బీమా అనైతిక విక్రయాలకు చెక్!.. ఐఆర్‌డీఏఐ | Mis Selling in Insurance Sector Significant Concern IRDAI | Sakshi
Sakshi News home page

బీమా అనైతిక విక్రయాలకు చెక్!.. ఐఆర్‌డీఏఐ

Jan 7 2026 3:12 PM | Updated on Jan 7 2026 3:39 PM

Mis Selling in Insurance Sector Significant Concern IRDAI

బీమా రంగంలో ఉత్పత్తులను తప్పుదోవ పట్టించి విక్రయించడం (అనైతిక మార్గాల్లో) ఆందోళన కలిగిస్తున్నట్టు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌ఈఏఐ) వార్షిక నివేదిక పేర్కొంది. అసలు దీనికి గల కారణాలను గుర్తించేందుకు బీమా సంస్థలు లోతైన విశ్లేషణ చేయాలని సూచించింది.

2023–24లో జీవిత బీమా కంపెనీలకు వ్యతిరేకంగా 1,20,726 ఫిర్యాదులు రాగా, 2024–25లోనూ ఇదే స్థాయిలో 1,20,429 ఫిర్యాదులు దాఖలైనట్టు తెలిపింది. అనైతిక వ్యాపార విధానాలపై మాత్రం ఫిర్యాదులు 23,335 నుంచి 26,667కు పెరిగినట్టు వెల్లడించింది. మొత్తం ఫిర్యాదుల్లో అనైతిక వ్యాపార పద్ధతులకు సంబంధించినవి 19.33 శాతం నుంచి 22.14 శాతానికి పెరిగినట్టు పేర్కొంది.

వ్యక్తుల అవసరాలకు సరిపడని, నియమ, నిబంధనలు, షరతులు గురించి పూర్తిగా తెలియజేయకుండా, కేవలం ప్రయోజనాల గురించే చెబుతూ పాలసీలను విక్రయించడాన్ని మిస్‌ సెల్లింగ్‌గా చెబుతుంటారు. బ్యాంక్‌లు, బీమా ఏజెంట్ల రూపంలో ఈ తరహా విక్రయాలు సాగుతుంటాయి. ‘‘మిస్‌ సెల్లింగ్‌ను నిరోధించేందుకు గాను తగిన విధానాలను అమలు చేయాలని బీమా సంస్థలకు సూచించాం. ఉత్పత్తి అనుకూలతను అంచనా వేయడం (పాలసీదారునకు అనుకూలమైనా), పంపిణీ ఛానల్‌ వ్యాప్తంగా కొన్ని నియంత్రణలు అమలు చేయడం, మిస్‌ సెల్లింగ్‌పై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించడం, మూల కారణాలను గుర్తించేందుకు అధ్యయనం చేయాలని సూచించడమైంది’’అని ఐఆర్‌డీఏఐ తన 2024–25 నివేదికలో వివరించింది.

తప్పుడు మార్గాల్లో బీమా ఉత్పత్తుల విక్రయంపై కేంద్ర ఆర్థిక శాఖ బ్యాంక్‌లు, బీమా సంస్థలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉండడం గమనార్హం. అనుకూలం కాని పాలసీలను విక్రయించడం పాలసీదారులు తర్వాత రెన్యువల్‌ చేసుకోరని, దాంతో పాలసీల రద్దునకు దారితీస్తున్నట్టు పేర్కొంది.

బీమా విస్తరణ 3.7 శాతం
దేశంలో బీమా విస్తరణ 2024–25 సంవత్సరానికి జీడీపీలో 3.7 శాతంగా ఉన్నట్టు ఐఆర్‌డీఏఐ నివేదిక తెలిపింది. ఇది ప్రపంచ సగటు 7.3 శాతం కంటే సగమే. జీవిత బీమా రంగంలో విస్తరణ రేటు 2023–24లో ఉన్న 2.8 శాతం నుంచి 2024–25లో 2.7 శాతానికి తగ్గినట్టు తెలిపింది. నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విస్తరణ రేటు మాత్రం యథాతథంగా ఒక శాతం వద్దే ఉంది.

ఇదీ చదవండి: బంగారం బాటలో మరో మెటల్.. ఫుల్ డిమాండ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement