గృహ రుణ మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో జారీ అయిన మొత్తం గృహ రుణాల విలువలో 50 శాతం ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే ఉన్నట్టు క్రిఫ్ హైమార్క్ సంస్థ వెల్లడించింది. ప్రైవేటు రంగ బ్యాంక్‌లను ఈ విభాగంలో ప్రభుత్వరంగ బ్యాంకులు అధిగమించినట్టు తెలిపింది.
ఇక మొత్తం రుణాల్లో 40 శాతం రూ.75 లక్షలకు మించిన గృహ రుణాలే ఉన్నాయి. మొత్తం యాక్టివ్ రుణాలు (చెల్లింపులు కొనసాగుతున్నవి) 3.3 శాతం పెరిగి 2.29 కోట్లకు చేరాయి. రిటైల్ రుణాల్లో అతిపెద్ద విభాగమైన గృహ రుణాల మార్కెట్ సెప్టెంబర్ త్రైమాసికంలో 11.1 శాతం పెరిగి రూ.42.1 లక్షల కోట్లకు చేరింది.
కన్జ్యూమర్ డ్యూరబుల్ రుణాల విభాగంలో డిమాండ్ స్తబ్దుగా ఉందంటూ.. 10.2 శాతం వృద్ధి కనిపించినట్టు క్రిఫ్ హైమార్క్ నివేదిక తెలిపింది. 31 నుంచి 180 రోజుల వరకు చెల్లింపుల్లేని వినియోగ రుణాలు జూన్ చివరికి 3.1 శాతంగా ఉంటే, సెప్టెంబర్ చివరికి 3 శాతానికి తగ్గాయి.
ప్రభుత్వ బ్యాంకుల వాటా ఎక్కువ ఉండటానికి కారణాలు
వడ్డీరేట్లు సాధారణంగా తక్కువగా ఉండటం
ప్రభుత్వరంగ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో హోమ్ లోన్లు ఇస్తాయి. ప్రైవేట్ బ్యాంకులతో పోల్చితే వారి ప్రాసెసింగ్ ఫీజులు కూడా తక్కువగా ఉంటాయి.
ప్రభుత్వంపై నమ్మకం
ఇంటి కోసం తీసుకునే రుణం ఎక్కువ సంవత్సరాల పాటు ఉంటుంది. ప్రజలకు ప్రభుత్వరంగ బ్యాంకులపై ఉన్న భద్రతా భావం కారణంగా అక్కడి నుంచే రుణం తీసుకోవాలనే భావన బలంగా ఉంటుంది.
ప్రభుత్వ హౌసింగ్ స్కీములు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) వంటి పథకాలు సాధారణంగా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీలతో ఇస్తారు. దీంతో ప్రభుత్వ బ్యాంకుల హౌసింగ్ లోన్ డిమాండ్ పెరుగుతుంది.
పెద్ద మొత్తాల రుణాలు
వినియోగదారులకు పెద్ద మొత్తాల రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వ బ్యాంకులు ముందుంటాయి. గణాంకాల ప్రకారం.. మొత్తం రుణాల్లో 40% రూ.75 లక్షలకుపైబడినవే ఉంటున్నాయి. ఇంత పెద్ద మొత్తాల రుణాలను ఇచ్చే ధైర్యం, ఫండింగ్ సామర్థ్యం ప్రభుత్వ బ్యాంకుల్లో ఎక్కువ.
రిస్క్ తీసుకునే సామర్థ్యం
ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ క్రెడిట్ స్కోర్, స్థిరమైన ఆదాయం వంటి షరతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రం మధ్య తరగతి వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ఆదాయం గలవారికి కూడా రుణాలు ఇవ్వడానికి ముందుంటాయి.
బ్రాంచ్ నెట్‌వర్క్ భారీగా ఉండటం
గ్రామీణ, పట్టణాల్లో ప్రభుత్వ బ్యాంకుల శాఖలు ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే చాలా ఎక్కువ. ఫలితంగా లోన్ యాక్సెస్ సులభంగా ఉంటుంది.


