17న కులగణన కోసం పోరు
– అన్బుమణి వెల్లడి
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో కుల గణనకు డిమాండ్‌చేస్తూ ఈనెల 17న చైన్నె వేదికగా భారీ నిరసనకు అన్బుమణి నేతృత్వంలోని పీఎంకే శిబిరం నిర్ణయించింది. ఇందులో పాల్గొనాలంటూ కులగణనను ఆశిస్తున్న అన్ని పార్టీలకు, ప్రజా సంఘాలకు అన్బుమణి ఆదివారం పిలుపు నిచ్చారు. వివరాలు.. వన్నియర్‌రిజర్వేషన్ల సాధన నినాదంతో అన్బమణి నేతృత్వంలోని పీఎంకే వర్గాలు పోరాటల బాట పట్టిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో కుల గణన జరగాల్సిందేనని నినాదిస్తూ పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగా తొలుత చైన్నె వేదికగా ఈనెల 17న భారీ నిరసనకు అన్బుమణి పిలుపు నిచ్చారు. కులగణన జరగాల్సిందే అన్న నినాదంతో ముందుకెళ్తున్న పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలన్నీ ఈ నిరసనల భాగస్వామ్యం కావాలని అన్బుమణి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పిలుపు నిచ్చారు. వన్నియర్ రిజర్వేషన్ల విషయంలో డీఎంకే నాటకాలు ఆడుతున్నదని మండి పడ్డారు. తాజాగా కులగణనను విషయంలో కేంద్రంపై విమర్శలు చేస్తూ తప్పించుకుంటున్నారని, ఈసారి తాము కులగణనకు పట్టిన పట్టు వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కళ్లు పొడిచేస్తున్నారు..
రాందాసు వేళ్లతో అన్బుమణి కళ్లను జీకే మణి పొడిచేస్తున్నారంటూ ఆ పార్టీ నేత బాలు ఆరోపనలు చేశారు. పీఎంకే వివాదం గురించి అన్బుమణి తరపు నేత, న్యాయవాది బాలు మీడియాతో మాట్లాడుతూ, రాందాసు చలా మంచి వారు అని, అయితే, ఆయన చుట్టూ ఉన్న వారి కారణంగానే తమ నేత అన్బుమణికి కష్టాలు, సమస్యలు ఎదురైనట్టు వివరించారు. పార్టీ గౌరవ అధ్యక్షుడిగా చెప్పుకునే జీకే మణి తన కుట్రలను ప్రయోగిస్తూ, పీఎంకేను చీల్చేస్తున్నారని మండి పడ్డారు. రాందాసు వేళ్లతో అన్బుమణి కళ్లను జీకే మణి పొడిచేస్తున్నాడని మండి పడ్డారు. అన్బుమణి పార్టీ అధ్యక్షుడు అని, ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ లేఖ ఇచ్చిందన, ఈ లేఖను వెనక్కు తీసుకోలేదని స్పష్టం చేశారు.


