కొరికే చలి.. విషపు గాలి మధ్య గణతంత్ర రిహార్సల్స్ | Republic Day Rehearsals Continued At India Gate In Delhi Amid Cold Wave And Improving Air Quality | Sakshi
Sakshi News home page

కొరికే చలి.. విషపు గాలి మధ్య గణతంత్ర రిహార్సల్స్

Jan 3 2026 9:53 AM | Updated on Jan 3 2026 10:14 AM

Republic Day rehearsals continued at India Gate

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని గత కొన్ని రోజులుగా విపరీతమైన చలి, వాయు కాలుష్యం కమ్మేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనూ.. జనవరి 26న జరగబోయే గణతంత్ర వేడుకలకు సంబంధించిన రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. గతంలో ‘అత్యంత దారుణమైన’ కేటగిరీలో ఉన్న గాలి నాణ్యత, శనివారం నాటికి ‘సాధారణం కంటే తక్కువ’ (Poor) స్థాయికి చేరుకుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీబీసీబీ)గణాంకాల ప్రకారం, శనివారం ఉదయం నగర సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 222గా నమోదైంది.

ఢిల్లీ మహా నగరంలోని ప్రధాన ప్రాంతాలైన ఆనంద్ విహార్ (248), ఆర్.కె పురం (252), రోహిణి (270), చాందినీ చౌక్ (272)లలో కాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టగా, ఇందిరా గాంధీ విమానాశ్రయం (148), బవానా (145) తదిరత ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత మెరుగ్గా ఉండటం గమనార్హం. ఒకవైపు కాలుష్యం తగ్గుతున్నా, శీతాకాలం కావడంతో ఢిల్లీని దట్టమైన  పొగమంచు కమ్మేసింది. శనివారం ఉదయం ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవడంతో నగరవాసులు గజగజ వణికిపోయారు.
 

ఇలాంటి ప్రతికూల వాతావరణంలోనూ ఇండియా గేట్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్ అత్యంత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. భద్రతా సిబ్బంది, పరేడ్ బృందాలు దట్టమైన మంచులోనూ తమ సన్నాహాలను ఏమాత్రం ఆపకుండా ముందుకు  కొనసాగుతున్నారు. రానున్న రోజుల్లో వాతావరణం మరింత మెరుగుపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది.

కాగా గాలి నాణ్యత మెరుగుపడటంతో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో అమల్లో ఉన్న 'గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్' (జీఆర్‌ఏపీ)మూడవ దశ ఆంక్షలను శుక్రవారం సాయంత్రం నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో భవన నిర్మాణ, కూల్చివేత పనులకు కొంతమేరకు ఊరట లభించింది. అయితే గతంలో ఈ నిబంధనల ఉల్లంఘన కారణంగా మూసివేత ఉత్తర్వులు  అందుకున్న ప్రాజెక్టులు మాత్రం కమిషన్ అనుమతి లేకుండా పనులు ప్రారంభించకూడదని అధికారులు స్పష్టం చేశారు.

వాయు నాణ్యత సూచీ మళ్లీ పడిపోకుండా ఉండేందుకు ప్రజలు ‘సిటిజన్ చార్టర్’ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం కోరింది. పొరుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులు,  గాలి వేగంపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నామని, ఐఐటీఎం (ఐఐటీఎం), ఐఎండీ నివేదికల ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని సబ్ కమిటీ వెల్లడించింది. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 15° సెంటీగ్రేడ్‌ నుండి 17°సెంటీగ్రేడ్‌ వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 8°సెంటీగ్రేడ్‌ నుండి 9°సెంటీగ్రేడ్‌ వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీపై ప్రశాంత్‌ కిశోర్‌ కుట్ర?.. యువకుడు అరెస్ట్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement