ఈడీ లేఖ లీక్‌పై సీబీసీఐడీ విచారణ
డీజీపీ కార్యాలయం ఆదేశాలు ఉద్యోగాల్లో అక్రమాల వ్యవహారం
సాక్షి, చైన్నె: రాష్ట్ర నగరాభివృద్ధి, నీటి పారుదల శాఖలో గత ఏడాది జరిగిన 2,538 ఉద్యోగాల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఈడీ రాసిన లేఖ బయటకు లీక్ కావడంపై పోలీసు యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై విచారణను సీబీసీఐడీకి అప్పగిస్తూ డీజీపీ కార్యాలయం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024లో పై శాఖలో 2538 పోస్టుల భర్తీలో పెద్దఎత్తున లంచం తాండవం చేసి ఉందని, రూ. 25 నుంచి రూ.30 లక్షల వరకు ఒక్కో పోస్టులను అమ్ముకున్నట్టుగా తమకు సమాచారం లభించినట్టురాష్ట్ర డీజీపీకి ఈడీ ఓ లేఖ రాసిన సమాచారం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అధికార పక్షంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. అదే సమయంలో ఈ లేఖ వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని మధురై ధర్మాసనంలో వాజ్యం సైతం దాఖలైంది. ఈ వ్యవహారం కాస్త ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసినట్లయ్యింది. డీజీపీకి ఈడీ రహస్యంగా రాసిన లేఖ ఎలా లీక్ అయ్యిందో అన్న చర్చ ఊపందుకుంది. అస్సలు ఈ లేఖను ఎవరు లీక్ చేశారో అన్నది నిగ్గు తేల్చేందుకు డీజీపీ కార్యాలయం సన్నద్ధమైంది. విచారణను సీబీసీఐడీకి అప్పగిస్తూ , ప్రత్యేక విచారణ అధికారి నియామకానికి చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అత్యంత రహస్యంగా డీజీపీకి పంపించాల్సిన లేఖ ఎలా బహిర్గతమైందో, ఆ లేఖ వాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ చేతికి ఎలా చేరిందో అన్న వ్యవహారాలపై సీబీసీఐడీ దృష్టి పెట్టేందుకు సన్నద్దమైంది. ఈలేఖ బయట పడ్డ సమయంలో బీజేపీ వర్గాలు తీవ్రంగా డీఎంకే ప్రభుత్వంపై ఆరోపణల దాడి చేయడం గమనార్హం.


