అయిదేళ్లలో 2,500కి జీసీసీలు  | Global Capability Centers in India are driving significant office space demand | Sakshi
Sakshi News home page

అయిదేళ్లలో 2,500కి జీసీసీలు 

Oct 26 2025 5:16 AM | Updated on Oct 26 2025 5:16 AM

Global Capability Centers in India are driving significant office space demand

ఆఫీస్‌ స్పేస్‌కి భారీగా డిమాండ్‌ 

ఇక్రా అంచనా 

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రస్తుతం సుమారు 1,700గా ఉన్న గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) సంఖ్య వచ్చే అయిదేళ్లలో 2,500కు చేరుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దీనితో ఆఫీస్‌ స్పేస్‌కి భారీగా డిమాండ్‌ ఏర్పడనుందని ఒక నివేదికలో పేర్కొంది. జీసీసీలు 100 బిలియన్‌ డాలర్ల పైగా ఆదాయం ఆర్జిస్తాయని, సిబ్బంది సంఖ్య 1.5–2 రెట్లు పెరుగుతుందని వివరించింది. 

2024–25 ఆర్థిక సంవత్సరంలో జీసీసీలు రికార్డు స్థాయిలో, టాప్‌ ఆరు నగరాల్లో 24 మిలియన్‌ చ.అ. గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయి. దీంతో మొత్తం లీజుల్లో వాటి వాటా 37 శాతానికి ఎగిసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 27 శాతంగా ఉండేది. ఇక 2026, 2027 ఆర్థిక సంవత్సరాల్లో జీసీసీలు 50–55 మిలియన్‌ చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ను తీసుకుంటాయని నివేదికలో ఇక్రా పేర్కొంది. 

దీనితో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ సహా ఆరు టాప్‌ మార్కెట్లలో మొత్తం ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌లో వీటి వాటా 38–40 శాతంగా ఉంటుందని వివరించింది. వ్యయాల ఆదాపరంగా గట్టిగా పోటీనివ్వగలగడం, ప్రతిభావంతుల లభ్యత, పాలసీలపరంగా మద్దతు మొదలైన అంశాల వల్ల గ్లోబల్‌ కంపెనీలను భారత్‌ ఆకర్షించగలుగుతోందని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ అనుపమ రెడ్డి తెలిపారు. దీనితో అవి భారత్‌లో కార్యకాలపాలు విస్తరిస్తున్నాయని వివరించారు. నివేదిక ప్రకారం 2021 నుంచి మొత్తం జీసీసీల వినియోగంలో 70 శాతం వాటాతో అమెరికాకు చెందిన జీసీసీలు అగ్రస్థానంలో ఉన్నాయి.  

జీసీసీల కేంద్రంగా భారత్‌.. 
తయారీ కార్యకలాపాలకి చైనా ఎలాగైతే కేంద్రంగా మారిందో ప్రస్తుతం జీసీసీలకు భారత్‌ కేంద్రంగా మారిందని సత్వ గ్రూప్‌ వీపీ శివం అగర్వాల్‌ తెలిపారు. ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. ఇంగ్లీష్‌ మాట్లాడగలిగే యువ సిబ్బంది, అత్యంత తక్కువ వ్యయాల్లో ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో సరీ్వసులను అందిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఈ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలంటే అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిచేందుకు రియల్‌ ఎస్టేట్, ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేయాల్సి ఉంటుందని అగర్వాల్‌ చెప్పారు. 

రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు అనువుగా, ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉంటూ, సులభంగా విస్తరించేందుకు వీలుగా ఉండే ఆఫీసుల కోసం కంపెనీలు అన్వేíÙస్తున్నాయని బీహైవ్‌ వర్క్‌స్పేస్‌ సీఈవో శేష్‌ రావ్‌ పాప్లికర్‌ తెలిపారు. వర్క్‌ప్లేస్‌లను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. మరోవైపు, జీసీసీ కార్యకలాపాలు, ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ పెరగడమనేది అంతర్జాతీయ బిజినెస్‌ హబ్‌గా భారత్‌కి పెరుగుతున్న ప్రాధాన్యతకి నిదర్శనమని స్పేజ్‌వన్‌ కో–పౌండర్‌ సిజో జోస్‌ తెలిపారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement