‘‘ముప్పై ఏళ్ల యువకుడు.. ఇటీవలే కెరియర్‌లో స్థిరపడ్డాడు. మంచి జీతం. ఈఎంఐలతో ఇల్లు, కారు కొనుగోలు చేశాడు. అయితే, అనుకోని ప్రమాదంలో మరణించాడు. అతని ఆదాయంపై ఆధారపడిన తన భార్య, చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆర్థిక కష్టాల్లో పడ్డారు. పెద్ద మొత్తంలో ఉన్న లోన్ భారం, పిల్లల చదువుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఆర్థిక భద్రతకు అత్యంత సరళమైన, శక్తివంతమైన మార్గమైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఈ దుర్భర పరిస్థితిని నివారించేవారు’’
ఈ రోజుల్లో ఆర్థిక నిపుణులు ముఖ్యంగా 1980 తర్వాత పుట్టినవారు (నేటి మధ్య వయస్కులు, సీనియర్ ప్రొఫెషనల్స్), 1997-2007 మధ్య పుట్టిన యువతరం (మిలీనియల్స్/జనరేషన్ జెడ్) తప్పనిసరిగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పెట్టుబడి ప్లాన్ కాదు. ఇది కేవలం ప్యూర్ ప్రొటెక్షన్ (Pure Protection) ప్లాన్. బీమా తీసుకున్న వ్యక్తి పాలసీ కాలంలో మరణిస్తే అతని కుటుంబానికి లేదా నామినీకి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం లభిస్తుంది.
టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
టర్మ్ ఇన్సూరెన్స్ ఒక నిర్దిష్ట కాలానికి (ఉదాహరణకు, 10, 20, 30 సంవత్సరాలు లేదా 60/ 80 ఏళ్ల వయసు వరకు) కవరేజీని అందిస్తుంది. ఈలోపు పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నిబంధనల ప్రకారం ఇన్సూరెన్స్ డబ్బు నామినీకి చెందుతుంది. ఇతర జీవిత బీమా పథకాలతో పోలిస్తే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్‌కు ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో మీ కుటుంబానికి రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ కవరేజీని అందించవచ్చు.
పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా మొత్తాన్ని (Sum Assured) ఏకమొత్తంగా లేదా నిర్ణీత కాల వ్యవధిలో నెలవారీ ఆదాయంగా పొందే అవకాశం ఉంటుంది. పాలసీదారుడు పాలసీ కాలం ముగిసే వరకు జీవించి ఉంటే సాధారణంగా చెల్లించిన ప్రీమియం తిరిగి రాదు (టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం - వంటి ప్రత్యేక ప్లాన్‌లలో ప్రీమియం కూడా వస్తుంది. అయితే అందుకు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది). అందుకే ఇది ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్.
1980 తర్వాత పుట్టిన వారికి..
1980 తర్వాత పుట్టిన వారిలో చాలా మంది ఇప్పుడు 40 లేదా 45 ఏళ్ల వయసులో ఉన్నారు. ఈ దశలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదా ఉన్న కవరేజీని పెంచుకోవడం చాలా అవసరం. పిల్లలు కాలేజీ లేదా ఉన్నత విద్య దశలో ఉంటారు. వారి చదువులు, పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఇంటి పెద్ద లేని సమయంలో ఈ లక్ష్యాలు నెరవేరడం కష్టమవుతుంది.
చాలా మందికి ఈ వయసులో హోమ్ లోన్, కార్ లోన్ వంటి భారీ ఈఎంఐ బాధ్యతలు ఉంటాయి. పాలసీదారు మరణిస్తే ఈ లోన్ భారం మొత్తం కుటుంబంపై పడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే మొత్తం ఈ రుణాలను సులభంగా తీర్చడానికి ఉపయోగపడుతుంది.
ఆరోగ్య సమస్యలు
వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య ప్రమాదాలు (క్రిటికల్ ఇల్‌నెస్) పెరిగే అవకాశం ఉంటుంది. టర్మ్ ప్లాన్‌తో పాటు రైడర్స్ తీసుకోవడం ద్వారా ముఖ్యమైన అనారోగ్యాలు సంభవించినా ఆర్థిక భద్రత లభిస్తుంది.
1997-2007 మధ్య పుట్టిన యువత
ఈ జనరేషన్ జీ/మిలీనియల్స్‌కు టర్మ్ ఇన్సూరెన్స్ అత్యంత ముఖ్యమైంది. ఎందుకంటే వారికి అతి తక్కువ ప్రీమియంతో జీవితకాలం రక్షణ పొందే అద్భుత అవకాశం ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వయసు ముఖ్యమైన అంశం. చిన్న వయసులో (20-30 ఏళ్ల మధ్య) తీసుకుంటే ఆరోగ్య ప్రమాదాలు తక్కువగా ఉంటాయి కాబట్టి, ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, 25 ఏళ్ల వయసులో తీసుకున్న ప్రీమియం, 35 ఏళ్లలో తీసుకున్న ప్రీమియం కంటే గణనీయంగా తక్కువగా ఉంటుంది.
ఆర్థిక బాధ్యతలు
ఈ యువతరం ఇప్పుడిప్పుడే వివాహం చేసుకుని, పిల్లల పెంపకం, సొంత ఇల్లు, ఇతర జీవిత లక్ష్యాల దిశగా అడుగులు వేస్తారు. కుటుంబం వారిపై ఆధారపడటం మొదలవుతుంది. ఈ దశలోనే రక్షణ కవచం ఏర్పరచుకోవడం తెలివైన నిర్ణయం.
దీర్ఘకాలిక రక్షణ
తక్కువ ప్రీమియంతో 60 లేదా 70 ఏళ్ల వరకు కూడా కవరేజీ తీసుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందుతాయి.
ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం


