ఘనంగా సావిత్రి మహోత్సవం
అందం, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో మహానటిగా చెరగని ముద్ర వేశారు సావిత్రి. శనివారం (డిసెంబరు 6) ఆమె 90వ జయంతిని పురస్కరించుకుని సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో సంగమం ఫౌండేషన్ చైర్మన్ సంజయ్ కిశోర్ నిర్వహణలో హైదరాబాద్‌లో ‘సావిత్రి మహోత్సవం’ని ఘనంగా నిర్వహించారు.
ఈ జయంతి ఉత్సవాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ– ‘‘మహానటికి మరణం లేదు. ప్రతి చిత్రంలో ఆమె పాత్ర మాత్రమే కనిపించేది తప్ప సావిత్రి కనిపించేది కాదు’’ అన్నారు.

ఈ వేదికపై ‘మహానటి’ చిత్రనిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్‌లను, అలాగే రచయిత సంజయ్ కిశోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్యలను సత్కరించారు. అదే విధంగా 90 మంది బాల గాయనీమణులు సావిత్రి పాటల పల్లవులను ఆలపించారు. ఇంకా సావిత్రి పాటల పోటీ విజేతలకు బహుమతులు అందించారు. నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మురళీమోహన్, తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు.


