కరీబియన్ జలాల్లో పట్టుకున్న అమెరికా
వాషింగ్టన్: వెనెజువెలాకు రాకపోకలు సాగిస్తున్న చమురు నౌకలను అదుపులోకి తీసుకునే ధోరణిని అమెరికా కొనసాగిస్తూనే ఉంది. ఆ దేశానికి చెందినదిగా భావిస్తున్న ఒలీనా అనే మరో నౌకను దిగ్బంధించినట్టు అమెరికా సైన్యం శుక్రవారం వెల్లడించింది. కరీబియన్ సముద్ర జలాల్లో శుక్రవారం తెల్లవారుజామున యూఎస్ మెరీన్స్, నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు తెలిపింది.
దీన్ని హోంలాండ్ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షించినట్టు వెల్లడించింది. అమెరికా సైనిక హెలికాప్టర్ ఆ నౌకపై దిగుతున్న, సైనిక సిబ్బంది డెక్‌పై సోదాలు సాగిస్తున్న ఫుటేజీని యూఎస్ సదరన్ కమాండ్ విడుదల చేసింది. వెనెజువెలాకు చెందినవంటూ అమెరికా అదుపులోకి తీసుకున్న ఐదో నౌక ఇది. గత మూడు రోజుల్లో మూడో నౌక. అయితే ఇది నిజంగా ఆ దేశానిదేనా అన్న ప్రశ్నలకు సైనిక అధికార ప్రతినిధి నేరుగా బదులివ్వలేదు.


