మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన సినిమా 'కాంత'.. నవంబరు 14న విడుదలైన ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. పీరియాడిక్ జానర్‌లో వచ్చిన ఈ మూవీని దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో సముద్రఖని, రానా కీలక పాత్రలు పోషించారు.
కాంత ఓటీటీ (Kaantha OTT)పై ప్రకటన రావడంతో షోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉండనుంది.

కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1950 బ్యాక్‌డ్రాప్‌లో ఓ స్టార్ హీరో- దర్శకుడి చుట్టూ తిరుగుతుంది. అయ్య(సముద్రఖని) ఓ గొప్ప సీనీ దర్శకుడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘శాంత’. ‘నట చక్రవర్తి’ టీకే మహదేవన్ అలియాస్ టీకేఎం(దుల్కర్ సల్మాన్) హీరోగా ప్రారంభమైన ఈ సినిమా ఓ కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఈ కథను టీకే మహదేవన్‌తోనే తెరకెక్కించాల్సి వస్తుంది.
అయ్యకు ఇష్టంలేకపోయినా..ప్రొడ్యూసర్ కారణంగా టీకేఎంతో సినిమా చేసేందుకు ఒప్పుకుంటాడు. కానీ టీకేఎం ఈ సారి ఈ కథ క్లైమాక్స్‌ని మార్చి దానికి ‘కాంత’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తాడు. అంతేకాదు అయ్యను కేవలం కుర్చీకే పరిమితం చేసి తనకు నచ్చినట్లుగా సినిమాను తీస్తుంటాడు. ఇందులో కొత్త అమ్మాయి కుమారి(భాగ్యశ్రీ) హీరోయిన్. ఆమెను నటిగా తీర్చిదిద్దింది కూడా అయ్యనే. అటు హీరో, ఇటు దర్శకుడి మధ్య ఈగో వార్ జరుగుతున్నప్పటీకీ..సినిమా షూటింగ్ మాత్రం ఆగదు.
చివరి రోజు ఒకే ఒక్క సీన్ మిగిలి ఉండగా..హీరో-దర్శకుడి మధ్య గొడవ జరిగి షూటింగ్ ఆగిపోతుంది. అదే రోజు స్టూడియోలో ఓ హత్య జరుగుతుంది. అది ఎవరిది? ఎందుకు చేశారు? గురు శిష్యులైన అయ్య, టీకేఎం మధ్య ఎందుకు విబేధాలు వచ్చాయి? వీరిద్దరి ఈగోల కారణంగా కుమారికి జరిగిన నష్టం ఏంటి? స్టూడియోలో జరిగిన హత్య కేసును పోలీసు అధికారి ఫీనిక్స్(రానా) ఎలా సాల్వ్ చేశాడు?అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


