
బాండ్ల జారీతో రూ.1,000 కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్‌ప్రైజెస్ బాండ్ల జారీ విజయవంతమైంది. బాండ్ల ఇష్యూ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే పూర్తి సబ్ర్‌స్కిప్షన్ లభించింది. వెరసి మారి్పడికి వీలుకాని డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించింది. బుధవారం(9న) ప్రారంభమైన ఎన్‌సీడీ ఇష్యూ ఈ నెల 22న ముగియనుంది. అయితే అధిక స్పందన కారణంగా గడువుకంటే ముందుగానే ముగించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
నిర్ధారిత(ఫిక్స్‌డ్) వడ్డీ రేటుతో ఇన్వెస్టర్లకు బాండ్లను(ఎన్‌సీడీలు) జారీ చేయడం ద్వారా కంపెనీలు నిధులు సమీకరించే సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ దిగ్గజం అదానీ ఎంటర్‌ప్రైజెస్ తాజాగా 9.3 శాతం వార్షిక వడ్డీతో ఎన్‌సీడీలను ఆఫర్ చేసింది. ఇష్యూకి మధ్యాహా్ననికల్లా రూ. 1,400 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు స్టాక్ ఎక్సే్ఛంజీల డేటా వెల్లడించింది. ముందుగా వచ్చినవారికి ముందుగా పద్ధతిలో కంపెనీ బాండ్ల ఇష్యూని చేపట్టడం గమనార్హం!
ఇది రెండో ఇష్యూకాగా.. కంపెనీ ఇంతక్రితం గతేడాది సెప్టెంబర్‌లోనూ రూ. 800 కోట్ల విలువైన ఎన్‌సీడీలను జారీ చేసింది. రూ. 500 కోట్ల ప్రాథమిక విలువతో ప్రస్తుత ఆఫరింగ్‌ను చేపట్టింది. అధిక స్పందన లభిస్తే మరో రూ. 500 కోట్ల విలువైన బాండ్ల జారీకి వీలుగా గ్రీన్‌షూ ఆప్షన్‌తో ఇష్యూకి తెరతీసింది. ఒక్కో ఎన్‌సీడీ ముఖవిలువ రూ. 1,000కాగా.. ఇన్వెస్టర్లు కనీసం 10 బాండ్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ నిధుల్లో కనీసం 75 శాతాన్ని రుణ చెల్లింపులకు వినియోగించనుంది. ఎన్‌సీడీలను 24, 36, 60 నెలల గడువుతో జారీ చేస్తోంది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు బీఎస్‌ఈలో స్వల్ప నష్టంతో రూ. 2,582 వద్ద ముగిసింది.