ఎడాపెడా గ్రోక్‌ను వాడేస్తున్న యూజర్లకు ఎక్స్ పెద్ద షాకే ఇచ్చింది. బూతు కంటెంట్ వివాదం నేపథ్యంలో గ్రోక్ చాట్‌బాట్‌పై పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై కేవలం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
ఎక్స్ ఫ్లాట్‌ఫారమ్‌లో(పూర్వపు ట్విటర్)లో ‘గ్రోక్’ కృత్రిమ మేధ చాట్‌బాట్ వినోదం కోసం తీసుకొచ్చారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సమాచారం అందజేయడం.. తొలినాళ్లలో నవ్వులు పూయిచింది ఇది. అయితే రాను రాను గ్రోక్ వికృత రూపం దాల్చింది.
గ్రోక్‌లో అశ్లీల, అసభ్యకర, అభ్యంతరకర దృశ్యాల రూపకల్పనకు దుర్వినియోగం అవుతుండటంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రముఖులతో పాటు సాధారణ ప్రజల ఫొటోలను అశ్లీల, అసంబద్ధ ప్రాంప్ట్‌లతో ఎడిట్‌లు చేస్తున్నారు పలువురు యూజర్లు. అటు గ్రోక్ కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది.
ఈ అంశంపై పలు దేశాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇటు భారత ప్రభుత్వం సైతం సీరియస్ అయ్యింది. వివరణ కోరుతూ ఎక్స్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిన నేపథ్యంలో ఎక్స్ చర్యలు చేపట్టింది. ఈ చాట్‌బాట్‌లోని ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌పై పరిమితులు విధించింది. అయితే..
గ్రోక్ (Grok) అనేది xAI రూపొందించిన AI అసిస్టెంట్. ఇది 2023 చివర్లో మొదటి వెర్షన్‌గా వచ్చింది. అప్పటి నుంచి పలు అప్‌డేట్లు, కొత్త వెర్షన్లు విడుదలయ్యాయి. 2025 చివర్లో Grok 4.1 Thinking విడుదల కాగా, 2026 జనవరి నాటికి Grok ఇప్పటికే X ప్లాట్‌ఫారమ్‌లో భాగమైంది.
తీవ్ర విమర్శల వేళ ఇకపై Grok (గ్రోక్) చాట్‌బాట్ ఫీచర్ Xలో కేవలం సబ్‌స్క్రైబర్లకే అందుబాటులో ఉండనుంది. ఫ్రీ యూజర్లకు యాక్సెస్ నిలిపివేయడం మొదలుపెట్టింది. గ్రోక్‌ను ఉపయోగించాలంటే ఎక్స్ ప్రీమియం X Premium లేదా ప్రీమియం ఫ్లస్ Premium+ ప్లాన్ తీసుకోవాలి. ప్రీమియం ప్లాన్ ధర నెలకు రూ.650 ( 8 డాలర్లు), ప్రీమియం ఫస్ల్ ధర నెలకు రూ.1,300 (16 డాలర్లు)గా ఉంది. సంవత్సరం ప్లాన్ ప్రీమియం ధర రూ.6,800, ప్రీమియమ్ ఫ్లస్ ప్లాన్ ధర రూ.13,600గా ఉంది. అయితే ప్రీమియం వెర్షన్‌లో అందుబాటులో ఉండడమూ ఆందోళన కలిగించే అంశమే కదా అని అంటున్నారు పలువురు.


