ముంబై: జీఎస్‌టీ రేట్ల సవరణ అనంతరం బీమా రంగంలో గణనీయమైన వృద్ధి కనిపిస్తున్నట్టు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) సభ్యుడు దీపక్ సూద్ అన్నారు. అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
జీఎస్‌టీని సున్నా చేయడం ద్వారా బీమా రక్షణను సైతం నిత్యావసర వస్తువు కిందకు తీసుకొచ్చినట్టు చెప్పారు. మరింత మందికి బీమాని చేరువ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు పరిశ్రమపై ఉన్నట్టు వ్యాఖ్యానించారు. జీఎస్‌టీ ప్రయోజనాన్ని పూర్థి స్థాయిలో బదిలీ చేయడం ద్వారా బీమాను మరింత అందుబాటు ధరలకే తీసుకురావాలని కోరారు. ‘‘అక్టోబర్‌లో గణాంకాలను చూస్తే లైఫ్ ఇన్సూరెన్స్, రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ గణనీయమైన వృద్ధిని చూశాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది’’అని దీపక్ సూద్ పేర్కొన్నారు.
టెక్నాలజీని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా పంపిణీ వ్యయాలు తగ్గించుకోవచ్చని, తప్పుడు మార్గంలో విక్రయాలను అరికట్టొచ్చని చెప్పారు. ‘‘బీమా ప్రీమియంను జీడీపీ నిష్పత్తితో పోల్చి విస్తరణను చూస్తుంటాం. అలా చూస్తే ప్రపంచంలో భారత్ సగటున సగంలోనే ఉంటుంది. కానీ, ఎంత మంది బీమా కవరేజీ పరిధిలో ఉన్నారన్నది చూడడం ద్వారానే మన దేశ జనాభాలో బీమా ఎంత మందికి చేరువ అయ్యిందన్నది అర్థం చేసుకోగలం’’అని చెప్పారు. ప్రకృతి విపత్తులకు సంబంధించి ప్రత్యేకమైన బీమా ఉత్పత్తులను తీసుకురావాలని పరిశ్రమను కోరారు. రాష్ట్రాల వారీ ప్రత్యేకమైన ప్లాన్లపైనా దృష్టి సారించాలని సూచించారు.


