
భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా యూఎస్‌కు రాకపోకలు సాగించే విమాన సర్వీసుల టికెట్ ధరలను ఆయా విమానయాన కంపెనీలు ఉన్నట్టుండి పెంచినట్లు తెలుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సర్వీసులు అందిస్తున్న మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్.. వంటి కంపెనీలు యూఎస్ నుంచి హెచ్-1బీ, హెచ్-4 వీసాలు కలిగి విదేశాల్లో సర్వీసులు అందిస్తున్న తమ ఉద్యోగులను వెంటనే అమెరికా రావాలని అడ్వైజరీలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి యూఎస్‌కు సర్వీసులు నడుపుతున్న విమానయాన కంపెనీలు టికెట్ ధరలను పెంచినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి.
యూఎస్ వెలుపల ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాలు కలిగిన కంపెనీ ఉద్యోగులను ఆయా సంస్థలు సెప్టెంబర్ 21, 2025లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరాయి. దాంతో భారత్ వంటి దేశాల్లో అమెరికా వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. రేపటిలోపు ట్రంప్ విధించిన గడువు ముగుస్తుండడంతో ఉద్యోగులు అత్యవసరంగా యూఎస్‌కు పయణమవుతున్నారు. ఇదే అదనుగా విమానయాన కంపెనీలు టికెట్ ఫేర్‌ను పెంచుతున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై 1,00,000 అమెరికా డాలర్ల రుసుము విధిస్తూ ఇటీవల కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అమెరికాలోనే ఉద్యోగులు తమ పనిని కొనసాగించాలని కోరుతూ, వెంటనే యూఎస్‌కు రావాలని మైక్రోసాఫ్ట్‌తోపాటు ఇతర టెక్ కంపెనీలు తమ సూచిస్తున్నాయి. ఈమేరకు ఉద్యోగులకు అంతర్గత ఈమెయిళ్లు పంపిస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొందరు చెబుతున్నారు. సాధారణంగా హెచ్1-బీ వీసాలు లాటరీపై ఆధారపడతుంది. అందుకు నామినల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వీసా జారీ అయితే మాత్రం వార్షిక రుసుము పే చేయాలి. ఈ ఫీజునే ట్రంప్ ప్రభుత్వం 1 లక్ష డాలర్లకు పెంచింది. ఇప్పటివరకు ఇది 4,000 డాలర్ల వరకు ఉండేది. ఈ రుసుమును సాధారణంగా కంపెనీలే భరిస్తాయి. దీని పెంపు కంపెనీలకు భారం కానుంది.
ఇదీ చదవండి: ‘ఎక్కడున్నా రేపటిలోపు యూఎస్ రావాలి’