బలప్రదర్శనకు సెంగొట్టయ్యన్ సన్నద్ధం
సాక్షి, చైన్నె: కొంగు మండలంలో తన బలాన్ని చాటేందుకు అన్నాడీఎంకే బహిష్కృత నేత, టీవీకే వర్కింగ్ కమిటీ కన్వీనర్ సెంగొట్టయ్యన్ సన్నద్ధమయ్యారు. ఈనెల 16వ తదీన ఈరోడ్‌లో పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈరోడ్ పర్యటనకు కసరత్తు చేపట్టారు. ప్రభుత్వ, కోర్టు నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటామని, అనుమతి ఇవ్వాలని ఆ జిల్లా పోలీసు యంత్రాంగానికి సెంగొట్టయ్యన్ ఆదివారం విజ్ఞప్తి చేశారు. వివరాలు.. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించినానంతరం ఆ పార్టీ సీనియర్‌నేత సెంగొట్టయ్యన్ విజయ్ సమక్షంలో తమిళగ వెట్రి కళగం(టీవీకే)లోచేరిన విషయం తెలిసిందే. ఆయనకు విజయ్ సముచిత స్థానం ఇచ్చారు. ఆయన సీనియారిటీ, రాజకీయ అనుభవాన్ని పరిగణించి పార్టీ వర్కింగ్ కమిటీ సమన్వయ కర్తగా నియమించారు. అలాగే కొంగు మండలంలోని నాలుగు ప్రధాన జిల్లాలో ఆయన కీలకంగా ఉండటంతో అక్కడి ఇన్‌చార్జ్ బాధ్యతలను కూడా కట్టబెట్టారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చినానంతరం టీవీకే బలోపేతం దిశగా కొంగు మండలంలోని నేతలతో నిత్యం సప్రదింపులు, సమావేశాలతో సెంగొట్టయ్యన్ బిజీగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో కొంగు మండలంలో అసంతృప్తితో ఉన్న అన్నాడీఎంకే నేతలు, మళ్లీ సీటు దక్కదన్న భావనలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు , తమకు ఈసారి కూడా అవకాశం ఇవ్వరన్న వేదనతో ఉన్న ముఖ్య నేతలను టీవీకే వైపుగా మళ్లించేందుకు సెంగొట్టయ్యన్ పావులు కదుపుతూ వస్తున్నారు. కొంగు మండలంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, టీవీకే సమన్వయకర్త సెంగొట్టయ్యన్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే. ఈ దృష్ట్యా, ఆ సామాజిక వర్గం బలాన్ని విజయ్‌కు మద్దతుగా మలిచే దిశగా వ్యూహాలకు సెంగొట్టయ్యన్ పదును పెట్టే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా బలాన్ని చాటే విధంగా విజయ్ మీట్ ది పీపుల్ కార్యక్రమానికి కసరత్తు చేపట్టారు.
అనుమతికి వినతి..
కరూర్ ఘటన తదుపరి విజయ్‌మీట్ ది పీపుల్‌కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈనెల నాలుగున సేలంలో పర్యటించేందుకు సిద్ధమైనా అనుమతి దక్కలేదు. పుదుచ్చేరిలో 5 వ తేదీన పర్యటించేందుకు కసరత్తు చేసుకున్నా, అనుమతి ఆలస్యంగా దక్కడంతో 9వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఈపరిస్థితులలో తమిళనాట మళ్లీ మీట్‌ది పీపుల్‌ను సెంగొట్టయ్యన్ ఇలాకా నుంచి మొదలెట్టేందుకు విజయ్ సిద్ధమయ్యారు. ఈనెల 16వ తేదీన ఈరోడ్‌లో విజయ్ పర్యటనకు సెంగొట్టయ్యన్ కసరత్తు విస్తృతం చేశారు. విజయ్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ, వేదికల, ఇతర వివరాలతో సమగ్ర వినతి పత్రాన్ని ఈరోడ్‌జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం సెంగొట్టయ్యన్ సమర్పించారు. విజయ్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని పేర్కొంటూ, ప్రభుత్వం, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లుకు సిద్ధం, త్వరితగతిన అనుమతి ఇవ్వాలని విన్నవించారు. విజయ్ పర్యటనను జయప్రదం చేస్తామని, ఆయన పర్యటన రోజున అన్నీ తెలుస్తాయంటూ, అన్నాడీఎంకే నుంచి చేరికల గురించి సంధించిన ప్రశ్నకు ఈసందర్భంగా సెంగొట్టయ్యన్ సమాధానం ఇచ్చారు.


