ఒక పాటలో కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు అన్నారో కవి. అది పాటకే పరిమితం కాదు, వాస్తవం. ప్రపంచంలో చాలా మంది తమలోని వైకల్యాన్ని అధిగమించి అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. పలు అవమానాలను, అవహేళనలను దాటుకుని అకుంఠిత దీక్షతో ఎదిగిన వారెందరో.. అలాంటి స్ఫూర్తిదాయకులు అన్ని రంగాల్లోనూ ఉంటారు. అలా తన వైకల్యాన్ని అధిగమించి గీత రచయితగా రాణిస్తున్న కవి కరుణాకరన్.
ఆత్మస్థైర్యం ఎక్కువ
ఈయనకు రెండు కాళ్ళు పని చేయవు. వీల్‌చైర్‌లోనే కూర్చుంటారు. బాహ్య ప్రపంచాన్ని చూడాలంటే ఒక వ్యక్తి సాయం అవసరం. అయితే కరుణాకరన్‌కు ఆత్మస్థైర్యం ఎక్కువ. అందుకు కారణం తనకున్న ప్రతిభ. ముఖ్యంగా సినీ సాహిత్యంపై మంచి పట్టు ఉన్న రచయిత. అయితే ప్రతిభ ఉన్నంత మాత్రాన అవకాశాలు రావు. అందుకోసం నిరంతర శ్రమ, పట్టుదల, ప్రయత్నం అవసరం.
ఈయన పాటలు ఏం రాస్తారులే?
అంగవైకల్యం అనే లోపం వల్ల చాలా అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నానని అంటున్న కరుణాకరన్ ఇప్పుడు ప్రముఖ సినీ గీతా రచయితగా రాణిస్తున్నారు. పోరాడే గుణం మాత్రమే అపజయాలను చెదరగొడుతుంది అంటున్న ఈయన తన సినీ ప్రయాణమే ఒక పోరాటం అన్నారు. దివ్యాంగుడైన ఈయన పాటలు ఏం రాస్తారులే అని పలువురు పరిహాసం చేశారన్నారు.
అలా సినీ ఎంట్రీ
అలా తన ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టిన ఘటనలను అధిగమించి, పలువురు తనపై ఉంచిన నమ్మకంతో, ఆత్మస్థైర్యంతోను ఈ స్థాయికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. భగవంతుడు, దివంగత ప్రఖ్యాత గీత రచయిత కన్నదాసన్ మార్గ దర్శకత్వం, తన అన్వేషణ, ప్రతిభ, ప్రయత్నాలతోనే సినీ రంగ ప్రవేశం చేశానన్నారు.
వల్లభ ఫస్ట్ మూవీ
దివంగత ప్రముఖ గీత రచయిత వాలి తనకు గొప్ప శక్తి అని పేర్కొన్నారు. తనను ఆదరిస్తున్న దర్శకులకు, సంగీత దర్శకులకు, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. హీరో శింభు నటించిన వల్లభ చిత్రం ద్వారా ఈయన గీత రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు అవరోధాలను అధిగమించి పలు చిత్రాలకు పాటలు అందించారు.
మంచి పేరు
ఇటీవల విడుదలైన నిర్వాకం పొరుప్పల్ల, కిణరు చిత్రాలకు ఈయన రాసిన పాటలకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం విశాల్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న మకుటం చిత్రం, వెబ్ టుడే తదితర చిత్రాలకు కరుణాకరం పాటలను రాస్తున్నారు అదేవిధంగా తెలుగు, మలయాళం, హిందీ ఇతర భాషల నుంచి అనువాదం అవుతున్న చిత్రాలకు ఈయన మాటలు, పాటలు అందిస్తున్నారు.


