మలయాళ సూపర్ స్టార్ దిలీప్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా కోర్టు తీర్పు ఇచ్చింది. 2017లో జరిగిన నటి అపహరణ, దాడి కేసులో కేరళ కోర్టు ఈరోజు ఉదయం 11 గంటలకు తీర్పు వెలువరించింది. 2017లో జరిగిన నటిపై జరిగిన లైంగిక దాడి కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న నటుడు దిలీప్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ, ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి హనీ ఎం వర్గీస్ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో మొదటి ఆరుగురు నిందితులతో పాటు పల్సర్ సునిని ప్రధాన దోషులుగా తేల్చారు. దిలీప్‌పై 120 బి అభియోగాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయమూర్తి తెలిపారు.
2017 కేరళ నటి దాడి కేసు
మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో గుర్తింపు పొందిన ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి, వేధింపులకు గురి చేసిన కేసులో దిలీప్ ఎనిమిదో నిందితుడిగా ఉన్నాడు. 2017, ఫిబ్రవరి 17వ తేదీ రాత్రిపూట ఓ హీరోయిన్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లి, కారులోనే రెండు గంటలపాటు వేధింపులకు పాల్పడ్డారు కొందరు దుండగులు. ఆపై ఆ వేధింపుల పర్వాన్ని ఫోన్‌లలో రికార్డు చేసి.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడాలని చూశారు. ఈ కేసులో దిలీప్‌తో పాటు పది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆపై బెయిల్‌పై విడుదల చేశారు.


