎంఏడబ్యూఎస్)అధికారులు సంయుక్తంగా టెండర్లలో రూ.1,020 కోట్ల లంచం వసూలు చేశారనే ఆరోపణలతో ఎప్‌ఐఆర్ నమోదు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరింది. కాంట్రాక్టర్ల నుండి టెండర్ల నంచి లబ్ధి పొందేందుకు ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది.
డీఎంకే మంత్రి సహచరులు ఎంఏడబ్యూఎస్ పనుల కాంట్రాక్ట్ విలువలో 7.5 శాతం నుండి 10 శాతం వరకు పార్టీ నిధులుగా వసూలు చేశారని ఏజెన్సీ తన లేఖలో పేర్కొంది. కాగా ఈ ఆరోపణలపై ఎంఏడబ్యూఎస్ మంత్రి కె.ఎన్. నెహ్రూ తీవ్రంగా స్పందించారు. ఈ ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటానని ప్రకటించారు, ఇవి రాజకీయ ప్రేరేపితమని ఖండించారు. ప్రతిపక్షాలు డీఎంకే ప్రభుత్వ విజయాలను అంగీకరించలేకనే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీని దుర్వినియోగం చేస్తోందని, దానిని పనికిమాలిన సంస్థగా మార్చిందని మంత్రి ఆరోపించారు. ఏఐడీఎంకే-బీజేపీ కూటమి ఆదేశం మేరకే ఈ ఆరోపణలు వస్తున్నాయని ఆయన ‘ఎక్స్’పోస్ట్‌లో పేర్కొన్నారు. తన కుటుంబంపై గతంలో ఉన్న కేసులను హైకోర్టు రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు.
కాగా ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకే ఈ విషయంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు డిమాండ్ చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి కే పళనిస్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం కమీషన్-కలెక్షన్-కరప్షన్ పాలన నడుపుతోందని ఆరోపించారు. మంత్రి బంధువులు నిర్వహించే కమిషన్ నెట్‌వర్క్ ద్వారా టెండర్లు తారుమారు చేశారని, కాంట్రాక్టర్ల నుండి 7.5 శాతం నుండి 10 శాతం వరకు వివిధ స్థాయిలలో 20 శాతం నుండి 25 శాతం వరకు కమీషన్లు వసూలు చేసిందని ఈడీ గుర్తించినట్లు ఏఐడీఎంకే పేర్కొంది. ప్రభుత్వంపై గతంలో వచ్చిన రూ.888 కోట్ల ‘ఉద్యోగాలకు నగదు కేసును కూడా పళనిస్వామి ప్రస్తావించారు, ప్రభుత్వం.. నిందితులను కాపాడుతోందని ఆరోపించారు. ఈ అవినీతి డబ్బును రికవరీ చేస్తే.. మెట్రో రైలు ప్రాజెక్టులు, విద్యార్థులకు వార్షిక ల్యాప్‌టాప్ పంపిణీ, రేషన్ కార్డుదారులకు రూ.5,000 పొంగల్ సహాయం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూరుతాయని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ప్రయాణికులకు క్షమాపణలు.. ఇండిగో పైలట్ భావోద్వేగం


