గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. ధర్మేంద్రను పద్మ విభూషణ్, మమ్ముట్టి, అల్కా యాగ్నిక్‌లను పద్మ భూషణ్, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, మాధవన్‌లను పద్మశ్రీ అవార్డులు వరించాయి.
ఆల్ రౌండర్
పంజాబ్‌లోని ఫాగ్వారా గ్రామం నుంచి ముంబై నగరానికి చేరుకుని సినీ రంగంలో ‘స్టార్’గా ఎదిగిన ఘనత ధర్మేంద్ర సొంతం. ఆరు దశాబ్దాలకు పైగా చేసిన చిత్రాలతో ‘రొమాంటిక్ హీరోగా, యాక్షన్ హీరోగా’ ప్రశంసలు పొంది, ‘హీ మ్యాన్’గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ధర్మేంద్ర. 2012లో కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్రను ‘పద్మ భూషణ్’ పురస్కారంతో సత్కరించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను తాజాగా ‘పద్మ విభూషణ్’ (మరణానంతరం) ప్రకటించింది.
నాటకాల నుంచి సినిమాల వరకూ...
ధర్మేంద్ర అసలు పేరు ధర్మేంద్ర కెవల్ క్రిషన్ డియోల్. 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లోని ఫాగ్వారాలో ఆయన జన్మించారు. ధర్మేంద్ర తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో తనయుడు ప్రోఫెసర్ కావాలని కోరుకున్నారు. అయితే ధర్మేంద్ర మెరిట్ స్టూడెంట్ కాదు. పైగా నాటకాలంటే ఇష్టం. స్కూల్ డేస్‌లో నాటకాల్లో నటించారు. నటనపై ఉన్న ఇష్టం సినిమాల వరకూ వచ్చేలా చేసింది. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఫిల్మ్‌ఫేర్ మేగజీన్ నిర్వహించిన కార్యక్రమంలో విజేతగా నిలిచి, ముంబై చేరుకున్నారు ధర్మేంద్ర. అప్పటికే ఆయనకు ప్రకాశ్ కౌర్‌తో వివాహం (1954) జరిగింది. వారికి కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, కుమార్తెలు విజిత, అజిత ఉన్నారు
రెండో సినిమాతో తొలి విజయం
‘దిల్ బీ తేరా హమ్ బీ తేరే’ (1960) సినిమాతో బాలీవుడ్‌లో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు ధర్మేంద్ర. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో పాటు ధర్మేంద్రకు గుర్తింపు తెచ్చిపట్టలేదు. ఆ తర్వాత చేసిన ‘షోలా ఔర్ షబ్నమ్’తో తొలి విజయం అందుకున్నారు. వరుసగా ‘అన్‌పద్, బందినీ’ (ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సాధించింది) వంటి చిత్రాల్లో నటించారు. ‘ఆయీ మిలన్ కీ బేలా’ (1964) చిత్రంతో బాగా పాపులర్ అయ్యారు. ఈ చిత్రంలో ధర్మేంద్ర నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేశారు. అదే ఏడాది ఆయన లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘హకీకత్’. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చైనా–ఇండియా యుద్ధం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. 1965లో చేసిన రొమాంటిక్ చిత్రం ‘కాజల్’తో మరో భారీ విజయాన్ని అందుకున్నారు ధర్మేంద్ర. ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేనంతగా బిజీ అయ్యారు.
సేలబుల్ స్టార్‌గా... ధర్మేంద్రకు సేలబుల్ స్టార్ అని పేరు తెచ్చిన చిత్రం ‘ఫూల్ ఔర్ పత్తర్’. 1966లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నమోదు అయింది. అదే ఏడాది చేసిన ‘మమత, దేవర్, అనుపమ, ఆయే దిన్ బహర్ కే’ చిత్రాలు ఆ విజయాన్ని కొనసాగించాయి. ‘మేరా గావ్ మేరా దేశ్’ (1971)తో తనలో మంచి యాక్షన్ హీరో ఉన్నాడని నిరూపించుకున్న ధర్మేంద్రకు, ‘రాజా జానీ’ (1972), ‘జుగ్ను’ (1973) వంటి చిత్రాలు ఆ ఇమేజ్‌ని బలపరిచాయి. అయితే అంతకు ముందు చేసిన ప్యార్ హి ΄్యార్’ (1966), ‘ఆయా సావన్ ఝూమ్ కే’ (1969), ‘మేరే హమ్‌దమ్ మేరే దోస్త్’ (1968)... వంటి చిత్రాలతో ధర్మేంద్ర రొమాంటిక్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ధర్మేంద్ర కెరీర్‌లో ‘షోలో’ (1975) చిత్రం కీలకం. అమితాబ్ బచ్చన్ కాంబినేషన్‌లో చేసిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
తెరవెనకా హిట్ పెయిర్: అప్పట్లో బాలీవుడ్‌లో హిట్ పెయిర్ అనిపించుకున్నవారిలో ధర్మేంద్ర–హేమ మాలిని’లది ప్రత్యేకమైన స్థానం. 1970లలో ఈ ఇద్దరూ ‘తుమ్ హసీన్ మే జవాన్, షరాఫత్, సీతా ఔర్ గీతా, రాజా జానీ, జుగ్ను, ప్రతిజ్ఞ, షోలే, చరస్, ఆజాద్’ వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇలా తెరపై హిట్ జోడీ అనిపించుకున్న ఈ ఇద్దరూ తెరవెనకా హిట్ పెయిర్. డ్రీమ్ గర్ల్ అనిపించుకున్న హేమ మాలిని, హీ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న ధర్మేంద్ర వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. 1980లో వివాహం చేసుకుని రియల్ లైఫ్ జోడీగా మారారు. వీరికి కుమార్తెలు ఈషా డియోల్, అహనా డియోల్ ఉన్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా... ఒకవైపు భారీ మాస్ కమర్షియల్ మూవీ ‘షోలే’లో నటించిన ధర్మేంద్ర మరోవైపు ‘సత్యకామ్’వంటి ఆఫ్‌బీట్ చిత్రాలకు జీవం పోశారు. కామెడీ పాత్రల నుంచి యాక్షన్ పాత్రల వరకు... ‘చుప్కే చుప్కే’లోని హాస్య పాత్ర నుంచి ‘ఫూల్ ఔర్ పత్తర్’లోని యాక్షన్ హీరో ఇమేజ్ వరకు ఆయన ‘ఆల్ రౌండర్’ అనిపించుకున్నారు. 1973లో ఎనిమిది హిట్స్, 1987లో వరుసగా ఏడు హిట్స్‌తో పాటు అదే ఏడాది తొమ్మిది విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఘనత ఆయన సొంతం చేసుకున్నారు. 1983లో విజయా ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, తన పెద్ద కుమారుడు సన్నీ డియోల్ హీరోగా ‘ఘాయల్’ వంటి సూపర్‌హిట్ మూవీని నిర్మించారు.. తన కుమారులు బాబీ డియోల్, సన్నీ డియోల్‌లతో కలిసి ‘అప్నే, యమాల పగ్లా దీవానా’ వంటి సినిమాల్లో నటించారు ధర్మేంద్ర. 1995 తర్వాత ధర్మేంద్ర క్యారెక్టర్ నటుడిగా మారారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ధర్మేంద్ర నటించిన ఆఖరి చిత్రం ‘ఇక్కీస్’ (2025).
రాజకీయాల్లోనూ... భారతీయ జనతా పార్టీ 2004లో చేపట్టిన ‘షైనింగ్ ఇండియా’ ప్రచారం ధర్మేంద్రను బాగా ప్రభావితం చేసింది. ధర్మేంద్రని రాజస్థాన్ లోని బికనీర్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టింది బీజేపీ. కాంగ్రెస్ అభ్యర్థి రామేశ్వర్ లాల్ దూడీని దాదాపు 60 వేల ఓట్ల తేడాతో ఓడించి, ఎంపీగా ఘనవిజయం సాధించారు ధర్మేంద్ర. నటుడిగా ఎన్నో విజయాలు చవిచూసిన ధర్మేంద్ర రాజకీయాల్లోనూ సక్సెస్. 2004 నుండి 2009 వరకు ఆయన బికనీర్‌కి ప్రాతినిధ్యం వహించారు. 2009లో తన పదవీకాలం ముగిసిన అనంతరం ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
2012లో పద్మభూషణ్: 1991లో ‘ఘాయల్’ సినిమాకుగానూ ధర్మేంద్ర నిర్మాతగా జాతీయ అవార్డు అందుకున్నారు. కళామతల్లికి ధర్మేంద్ర చేసిన సేవలకుగానూ 2012లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు పద్మ విభూషణ్ ప్రకటించింది.
ఎవర్‌గ్రీన్
డిఫరెంట్ జానర్స్‌లో నటించిన విలక్షణమైన నటుడు మమ్ముట్టి. ఏడు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ. అందుకే మమ్ముట్టి ఎవర్‌గ్రీన్ స్టార్. సినీ పరిశ్రమకు మమ్ముట్టి చేసిన సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్ అవార్డు వరించింది. మమ్ముట్టి పూర్తి పేరు ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్. ఇస్మాయిల్, ఫాతిమా దంపతులకు 1951 సెప్టెంబర్ 7న కేరళలోని అలప్పుళ జిల్లా చండీరూర్‌లో ఆయన జన్మించారు. పెరిగింది మాత్రం కేరళలోని కొట్టాయం జిల్లాలో. మమ్ముట్టిది మధ్యతరగతి ముస్లిం కుటుంబం. ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. ఎర్నాకులంలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పట్టా పొందారు మమ్ముట్టి. ఆ తర్వాత రెండేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. మరోవైపు సినిమాల్లో నటించే ప్రయత్నాలు చేశారు.
చిన్న రోల్స్‌తో ప్రారంభం: 1971లో ’అనుభవంగళ్ పాలిచకల్’ చిత్రంలో ఓ చిన్న పాత్రతో నటన ప్రారంభించారు మమ్ముట్టి. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చారు. వాసుదేవ్ నాయర్ తన డైరెక్షన్‌లోని ‘విల్కన్ ఉండూ స్వప్నంగళ్’లో మమ్ముట్టిని మెయిన్ లీడ్‌గా ఎంచుకున్నారు. ఈ చిత్రంతో మమ్ముట్టికి మంచి గుర్తింపు లభించింది. 1971– 1982 మధ్యకాలంలో మమ్ముట్టి ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్, కీలక పాత్రల్లో నటించారు. త్రిష్ణ (1981), అహింస (1981) చిత్రాల్లో లీడ్ రోల్స్ చేశారు.
ఏడాదికి ఇరవైకి పైగా చిత్రాలు..
జోషియ్ డైరెక్షన్‌లో 1987లో వచ్చిన ‘న్యూ ఢిల్లీ’ సినిమా మమ్ముట్టి కెరీర్‌లో ఓ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పౌరాణిక చిత్రం ‘ఒరు వడక్కన్ వీరగాథ’ చిత్రంతో మమ్ముట్టికి తొలి జాతీయ అవార్డు వచ్చింది. ఏడు పదుల వయసులో ‘కన్నూర్ స్వా్కడ్’, ‘భ్రమయుగం’, ‘టర్బో’, ‘కలంకావల్’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ‘భ్రమయుగం’, ‘కలంకావల్’ చిత్రాల్లో మమ్ముట్టి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేయడం విశేషం.
తెలుగు ప్రేక్షకులు మెచ్చిన హీరో
ఇక టాలీవుడ్‌తో మమ్ముట్టికి ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పవచ్చు. కె. విశ్వనాథ్ డైరెక్షన్‌లో మమ్ముట్టి నటించిన ‘స్వాతి కిరణం’ సినిమా 1992లో విడుదలై, ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా రూపొందిన ‘యాత్ర’ (2019) సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో రాజశేఖర రెడ్డి పాత్రలో నటించారు మమ్ముట్టి.
అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ‘యాత్ర 2’ చిత్రంలోనూ మమ్ముట్టి నటించారు. 2024 ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ రెండు చిత్రాలకూ (యాత్ర, యాత్ర 2) మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. గతంలో కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ‘రైల్వే కూలి’ (2001) చిత్రంలో మమ్ముట్టి హీరోగా నటించారు. హిందీ హిట్ ఫిల్మ్ ‘దివార్’కు ఇది రీమేక్‌గా రూపొందింది.
తండ్రికి తగ్గ తనయుడిగా...
1979లో సుల్ఫత్‌ను వివాహం చేసుకున్నారు మమ్ముట్టి. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ దంపతులకు కుమార్తె సురుమి, కుమారుడు దుల్కర్ సల్మాన్ ఉన్నారు. నటుడిగా–నిర్మాతగా దుల్కర్ సల్మాన్ తండ్రికి తగ్గ తనయుడిగా దుల్కర్ దూసుకెళుతున్నారు. ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్, కాంత’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు దుల్కర్.
పలు అవార్డులు..
మమ్ముట్టికి మూడు జాతీయ అవార్డులు (ఒరు వడక్కన్ వీరగాథ, పొంతన్ మదా అండ్ విధేయన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాలకుగాను) సాధించారు. 1998లో ఆయన్ను పద్మశ్రీ అవార్డు వరించగా, ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డు దక్కింది.
మధుర గానం
సంగీత ప్రపంచంలో తన మధుర గాత్రంతో శ్రోతలను మైమరిపిస్తున్న ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్‌ను పద్మభూషణ్ అవార్డు వరించింది. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైన కెరీర్‌లో నేపథ్య గాయనిగా తనదైన ముద్ర వేశారు. హిందీ, గుజరాతీ, ఒరిస్సా, మణిపురి, నేపాలీ, రాజస్థానీ... ఇలా దాదాపు పాతిక భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో పాడారు. సంగీత ప్రపంచానికి యాగ్నిక్ చేస్తున్న సేవలను గుర్తించి, కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది.
ధర్మేంద్ర శంకర్, శుభా దంపతులకు 1966 మార్చి 20న కోల్‌కతాలో అల్కా యాగ్నిక్ జన్మించారు. అల్కా యాగ్నిక్ తల్లి శుభా భారతీయ శాస్త్రీయ సంగీత గాయకురాలు. అలా తల్లి బాటలోనే అల్కా నడిచారు. తన ఆరో సంవత్సరంలోనే ఆమె కోల్‌కతాలోని ఆల్ ఇండియా రేడియో కోసం పాట పాడారు. పదేళ్ల వయసులో అల్కా యాగ్నిక్ ముంబైలో అడుగు పెట్టారు. ఆ సమయంలో కోల్‌కతాలోని ఓ సినిమా డిస్ట్రిబ్యూటర్ యాగ్నిక్ గురించి రాజ్ కపూర్‌కు ఓ లేఖ రాయగా, రాజ్ కపూర్ ఆమె స్వరం విని, మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మీకాంత్‌కు లేఖ రాశారట. అలా లక్ష్మీకాంత్ ఆమెకు వరుస అవకాశాలు కల్పించడంతో యాగ్నిక్ తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇక ఆమిర్ ఖాన్ నటించిన ‘హమ్ హై రహీ ΄్యార్ కే’ సినిమాలోని ‘ఘూంఘట్ కి ఆద్ సే’, షారుక్ ఖాన్ నటించిన ‘కుచ్ కుచ్ హోతా హై’ చిత్రంలోని ‘కుచ్ కుచ్ హోతా హై’ పాటలకుగాను యాగ్నిక్‌ను జాతీయ అవార్డులు వరించాయి.
హిందీ చిత్రపరిశ్రమలో ప్రఖ్యాత గాయణీమణులు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేల తర్వాత ఎక్కువ పాటలు పాడిన మహిళా గాయనిగా అల్కా యాగ్నిక్ పేరును ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అలాగే ‘రైజింగ్ స్టార్, సూపర్‌స్టార్ సింగర్, ఇండియన్ ఐడల్’ టీవీ రియాలిటీ షోలకు అల్కా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. షిల్లాంగ్‌కు చెందిన వ్యాపారవేత్త నీరజ్ కపూర్‌ను 1989లో వివాహం చేసుకున్నారామె. ఈ దంపతులకు సాయేషా అనే కుమార్తె ఉన్నారు. గాయనిగా పలు అవార్డులు పొందిన అల్కా యాగ్నిక్ మధుర స్వరానికి ‘పద్మ భూషణం’ ఓ ఆభరణం.
ఏ పాత్ర అయినా ఓకే
హీరోగా కెరీర్ ఆరంభించి, ఆ తర్వాత క్యారెక్టర్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీమోహన్ నిర్మాతగా కూడా సక్సెస్‌ఫుల్. 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు పొందిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 1940 జూన్ 24 పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రు గ్రామంలో జన్మించారు మురళీమోహన్. అసలు పేరు మాగంటి రాజబాబు. మురళీమోహన్ విద్యాభ్యాసం ఏలూరులో గడిచింది. ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో డిగ్రీ విద్యాభ్యాసం చేశారు. 1963లో ఎలక్ట్రికల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ఆరంభించారు. వ్యాపారం చేస్తూనే నాటకాల్లో నటించేవారు. అలాగే వ్యాపారంలో భాగంగా మదరాసు (చెన్నై) వెళ్లేవారు.
‘జగమే మాయ’తో... అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించాలనుకున్న ‘జగమే మాయ’ (1973)లో నటించే అవకాశం మురళీమోహన్‌కి దక్కింది. ఆ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశారు. 1974లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో నటించిన ‘తిరుపతి సినిమాతో మురళీమోహన్‌కి గుర్తింపు వచ్చింది. ఒకవైపు హీరోగా నటిస్తూనే... మరోవైపు ఏ పాత్ర వస్తే అది కాదనుకుండా చేశారు మురళీమోహన్.
‘పొట్టేలు పున్నమ్మ’తో భారీ విజయం: హీరోగా మురళీమోహన్ కెరీర్‌లో భారీ విజయవంతమైన చిత్రం ‘పొట్టేలు పున్నమ్మ’. 1978లో విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రంగా నమోదు అయింది. 50 ఏళ్ల కెరీర్ దాదాపు 350 చిత్రాల్లో నటించారు.
నిర్మాతగా జయభేరి: మురళీమోహన్ తన సోదరుడు కిశోర్‌తో కలిసి ‘జయభేరి ఆర్ట్స్’ని ఆరంభించారు. ఈ బేనర్‌పై రూపొందిన తొలి చిత్రం ‘రామదండు’ (1981). ఈ చిత్రంలో మురళీమోహన్ హీరోగా నటించారు. అదే ఏడాది ఈ సంస్థ నిర్మించిన ‘వారలబ్బాయ్’లోనూ హీరోగా నటించారు. నటుడిగా ఇది మురళీమోహన్‌కు నూరవ చిత్రం. జయభేరి ఆర్ట్స్‌పై రూపొందిన చిత్రాల్లో మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘అతడు’ (2005) ఒకటి. ఈ నిర్మాణ సంస్థలో దాదాపు 25 చిత్రాలు వచ్చాయి.
పలు బాధ్యతలతో... నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తించారు మురళీమోహన్. 2015 వరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు గౌరవాధ్యక్షునిగా చేశారు.
రాజకీయ రంగంలో... 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ 2014లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. మురళీమోహన్‌కు భార్య విజయలక్ష్మి, కుమార్తె మధు బిందు, కుమారుడు రామ్మోహన్ ఉన్నారు. ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్‌లో 85 శాతం పొందిన పేద విద్యార్థులను మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నారు. ఇక ఉత్తమ నటుడిగా ‘ఓ తండ్రి తీర్పు’ (1985)కి, ఉత్తమ సహాయ నటుడిగా ‘ప్రేమించు’ (2001), ‘వేగు చుక్కలు’ (2003) చిత్రాలకు గాను మురళీమోహన్ నంది అవార్డులు అందుకున్నారు. తాజాగా ఆయన అవార్డుల జాబితాలో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు చేరింది.
కీర్తి కిరీటంలో పద్మం
నట కిరీటి అనిపించుకున్న రాజేంద్రప్రసాద్ కీర్తి కిరీటంలో పద్మశ్రీ అవార్డు చేరింది. కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో గద్దె నారాయణ, విజయ చాముండేశ్వరీ దంపతులకు 1956 జూలై 19న రాజేంద్రప్రసాద్ జన్మించారు. నిమ్మకూరు గ్రామంలోని ఎన్టీఆర్ నివాసంలోనే ఉండేవారు నారాయణ. ఆ గ్రామంలోని నందమూరి హరికృష్ణ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించేవారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు రాజేంద్రప్రసాద్‌కు చిన్న నాటి నుంచి మంచి అనుబంధం ఉంది. కాగా రాజేంద్రప్రసాద్ సిరామిక్ ఇంజనీరింగ్‌లో డిపొ్లమా పట్టభద్రుడయ్యాడు. ఓ కంపెనీలో ఉద్యోగానికి చేరినప్పటికీ వయసు చిన్నది కావడంతో రాజీనామా చేయాల్సిన పరిస్థితి. ‘తాతమ్మ కల’ షూటింగ్ చూసిన తర్వాత రాజేంద్రప్రసాద్‌కి సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు ఎన్టీఆర్, ఆయన సోదరుడు త్రివిక్రమ రావు సూచన మేరకు నటనలో శిక్షణ తీసుకున్నారు.
‘స్నేహం’తో... బాపు దర్శకత్వంలో రూపొందిన ‘స్నేహం’ (1977) నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలి చిత్రం. ఆ తర్వాత ‘మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు’ తదితర చిత్రాల్లో చేసిన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ప్రేమించు పెళ్లాడు’ సినిమాతో రాజేంద్రప్రసాద్‌ని హీరోగా పరిచయ చేశారు దర్శకుడు వంశీ. ఆ తర్వాత వంశీ దర్శకత్వంలోనే చేసిన ‘లేడీస్ టైలర్’తో రాజేంద్రప్రసాద్‌కి హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. జంధ్యాల దర్శకత్వంలో హీరోగా నటించిన ‘అహ నా పెళ్ళంట’ స్టార్‌ని చేసింది. ‘క్విక్ గన్ మురుగన్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు.
‘మేడమ్ ’ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి, తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇంకా ‘ఆ నలుగురు, ఓనమాలు, మీ శ్రేయోభిలాషి’ వంటి చిత్రాల్లో నటుడిగా ప్రేక్షకులు మనసులను తాకారు రాజేంద్రప్రసాద్.
అవార్డులు: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు 2015లో అధ్యక్షుడిగా చేశారు రాజేంద్రప్రసాద్. అవార్డుల విషయానికొస్తే... ‘ఎర్ర మందారం’ (1991)తో ఉత్తమ నటుడిగా, ‘మేడమ్’ (1994)కి స్పెషల్ జ్యూరీ, ‘ఆ నలుగురు’ (2004)కి ఉత్తమ నటుడిగా, ‘టామీ’ (2014)కి ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు రాజేంద్రప్రసాద్. తాజాగా పద్మశ్రీ వరించింది.
విలక్షణ నటుడు
హీరో, విలన్, క్యారెక్టర్ ఆరిస్టు... ఇలా భిన్న కోణాల్లో నిరూపించుకున్న మాధవన్‌ను పద్మశ్రీ పురస్కారం వరించింది. మాధవన్ అసలు పేరు రంగనాథన్ మాధవన్. 1970లో జూన్ 1న జంషెడ్‌పూర్‌లోని ఓ తమిళ కుటుంబంలో జన్మించారు. మాధవన్ విద్యాభాసం కొల్హాపూర్‌లో సాగింది. చదువుకునే రోజుల్లో మాధవన్ సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. చదువు పూర్తయ్యాక ముంబైకి రావడం, టీవీ ఇండస్ట్రీలో అవకాశం దక్కడం జరిగింది.
పాటతో ప్రయాణం: తొలుత ‘ఇస్ రాత్ కీ సుబా నహీ’ అనే హిందీ చిత్రంలోని ఓ పాట పాడి, ఇదే పాటలో గెస్ట్‌గా కనిపించారు మాధవన్. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘అలై పాయుదే..’ (2000) చిత్రంతో మాధవన్‌కి నటుడిగా బ్రేక్ వచ్చింది. ‘మిన్నలే, డుమ్ డుమ్ డుమ్’ చిత్రాలూ మాధవన్‌కు గుర్తింపును తెచ్చిపెట్టాయి. కానీ 2002లో ‘రన్’ సినిమా మాధవన్‌కు మంచి కమర్షియల్ సక్సెస్‌ను తెచ్చిపెట్టింది. ‘రెహ్నా హై తేరే దిల్ మే’ (‘మిన్నలే’ సినిమాకు రీమేక్) హిందీలో మాధవన్‌కు తొలి చిత్రం.
ఆ తర్వాత ‘రంగ్ దే బసంతి, గురు, త్రీ ఇడియట్స్, తను వెడ్స్ మను, సైతాన్, ధురంధర్’ చిత్రాల్లో నటించారు. తెలుగులో ప్రకాశ్ దంతులూరి డైరెక్షన్‌లో నవదీప్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘ఓం శాంతి’ చిత్రంలో నటించారు. నాగచైతన్య ‘సవ్వసాచి’లో మాధవన్ విలన్‌గా నటించి, మెప్పించారు. మాధవన్∙నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన బయోగ్రాఫికల్ డ్రామా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డు దక్కింది. నటుడిగా–దర్శకుడిగా మాధవన్ ప్రతిభకు ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం దక్కింది.


