మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎదిగిన అయతొల్లా అలీ ఖమేనీ పాలన పట్ల ఇరాన్ ప్రజలు తీ..వ్ర స్థాయిలో అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత 12 రోజులుగా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనలు.. శుక్రవారం ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలై తారాస్థాయికి చేరాయి. మిడ్డీలు, స్కర్టులు వేసుకున్న అమ్మాయిలు.. ఖమేనీ ఫొటోలను సిగరెట్లతో కాలుస్తున్న దృశ్యాలు.. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో..
డిక్టేటర్ అంతం.. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం.. ఇది చివరి పోరాటం! పహ్లవి తిరిగి వస్తాడు! అంటూ నినాదాలతో ఇరాన్ మారుమోగిపోతోంది. అసలు ఎవరీ పహ్లవి గురించి నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది. రేజా పహ్లవి(Reza Pahlavi).. ఇరాన్‌ను పాలించిన చివరి షా కుమారుడు. అమెరికాలో నివసిస్తూ ఇరాన్ ప్రజలను పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు కూడా.
👉ఇరాన్‌ను పహ్లవి రాజవంశం 1925 నుంచి 1979 వరకు పాలించింది. ఆ కాలంలో రాజులు వెస్ట్రన్ సూట్లలో కనిపిస్తూ దేశాన్ని పరిశ్రమీకరణ దిశగా నడిపించారు. మహిళలు హిజాబ్ లేకుండా, చిన్న స్కర్టులతో వీధుల్లో స్వేచ్ఛగా తిరిగేవారు. వీళ్ల పాలనలో.. టెహ్రాన్ నగరం అప్పట్లో మిడిల్ ఈస్ట్ పారిస్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ వెలుగుల వెనుక షా కఠిన పాలన, అవినీతి, పాశ్చాత్య శక్తుల ప్రభావం దాగి ఉండేది. చివరకు అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.
👉ఇరాన్‌లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, ఖమేనీ పాలనపై ప్రజల ఆగ్రహం ఉధృతమవుతోంది. ఇదే సమయంలో, గతంలో పహ్లవి రాజవంశం కాలంలో ఇరాన్ స్వేచ్ఛ, ఆధునికతతో ప్రసిద్ధి చెందిందని, కానీ కఠిన పాలన, అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.
👉పహ్లవి వంశం రాజవంశ రక్తంలో కాకుండా యుద్ధరంగంలో పుట్టింది. రేజా ఖాన్ అనే సాధారణ నేపథ్యం కలిగిన సైనిక అధికారి.. 1921లో బ్రిటిష్ అధికారుల సహకారంతో కుట్ర చేసి అధికారంలోకి వచ్చాడు. 1925లో క్వాజర్ వంశాన్ని గద్దె దించి.. మజ్లిస్ ఆయనను షాగా ఎన్నుకుంది. ఆ సమయంలో పహ్లవి అనే బిరుదు స్వీకరించి.. ఆధునికీకరణ, సెక్యులర్ జాతీయత లక్ష్యాలతో కొత్త రాజవంశాన్ని ప్రారంభించాడు.
👉పహ్లవి రాజవంశ పాలనలో.. వెస్ట్రన్ కల్చర్ మేఘాలు ఇరాన్‌ను ఆవరించాయి. హిజాబ్ నిషేధంతో.. మహిళలు పాశ్చాత్య శైలి దుస్తులకు అలవాటు పడ్డారు. సంస్కరణల పేరిట ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం, జాతీయ బ్యాంకు, రైల్వే వ్యవస్థ, కేంద్ర పాలన బలపరచడం వంటి సంస్కరణలు చేశారు. అయితే.. రాజకీయ అణచివేత, పత్రికా స్వేచ్ఛను కాలరాయడం విమర్శలకు తావిచ్చింది.

👉రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీతో ఆయన సాన్నిహిత్యం కారణంగా.. 1941లో బ్రిటిష్-సోవియట్ దళాలు ఇరాన్‌పై దాడి చేసి ఆయనను రాజీనామా చేయించాయి. ఆయన స్థానంలో కుమారుడు మొహమ్మద్ రేజా పహ్లవి షాగా అయ్యాడు. బలహీన సింహాసనం, విభజిత దేశం, పెరుగుతున్న జాతీయవాదం 22 ఏళ్ల రేజాకు వారసత్వంగా లభించాయి. అదే సమయంలో.. ఇరాన్ చమురు బ్రిటిష్ AIOC కంపెనీ ఆధీనంలో ఉండటం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. దీంతో.. 1951లో పార్లమెంట్ మొహమ్మద్ మోసాదేఘ్‌ను ప్రధానిగా ఎన్నుకుంది. ఆయన చమురు పరిశ్రమను జాతీయికరణ చేయడంతో బ్రిటన్, అమెరికా ఆగ్రహించాయి. 1953లో CIA “ఆపరేషన్ అజాక్స్” ద్వారా మోసాదేఘ్‌ను గద్దె దించి, పహ్లవిని తిరిగి సంపూర్ణ అధికారంతో షాగా తిరిగి కూర్చోబెట్టింది. ఇది పహ్లవి సంపూర్ణ రాజ్యాధికారానికి, అమెరికా ప్రభావానికి ఆరంభంగా నిలిచింది.
👉1960లో.. మొహమ్మద్ రేజా షా వైట్ రివల్యూషన్ పేరుతో సంస్కరణలు చేపట్టాడు, భూసంస్కరణలు (జమీందారుల శక్తి తగ్గించడం), మహిళలకు ఓటు హక్కు, గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత, ఆరోగ్య కార్యక్రమాలు, పారిశ్రామికరణ, సైన్యం బలోపేతం చేయడంలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఫలితంగా ఇరాన్‌లో ఆర్థిక వృద్ధి, పట్టణీకరణ, మధ్యతరగతి పెరుగుదల చోటు చేసుకున్నాయి.
👉పాశ్చాత్య సంస్కృతి (ఫ్యాషన్, సినిమాలు) వేగంగా వ్యాపించినప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితుల ఏర్పడడాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వచ్చినవారు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడ్డారు. రాజకీయ పార్టీలను నిషేధించారు. సావక్ SAVAK అనే షా రహస్య పోలీస్.. విపక్షాన్ని అణచివేసింది.
ఆ సమయంలో మతాధికారి అయతొల్లా రుహొల్లా ఖోమేనీ 1964లో షా పాశ్చాత్యీకరణను విమర్శించి ప్రవాసంలోకి వెళ్లాడు.
👉ఈలోపు.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అసమానతలు, అధికారవాద పాలన, అన్ని కలగలిపి 1978లో భారీ నిరసనలకు దారితీశాయి. శక్తివంతమైన సైన్యం ఉన్నప్పటికీ, షా పూర్తి బలప్రయోగం చేయడానికి వెనుకాడాడు. 1979 జనవరిలో షా దేశం విడిచి పారిపోయాడు. ఇదే అదనుగా ఫిబ్రవరి 1న ఖోమేనీ ప్రవాసం వీడాడు. ఇరాన్ ప్రజలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కొన్ని వారాల్లోనే పహ్లవి రాజవంశం కూలిపోయి, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారింది. మొహమ్మద్ రేజా షా 1980లో ఈజిప్టులో ప్రవాసంలో ఉండగానే మరణించాడు. రేజా పహ్లవి ఈ విప్లవం తర్వాత అమెరికాలో స్థిరపడి.. ఇరాన్‌లో ప్రజాస్వామ్య మార్పు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాడు.
👉షా యొక్క అధికారవాద పాలనను మరిచిపోయిన ఇరానీయులు, ముఖ్యంగా ఆ పరిస్థితుల రుచేంటో చూడని యువత.. పహ్లవి కాలాన్ని స్వేచ్ఛలు, ఆర్థిక సౌభాగ్యం, అంతర్జాతీయ ప్రతిష్ఠ కారణంగా గర్వంగా పీలవుతోంది. అదే సమయంలో ప్రవాసంలో ఉన్న షా కుమారుడు రేజా పహ్లవి మళ్లీ ఖమేనీ ఆధ్వర్యంలోని ధార్మిక పాలనకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఎదిగాడు.
👉1979 విప్లవం సమయంలో రేజా పహ్లవి వయసు కేవలం 18. పాశ్చాత్య దేశాల్లో చదువుకున్న ఆయన.. ఇరాన్‌లో సెక్యులర్ ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పిలుపు తర్వాత ఇరాన్‌లో ఖమేనీ వ్యతిరేక నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో.. ఇరాన్ ప్రజలు మళ్లీ క్రౌన్ ప్రిన్స్ వైపు మొగ్గుచూపుతారనే సంకేతాలు అందుతున్నాయి.

👉ప్రవాసంలో ఉన్న ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రేజా పహ్లవి వచ్చే వారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మార్-ఎ-లాగోలో జరగనున్న Jerusalem Prayer Breakfast కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం జనవరి 12న జరగనుంది. లాత్వియా పార్లమెంట్ ప్రతినిధులు, బ్రెజిల్ ఎంపీ ఎడ్వార్డో బోల్సోనారో కూడా పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ దశలో పహ్లవిని కలవడం సరైనది కాదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అలాగే పహ్లవి తనను రాజ్యాధికారంలో కాకుండా రాజ్యాంగ పరిరక్షణలో ఉండే రాజవంశానికి మద్దతుదారుడిగా పేర్కొన్నారు.
“మిలియన్ల ఇరానీయులు స్వేచ్ఛ కోరుతున్నారు, కానీ ప్రభుత్వం అన్ని కమ్యూనికేషన్ లైన్లను కట్ చేసింది”..
:::ఖమేనీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ పహ్లవి ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్
రేజా పహ్లవి ప్రొఫైల్
- రేజా పహ్లవి (జననం అక్టోబర్ 1960) ఇరాన్ చివరి షా మొహమ్మద్ రేజా పహ్లవి పెద్ద కొడుకు
- 1979 ఇరాన్ విప్లవంలో రాజ్యాన్ని గద్దె దింపిన తర్వాత ఆయన కుటుంబం ప్రవాసంలోకి వెళ్లింది.
- రేజా పహ్లవి అమెరికాలో పైలట్ శిక్షణ పొందారు, తరువాత USCలో రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.
- ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఫైటర్ పైలట్‌గా సేవ చేయాలని ప్రయత్నించినా, ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం ఆయనను తిరస్కరించింది.
అధికారం వద్దంటూనే,.
- ఆయన తనను “ప్రజాస్వామ్యానికి మార్పు కోసం జాతీయ మార్గదర్శి”గా పేర్కొంటున్నారు.
- ఇరాన్‌లో జరుగుతున్న నిరసనల్లో ప్రజలు “పహ్లవి తిరిగి వస్తాడు”, “ఖమేనీ గద్దె దింపబడతాడు” అంటూ నినాదాలు చేస్తున్నారు.
- ఆయన నాలుగు దశాబ్దాలుగా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం పోరాడుతున్నారని మద్దతుదారులు చెబుతున్నారు.
- ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాధినేతలు, పార్లమెంట్ సభ్యులు, విద్యార్థి సంఘాలతో సమావేశమై ఇరాన్ ప్రజల పరిస్థితిని వివరించారు.
- ఆయన Washington Postలో రాసిన వ్యాసంలో, ఇస్లామిక్ రిపబ్లిక్ “1979 తర్వాత ఎప్పుడూ లేనంత బలహీనంగా, విభజితంగా ఉంది” అని పేర్కొన్నారు.
- “నేను అధికారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేను, కానీ ప్రజాస్వామ్య మార్పు కోసం మార్గదర్శకుడిగా బాధ్యత వహిస్తాను” అని ఆయన అన్నారు.
- ఆయన US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ధన్యవాదాలు తెలుపుతూ, “ప్రపంచ స్వేచ్ఛా నాయకుడు”గా అభివర్ణించారు.
- అయితే ట్రంప్, “ఇప్పుడే ఆయనను కలవడం సరైనది కాదు” అని వ్యాఖ్యానించారు.
- 2023లో ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహును కలవడం వివాదాస్పదమైంది.


