గ్రోక్ ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్‌పై కొత్త నియమాలపై ప్రముఖ బిలీయనీర్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వివరణతో మరింత వివాదం రాజుకుంది. నిజమైన మనుషుల ఫొటోలను అశ్లీలంగా ఎడిట్‌లు చేయకుండా నిషేధం విధించినప్పటికీ.. వేర్వేరు ప్రాంప్ట్స్‌తో ఆ తరహా ఫొటోలు జనరేట్ చేస్తున్నారు కొందరు. అయితే.. దానిని అడ్డుకోవడం సాధ్యం కాకపోవచ్చన్న రీతిలో ఆయన మాట్లాడారు.
రియల్ వ్యక్తులపై అనుమతి లేకుండా రూపొందించిన సెక్సువల్ డీప్‌ఫేక్‌లు తీవ్ర విమర్శలకు గురైన నేపథ్యంలో ఎక్స్ గ్రోక్ చర్యలు తీసుకుంది. దాని వల్ల గ్రోక్ ద్వారా నిజమైన వ్యక్తులను బికినీ లేదంటే ఇతర సెక్సువలైజ్డ్ దుస్తుల్లో చూపించే ఎడిట్స్ చేయడం కుదరదు. అయితే, AI ఆధారిత కల్పిత పాత్రలు లేదంటే ఊహాజనిత వ్యక్తులపై ఇలాంటి కంటెంట్ సృష్టించడం మాత్రం ఇంకా అనుమతించబడుతోంది.
ఈ నిర్ణయంపై ఎలాన్ మస్క్ స్వయంగా స్పందించారు. ‘‘అమెరికాలోని “de facto standard” ప్రకారం.. NSFW (Not Safe For Work) మోడ్ ఆన్ చేసినప్పుడు గ్రోక్ ఊహాజనిత పెద్దవారి పాత్రలపై R-rated సినిమాల్లో కనిపించే స్థాయి వరకు ఎడిట్స్ అనుమతించాలి. అయితే, నిజమైన వ్యక్తులపై మాత్రం ఇది వర్తించదు అని ఉద్ఘాటించారు. అయితే..
ఈ మార్పులు వచ్చినప్పటికీ ఇంకా గ్రోక్ ద్వారా సెక్సువలైజ్డ్ ఇమేజ్‌లు సృష్టించడం సాధ్యమవుతోందని The Verge లాంటి పత్రికలు కథనాలు ఇస్తున్నాయి. “put her in a bikini” లేదంటే “remove her clothes” వంటి డైరెక్ట్ ప్రాంప్ట్స్ పని చేయకపోయినా.. ప్రత్యామ్నాయ అశ్లీల ప్రాంప్ట్‌లు కొన్ని పనిచేస్తున్నాయి. దీంతో, విధానం కఠినంగా ఉన్నప్పటికీ, అమలు మాత్రం లేదని ఆ కథనం పేర్కొంది. వీటికి తోడు..
గ్రోక్ ద్వారా అదనంగా వయసు ధృవీకరణ పాప్‌అప్ ఉన్నప్పటికీ.. కేవలం పుట్టిన సంవత్సరం ఎంచుకోవడం ద్వారా దాన్ని తప్పించుకోవచ్చు. ఎటువంటి ఆధారాలు చూపాల్సిన అవసరం లేకపోవడం వల్ల 18 ఏళ్ల లోపు వినియోగదారులు కూడా సులభంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. అదే సమయంలో పురుషుడి సెల్ఫీని సెక్సువలైజ్డ్ ఇమేజ్‌గా మార్చిన సందర్భం కూడా రిపోర్ట్ అయింది. అయితే..
ఈ లోపాలను కూడా ఎక్స్,గ్రోక్ సమర్థించుకుంటున్నాయి. వినియోగదారుల ప్రాంప్ట్స్ విధానం తప్పుగా ఉపయోగించడం, హ్యాకింగ్ తరహా మార్పుల కారణంగానే ఈ లోపాలు వస్తున్నాయని చెబుతోంది. దీంతో ఈ సమర్థనపై కరెక్ట్ కాదు బాస్ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


